విక్రమ్‌ కూడా రెడీ

డైరెక్ట్‌గా తెలుగు సినిమాలు చేయాలని నాకూ వుంది.. మంచి కథ వస్తే తెలుగు హీరోలతో కలిసి మల్టీ స్టారర్‌ చిత్రాల్లోనూ నటించేందుకు సిద్ధం.. 

- ఇవి పరమ రొటీన్‌ డైలాగులు. తమిళ హీరోలు తమ సినిమాల ప్రమోషన్‌ కోసం తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేయడానికి చెప్పే మాటలివి. ఎవరిదాకానో ఎందుకు, మన తెలుగోడే అయినా, ఇంతవరకు స్ట్రెయిట్‌గా తెలుగులో సినిమా చేయలేదు. కానీ, కార్తీ అలా కాదు. మాట చెప్పాడు, పాటించేశాడు. 'ఊపిరి' సినిమాలో నాగార్జునతో కలిసి నటించి, మెప్పించేశాడు. 

ఇక, తాజాగా తమిళ హీరో విక్రమ్‌కి కూడా తెలుగులో స్ట్రెయిట్‌ సినిమా చేయాలని వుందట. ప్రస్తుతం తన తాజా చిత్రం 'ఇంకొక్కడు' ప్రమోషన్‌లో బిజీగా వున్న విక్రమ్‌, మంచి కథ దొరికితే తెలుగు సినిమాల్లో నటిస్తానంటున్నాడు. మల్టీస్టారర్‌ సినిమాలకు తాను ఎప్పుడూ సిద్ధంగా వుంటాననీ చెప్పుకొచ్చాడు. విక్రమ్‌కి తెలుగు సినీ పరిశ్రమలోనూ మంచి క్రేజ్‌ వున్న మాట వాస్తవం. అందుకే, విక్రమ్‌ సినిమాలు ఈ మధ్య అంచనాల్ని అందుకోలేకపోతున్నా, అతని సినిమాలొస్తున్నాయంటే, తెలుగు రైట్స్‌కి డిమాండ్‌ బాగానే పలుకుతోంది. చూద్దాం.. విక్రమ్‌ అయినా మాట నిలబెట్టుకుంటాడో లేదో.! 

అన్నట్టు, విక్రమ్‌ చాన్నాళ్ళ క్రితం తెలుగులో నటించాడు. '9 నెలలు' అనే సినిమాలో సౌందర్యతో కలిసి నటించాడు విక్రమ్‌. 

Show comments