విభజన లొల్లి.. మరొకటి

ఏపీ, తెలంగాణలు వేర్వేరుగా ఏర్పడినప్పటి నుంచి ఏదో ఓ వివాదం రెండు రాష్ట్రాల మధ్య రగులుతూనే ఉంది. నదీ జలాల వివాదం రోజురోజుకు ముదురుతూనే ఉంది. ఢిల్లీ వెళ్లి కేంద్రం పెద్దల ముందు పంచాయితీ పెట్టుకున్నా ఆ సమస్య పరిష్కారం కాలేదు. మీరు మీరు కూర్చుని ఓ అవగాహనకు రండని ఢిల్లీ పెద్దలు నింపాదిగా చెప్పేసి ఆ చిచ్చును ఆర్పకుండా వదిలేసారు. ఇది ఓవైపు ఢిల్లీలో రగులుతూనే ఉంది. ఇరు రాష్ట్రాల సాగునీటి మంత్రులు దేవినేని, హరీష్‌లు ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకుంటూనే ఉన్నారు. ఇంతలో తెలంగాణ సిఎం మరో కొరివి పెట్టారు.

ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ తెలంగాణదే, దానిని తెలంగాణకు ఇచ్చేయండి అంటూ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖరాసారు. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య మరింత వేడి రాజుకుంది. ఈ వ్యవహారం నీటి వివాదంతో రగిలిపోతున్న ఇరు రాష్ట్రాల నేతల మధ్య అగ్గికి ఆజ్యం తోడైనట్లయింది. ఇక కొన్నాళ్ల పాటు నీళ్ల లొల్లి, ఏపీ భవన్ లొల్లితో ఇరు రాష్ట్రాల నేతలు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటూ అసలు సిసలైన ప్రజాసమస్యలను పక్కన బెట్టి తమ రాజకీయ పబ్బం గడుపుకుంటారన్నమాట.

ఢిల్లీ పెద్దలు ఏపీ భవన్‌ను విడదీసి ఎవరికి వారి భాగాలను పంచి ఇచ్చేసారు. రెండేళ్ల నుంచి ఎవరికి కేటాయించిన దానిలో వారుంటున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం పైకి తీసి దీనిపై హక్కులు అడగాల్సిన అవసరం ఉందా అనేది కూడా ఆలోచించాలి. ఇది తెలంగాణేక చెందాలి అన్న వాదన కాసేపు నిజమే అనుకుందాం. కాని ఏపీ, తెలంగాణల మధ్య తేల్చుకోవాల్సిన అత్యవసర విషయాలు చాలా ఉన్నాయి కదా. వాటిని పక్కన బెట్టి సీఎం లాంటి పెద్ద మనిషి ఈ వివాదాన్ని ఇప్పుడు తెరపైకి తేవడం మాత్రం సమంజసం కాదు.

ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఏపీ భవన్‌ను తెలంగాణకు ఇవ్వకుంటే వచ్చే నష్టమేమి లేదు. దీంతో తెలంగాణ ప్రజలకు ఒనగూరే తక్షణ ప్రయోజనమూ లేదు. తేల్చాల్సిందేమైనా ఉంటే అత్యవసరమైన నీళ్ల వివాదం. టెన్త్ షెడ్యూల్‌లో ఉన్న ఉమ్మడి సంస్థల వ్యవహారం, ఏపీలో పనిచేస్తన్న తెలంగాణ ఉద్యోగుల వ్యవహారం. వీటిని పట్టించుకోకుండా అటు ఉద్యోగులను వారి కుటుంబాలను ఎటూకాకుండా వదిలేసి ఎందుకు పనికి రాని ఈ ఇష్యూ అవసరమా అన్నది కూడా ఆలోచించాలి. రైతుల కడుపులు నింపే సాగునీరును వదిలేసి ఎందుకు అక్కరకు రాని ఓ భవనం గూర్చి ఇప్పుడు ఆలోచించాలా అన్నది కేసీఆర్ ఆలోచించుకోవాలి.

అది నిజాం స్థలమే కావచ్చు. తెలంగాణ ఏర్పడి రెండేళ్లే కదా అయింది. ఇప్పుడు కాకున్నా మున్ముందైనా ఈ విషయం తేల్చుకోవచ్చు. పైగా అది ఉమ్మడి ఏపీలో కట్టింది కాబట్టి దానికి తగ్గ పరిహారం కూడా చెల్లిస్తానన్నారు. ఇదే స్పందన ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగుల విషయంలో ఎందుకు లేదు. మావారిని పంపించండి, ఇక్కడున్న మీ వారిని పంపిస్తాం, వారితో ఆస్థానాలను భర్తీ చేసుకోండి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వారికి కావాల్సిన ఆర్థిక సహాయం మేమిచ్చుకుంటాం అనొచ్చు కదా. ఇవన్నీ వదిలేసి పనికి మాలిన వాటిని తెరపైకి తెస్తే ముఖం మీద ఎవరేమి అనకున్నా.. లోలోపల మాత్రం ఇదంతా చెత్తరాజకీయం కోసమే అని మాత్రం అనుకుంటారు.

Show comments