చిరు విషయంలో.. అంత ఉలికిపాటు ఎందుకో!

ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఖండన ప్రకటనే విడుదల చేసింది! చిరంజీవి కాంగ్రెస్ ను వీడటం లేదు అంటూ ఆ పార్టీ తరపున రామచంద్రయ్య ఒక పత్రికా ప్రకటన విడుదల చేసి.. వివరణ ఇచ్చాడు. చిరంజీవి తనతో మాట్లాడాడు అని.. పార్టీని వీడటం లేదని తనతో స్పష్టం చేశాడు అని రామచంద్రయ్య ఆ ప్రకటనలో పేర్కొన్నాడు. మరి ఇంతకూ ఈ ఖండన ప్రకటన ఇవ్వడం వెనుక కహానీ ఏమిటి.. అంటే, సోషల్ మీడియాలో ప్రచారాన్ని ఆపడానికే అని ఆయన పేర్కొనడం గమనార్హం!

మరి సోషల్ మీడియాలో ప్రచారానికే కాంగ్రెస్ పార్టీ ఇంతలా ఉలికి పడుతుండటం ఇక్కడ గమనించాల్సిన అంశం. మామూలుగా అయితే ఇలాంటి ప్రచారాన్ని లైట్ తీసుకోవాలి. ఇప్పటికీ కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది ప్రముఖ నేతల విషయంలో ఇలాంటి ప్రచారాలు చాలానే జరుగుతున్నాయి. రఘువీరారెడ్డే కాంగ్రెస్ లో ఉండడు.. చూడండి, అంటూ కొంతమంది సవాళ్లు చేస్తున్నారు!

వీళ్ల లో జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి వంటి వాళ్లే ఉన్నారు. అయితే వైఎస్సార్ సీపీ లేకపోతే.. బీజేపీ.. రఘువీర జంపింగ్ ఖాయమని వీళ్లు నొక్కి వక్కాణిస్తున్నారు. అలాగే శైలజనాథ్, కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి వంటి వాళ్ల విషయంలోనూ ఇలాంటి ప్రచారాలే ఉన్నాయి. అయితే.. వారి విషయంలో ఖండనమండనలు లేవు!

రామ్ చరణ్ వ్యాపార భాగస్వామిగా ఉన్న ట్రూ జెట్ ఎయిర్ వేస్ కు ఏపీ ప్రభుత్వం అయాచితంగా భారీ లబ్ధి కలిగిస్తుండటం… ఇందుకు సంబంధించిన జీవోలు వెలుగులోకి రావడంతో.. చిరంజీవి కి చంద్రబాబు ఈ విధంగా బిస్కెట్లు వేస్తున్నాడనే అభిప్రాయాలు బలపడసాగాయి. ప్రజాధనంతో ఈ విధంగా నిర్లజ్జపూరిత రాజకీయం సాగిపోతోందనే మాట వినిపించ సాగింది. దీంతో కాంగ్రెస్ కు భయం పట్టుకుంది! Readmore!

అందుకే ఇప్పుడు చిరంజీవి తరపున ఆ పార్టీ ఖండన ప్రకటనలు చేస్తోంది. కోట్ల రూపాయల ప్రజాధనం చేతులు మారుతోంది.. దీంతోనే చిరు పార్టీ మార్పు కూడా ఉండవచ్చు.. అనే మాట వినిపించడంతో కాంగ్రెస్ లో మిగిలిన వారికి ఉలికిపాటు ఎక్కువవుతోంది. విభజనతో బీద రాష్ట్రం అయిన ఏపీ.. రైతులను, ఆర్టీసీ బస్సులను విస్మరిస్తూ విమానయాన సంస్థలకు ఇలా దోచి పెట్టడం ఏమిటి? ఇలాంటి రాయితీలు ఇవ్వడం తగదు.. అని మాట్లాడలేని కాంగ్రెస్ పార్టీ.. చిరంజీవి మా పార్టీని వీడటం లేదని మాత్రం ప్రకటన జారీ చేయడం ఏమిటి?

Show comments