రామ్‌గోపాల్ వర్మ సోషల్ మీడియాలో మూడు రోజులుగా సైలెంటయిపోయిన విషయం విదితమే. నాగబాబు, 'ఖైదీ నెంబర్ 150' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో వర్మని తిట్టడం, ఆ తర్వాత వర్మ కంటి మీద కునుకు లేకుండా సోషల్ మీడియాలో కూర్చుని నాగబాబుపైనా, మెగా ఫ్యామిలీపైనా సెటైర్లు వేయడం తెల్సిన విషయాలే.
ఈ వ్యవహారంపై మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించాల్సి వచ్చింది. చాలాకాలంగా వర్మ సోషల్ మీడియాలో కెలుకుతున్నాడు కాబట్టే, నాగబాబు నుంచి ఆ స్థాయి కౌంటర్ వచ్చిందనీ, ఒకర్ని పొగిడేందుకు ఇంకొకర్ని కించపర్చడం ఏం పద్ధతి.? అని చిరంజీవి ప్రశ్నించడం చూశాం. అయినా, వర్మ - మెగాస్టార్ వ్యాఖ్యలపై స్పందించలేదు.
తాజాగా, వర్మ సోషల్ మీడియాలో మరోసారి తనదైన స్టయిల్లో చెలరేగిపోయాడు. బాలకృష్ణ తాజా చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి'ని ఉద్దేశించి పొగడ్తలు కురిపించిన వర్మ, ఆ పొగడ్తల్లో 'మెగా' పదాన్ని పదే పదే వాడేశాడు. 'మెగా పీపుల్', 'మెగా అడ్వాన్స్‌డ్'.. ఇలా సాగింది వర్మ 'శాతకర్ణి' పేరు చెప్పి కొనసాగించిన 'ట్వీట్ల' కెలుకుడు వ్యవహారం.!
మొత్తమ్మీద, మెగాస్టార్ వ్యాఖ్యల తర్వాత కూడా వర్మ తన పంథా మార్చుకోలేదన్నమాట. మెగాస్టార్ అంటే వల్లమాలిన అభిమానం.. అని సోషల్ మీడియాలో చెప్పుకునే వర్మ, 'మెగా' అన్న ప్రస్తావన మీద మాత్రం వీలు చిక్కినప్పుడల్లా అసహనం వెల్లగక్కుతూనే వుంటాడు. ఆయనకు అదో సరదా మరి. 'శాతకర్ణి'కి చిరంజీవి ఆల్ ది బెస్ట్ చెబితే, 'ఖైదీ' సినిమా విజయం సాధించాలని బాలకృష్ణ ఆకాంక్షించాడు. ఆ హీరో ఈ హీరో అన్న తేడా లేకుండా, టాలీవుడ్‌లో పలువురు హీరోలు, పలువురు సినీ ప్రముఖులు రెండు సినిమాల పట్ల సోషల్ మీడియాలో ఒకే తరహా వైఖరి ప్రదర్శిస్తున్నారు. కానీ, వర్మ మాత్రం వెరీ వెరీ స్పెషల్ అంతే.