బిగ్‌ జోక్‌: బాబుని బుజ్జగించిన మోడీ

'మీ దిక్కున్న చోట చెప్పుకోండి..' అన్న మాట అనలేదుగానీ, దాదాపుగా అన్నంత పని చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టు, రాజధాని, ఆర్థిక లోటు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేకప్యాకేజీ.. ఇలా పలు అంశాలకు సంబంధించి. 

'మా మిత్రపక్షం అక్కడ అధికారంలో వుందని మేం ఎక్కువ సాయం చేయడం కుదరదు..' అని తెగేసి చెప్పడంలోనే మొత్తం అర్థం దాగి వుంది. ఇక, కొత్తగా కేంద్రం చెప్పడానికేమీ లేదు. ఒకసారి కాదు, ఒకటికి పదిసార్లు కేంద్రం ఈ వ్యవహారంపై స్పష్టతనిచ్చేసినా, ఆ స్పష్టత ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీకి సరిపోలేదేమో.! చిత్రంగా ఏపీలో మెజార్టీ మీడియా, చంద్రబాబు కనుసన్నల్లోనే నడుస్తోంది. అందుకే, అంతా 'పచ్చ' కళ్ళతోనే చూడాల్సి వస్తోంది. 

వాస్తవం వేరు, జరుగుతున్నది వేరు. ఇంకా ఇంకా జనాన్ని మభ్యపెట్టేందుకే అటు టీడీపీ, ఇటు టీడీపీ అనుకూల మీడియా ఇంకా ఇంకా ప్రయత్నిస్తూనే వుంది. తాజాగా, చంద్రబాబుని బుజ్జగించేందుకు నరేంద్రమోడీ రంగంలోకి దిగారనీ, రాష్ట్రాన్ని ఆదుకునే విషయంలో నరేంద్రమోడీ, చంద్రబాబుకి హామీ ఇచ్చారనీ ప్రచారం మొదలయ్యింది. ఇంతకన్నా దిగజారుడుతనం ఇంకేముంటుంది.? 

రాజకీయ పార్టీలన్నాక ఏమైనా మాట్లాడొచ్చు.. ఎలాగైనా లీకులు ఇచ్చుకోవచ్చు. మీడియానే ఆ పని చేస్తే.? అసలంటూ ఆంధ్రప్రదేశ్‌ని పట్టించుకునే ఉద్దేశ్యమే వుంటే, చంద్రబాబుతో ఏం ఖర్మ, వెంకయ్యనాయుడితో మాట్లాడి చేసెయ్యొచ్చు. చంద్రబాబుని పక్కన పెట్టి, ప్రత్యేక హోదా ఇచ్చేసి.. ఆ క్రెడిట్‌ని స్వయంగా నరేంద్రమోడీ తన ఖాతాలో వేసుకోవచ్చు. ఇతరత్రా విషయాల్లోనైనా అంతే. 

ప్రతిదానికీ లింకు.. ఆఖరికి జాతీయ ప్రాజెక్టు పోలవరానికి కూడా ఒరిస్సాతో లింకు పెట్టారు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ. ఇంతకన్నా ఏం క్లారిటీ కావాలో మరి.! మేటర్‌ క్లియర్‌. మోడీ, 'వుంటే వుండు.. పోతే పో..' అనే సంకేతాల్ని చంద్రబాబుకి పంపేశారు. చంద్రబాబుకే గతిలేక టీడీపీతో అంటకాగుతున్నారు. సేమ్‌ టు సేమ్‌, టీడీపీ అనుకూల మీడియా పరిస్థితీ అంతే.

Show comments