ప్రయోగాత్మక పాత్రల్లో నటించడం అంటే తమిళ హీరోలకు చాలా ఇష్టమైన పని. ఇమేజ్ ను పక్కన పెట్టి నటించడంలో జీవించేస్తూ ఉంటారు అక్కడి హీరోలు. దీనికి ఎవరూ మినహాయింపు కాదు. హీరో పాత్రకు ఉన్న పడికట్టు నిర్వచనాలను చెరిపేస్తూ ఉంటారు తమిళ హీరోలు. అలాగే విలన్ పాత్రలను కూడా చేసేస్తూ వీళ్లు దూసుకపోతున్నారు. కోలీవుడ్ స్టార్ హీరోలు తాము హీరోలుగా నటిస్తున్న సినిమాలకు తామే విలన్లవుతున్నారు. ఒకరి తర్వాత ఒకరిగా ఇలా చేసుకుపోతున్నారు అక్కడి స్టార్ హీరోలు.
తను హీరోగా చేస్తున్న సినిమాల్లో తనే విలన్ పాత్రను కూడా పోషించడం కమల్ హాసన్ కు ఉన్న అలవాటు. ఇంద్రుడు చంద్రుడు వంటి దశాబ్దాల వెనుకటి చిత్రాల నుంచి అభయ్, దశావతారం సినిమాల వరకూ..అనేక సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేశాడు కమల్. ఆ పాత్రలకు వేరే వాళ్లు అయితే న్యాయం చేయలేరన్నట్టుగా కమల్ అన్నింటా తనే కనిపించాడు. ఆ మధ్య రోబోలో రజనీ విలనిజాన్ని పండించాడు. పూర్తి నెగిటివ్ రోల్ అయిన రోబోగా రజనీ కనిపించాడు. ఈ మధ్యనే సూర్య ప్రతినాయకుడిగా ప్రశంసలు అందుకున్నాడు. 24 మూవీతో సూర్య హీరోగా కన్నా.. విలన్ గానే ఎక్కువగా ఆకట్టుకున్నాడు.
ఇక త్వరలోనే విడుదల కానున్న ‘ఇరుముగన్’ లో విక్రమ్ ఒక హీరో పాత్ర, మరో విలన్ పాత్ర చేస్తున్నాడు. అలాగే కార్తీ కూడా ‘కాష్మోరా’ అనే సినిమాలో అటు హీరో పాత్రను, ఇటు విలన్ పాత్రను చేస్తున్నాడు. వీరు మాత్రమే కాదు.. ఇప్పుడు ఈ జాబితాలో అజిత్ కూడా చేరాడు. తన 57వ సినిమాలో అజిత్ హీరోగానే కాకుండా.. విలన్ గా కూడా చేస్తున్నాడు. అటు పాజిటివ్ పాత్రను, ఇటు నెగిటివ్ పాత్రను పోషిస్తున్నాడు. అయితే తను హీరోగా నటిస్తున్న సినిమాలో తనే విలన్ పాత్ర చేయడం అజిత్ కు కొత్తేమీ కాదు. ఇది వరకూ ‘వాలి’ సినిమాలో అజిత్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేశాడు. అందులో హీరోగానూ.. విలన్ గానూ మెప్పించాడు.