స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కిస్తానని ప్రకటించారు ఆయన తనయుడు, సినీ నటుడు, అనంతపురం జిల్లా హిందూపూర్ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.
సినీ రంగంలో స్వర్గీయ ఎన్టీఆర్ పేరు ప్రఖ్యాతుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేశారాయన. నిజానికి, రాముడు, కృష్ణుడు అనే దేవుళ్ళు ఇలా వుంటారని తన పాత్రల ద్వారా చూపించిన ఎన్టీఆర్, దేవుడంటే తానేననేస్థాయిలో ఆ సినిమాల్లో మెప్పించారు. ఇక, రాజకీయ తెరపై ఎన్టీఆర్ సంచలనాలూ అంతే. టీడీపీని స్థాపించి, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో రాజకీయ సునామీ సృష్టించారాయన. ముఖ్యమంత్రిగా ఆయన హయాంలో తెరపైకొచ్చిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు అప్పటికీ, ఇప్పటికీ ఎప్పటికీ నభూతో నభవిష్యతి అనొచ్చేమో.
ఇక, ఎన్టీఆర్ జీవిత చరిత్ర సినిమా సంగతుల విషయానికొస్తే, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందట. ఇందుకోసం ఓ కమిటీని వేశామన్నారు బాలకృష్ణ. కుటుంబ సభ్యుల నుంచి కూడా స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్రపై వివరాలు సేకరిస్తున్నారట. అందరికీ తెల్సిన విషయాలే కాదు, ఎవరికీ తెలియని విషయాలు కూడా వుంటాయని సెలవిచ్చారు బాలకృష్ణ. ఇంతకీ, ఎన్టీఆర్ పాత్రలో ఎవరు నటిస్తారో తెలుసా.? ఇంకెవరు బాలకృష్ణే.!
అంతా బాగానే వుందిగానీ, ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండో సతీమణి లక్ష్మి పార్వతి పాత్ర ఎలా వుండబోతోంది.? స్వర్గీయ ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు పాత్ర ఎలా వుండబోతోంది.? ఏమో మరి, బాలయ్యకే తెలియాలి.