చంద్రబాబూ.. రాలేదా.? రానివ్వలేదా.?

చిత్తూరు జిల్లాకి చెందిన ముఖ్య నేతలతో, టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం ఏర్పాటు చేస్తే.. ఆ సమావేశానికి ఇద్దరు ముఖ్య నేతలు డుమ్మా కొట్టేయడం పార్టీలోనే ఆసక్తికరమైన చర్చకు కారణమయ్యింది. ఇందులో ఒకరు మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కాగా, ఇంకొకరేమో పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్‌.. పైగా, ఈ ఇద్దరూ చంద్రబాబుకి అత్యంత సన్నిహితులు అయి వుండీ, చంద్రబాబుతో సమావేశానికి మొహం చాటేయడం గమనార్హం. 

మంత్రి పదవి పోవడంతో బొజ్జల అలకపాన్పు ఎక్కిన మాట వాస్తవం. అయితే, అంతలోనే ఆయన సర్దుకుపోయారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టే చేసి, వెనక్కి తీసుకున్నారు. చంద్రబాబుపై దుమ్మెత్తిపోస్తూనే, అబ్బే.. చంద్రబాబుతో ఎప్పటికీ విభేదాలు రావని సెలవిచ్చారు. ఇక, శివప్రసాద్‌ సంగతి సరే సరి. 'చంద్రబాబు ఎదురుగా నేనొకసారి ప్రమాదవశాత్తూ కిందపడ్డాను.. ఆయన నన్ను పరామర్శించలేదు, ఎలా వున్నానో తెలుసుకోలేదు.. చాలా అవమానాలు ఎదుర్కొన్నాను..' అంటూ ఇటీవలే గుస్సా అయిన శివప్రసాద్‌, ఆ తర్వాత చంద్రబాబుకీ తనకూ మధ్య ఎవరూ విభేదాలు సృష్టించలేరంటూ ఆశ్చర్యపరిచారు. 

ఇంతకీ, బొజ్జలతోపాటు శివప్రసాద్‌ ఎందుకు చంద్రబాబుతో సమావేశానికి డుమ్మా కొట్టినట్లు.? అలకపాన్పు ఎక్కినట్టే ఎక్కి, దిగిపోయిన ఈ ఇద్దర్నీ చంద్రబాబే దూరం పెట్టారా.? అసలు ఆ సమావేశానికి చంద్రబాబు ఆహ్వానమే పంపలేదా.? ఈ ప్రశ్నలిప్పుడు చిత్తూరు జిల్లా టీడీపీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు తెరలేపాయి. అటు బొజ్జలతోగానీ, ఇటు శివప్రసాద్‌తోగానీ పార్టీకి ఉపయోగం లేదనీ, సమీక్షా సమావేశాలకు పిలిస్తే.. కెలికేస్తారనీ ఓ అవగాహనకి వచ్చిన చంద్రబాబు.. ఇద్దర్నీ దూరం పెట్టినట్లు తెలుస్తోంది. చంద్రబాబు రాజకీయాలు ఇలాగే వుంటాయ్‌ మరి.

Show comments