క్షమాపణ ససేమిరా: తెగేసి చెప్పిన రోజా

'అనిత మీద వ్యక్తిగత విమర్శలు చేయలేదు.. దూషణలు అసలే చేయలేదు.. రాజకీయాల్లో నేను లేకుండా చేయాలనే కుట్ర జరుగుతోంది.. నేనెవరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు..' 

- ఇదీ టీడీపీ ఎమ్మెల్యే అనితపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో మరోసారి సస్పెన్షన్‌ వేటు ఎదుర్కొనే ప్రమాదంలో పడ్డ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా తాజా స్పందన. 

ఇప్పటికే ఏడాదిపాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ అయిన రోజా మెడ మీద మరో 'సస్పెన్షన్‌' కత్తి వేలాడుతోన్న విషయం విదితమే. కాస్సేపట్లో రోజా సస్పెన్షన్‌పై అసెంబ్లీలో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. ఈ నేపథ్యంలో రోజా తాజాగా మీడియా ముందుకొచ్చారు. తానెలాంటి తప్పు చేయలేదంటున్నారామె. అయితే, టీడీపీ వెర్షన్‌ ఇంకోలా వుంది. రోజాపై సస్పెన్షన్‌ వేటు పడాల్సిందేనన్నది ఆ పార్టీ నేతల వాదన. ఈ ఎపిసోడ్‌కి కేంద్ర బిందువు అయిన టీడీపీ ఎమ్మెల్యే అనిత, తనకు రోజా క్షమాపణ చెప్పి తీరాలంటున్నారు. ఏడాది సస్పెన్షన్‌ దిశగా ఆల్రెడీ ప్రివిలేజ్‌ కమిటీ, శాసనసభకు నివేదిక అందించిన విషయం విదితమే. 

మరోపక్క, అసెంబ్లీకి 'క్షమాపణ' విషయమై రోజా లేఖ రాశారనీ, అందులో తాను క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా వున్నట్లు పేర్కొన్నారనే ప్రచారం జరుగుతోంది. తమతో సంప్రదించకుండా క్షమాపణ చెప్పేస్తానని రోజా పేర్కొనడంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అసహనం వ్యక్తం చేశారనే గుసగుసలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, 'క్షమాపణకు ససేమిరా' అంటూ రోజా తెగేసి చెప్పడం విశేషమే మరి. 

'క్షమాపణ చెబితే సస్పెన్షన్‌ వేటు తప్పుతుంది.. లేదంటే వేటు తప్పదు..' అంటూ, టీడీపీ నేతలు చెబుతోంటే, న్యాయపోరాటమైనా చేస్తాను తప్ప, క్షమాపణ చెప్పబోనని రోజా అంటున్నారు. గతంలో రోజా న్యాయ పోరాటం చేసి ఏం సాధించారట.? కాగా, తనను అసెంబ్లీకి దూరం చేయడంతోపాటుగా, పార్టీకి దూరం చేసే దిశగా కుట్రలు జరుగుతున్నాయని రోజా వాపోతుండడం కొసమెరుపు.

Show comments