డ్యామిట్‌.. కథ అడ్డం తిరిగింది

అద్భుతః అనే స్థాయిలో తమిళనాడులో జల్లికట్టు కోసం 'శాంతియుత' పోరాటం జరిగింది. కానీ, ఏ పోరాటాన్నయినాసరే హింసాత్మకంగా మార్చేయడం 'నాయకులకు' వెన్నతో పెట్టిన విద్య కదా.! రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కూడా జల్లికట్టు ఉద్యమాన్ని ఓవర్‌ టేక్‌ చేసేందుకు ప్రయత్నించారు. రైల్‌ రోకోలకు ప్రతిపక్షంలో వున్న డీఎంకే ప్రయత్నిస్తే, అధికార అన్నాడీఎంకే పార్టీ కూడా హడావిడి చేయడానికి ప్రయత్నించింది. 

జల్లికట్టు క్రెడిట్‌ కోసం తమిళ సినీ పరిశ్రమపడరాని పాట్లూ పడింది. 'క్రెడిట్‌ కొట్టేయడానికి ప్రయత్నించొద్దు..' అంటూ సినీ పరిశ్రమకు నటుడు కమల్‌హాసన్‌ క్లాస్ తీసుకున్నారు. ఇంకోపక్క, రెండ్రోజుల్లో దేశం గణతంత్ర దినోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో, చెన్నయ్‌లోని మెరీనా బీచ్‌లో ఆందోళన చేస్తున్న యువతను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. దాంతో, యువత తిరగబడింది.. ఆ తర్వాత పోలీస్‌ స్టేషన్‌ దహనం.. ఊహించని విధ్వంసం. ఇదీ తమిళనాడులో ప్రస్తుత పరిస్థితి. 

మరోపక్క 'కేంద్రం సుముఖంగా వుంది.. ఆర్డినెన్స్‌కీ లైన్‌ క్లియర్‌ అయ్యింది.. అసెంబ్లీ ద్వారా చట్టాన్ని కూడా చేసేస్తున్నాం..' అంటూ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ప్రకటించినా, విద్యార్థులు శాంతించలేదు. ముఖ్యమంత్రి తీరుపై డీఎంకే ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతే.. ఎక్కడో, చిన్న అనుమానం, అది కాస్తా పెనుభూతమయ్యింది.. ఇది కూడా చెన్నైలో అనూహ్యంగా తలెత్తిన హింసకి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

మళ్ళీ సెలబ్రిటీలు రంగంలోకి దిగారండోయ్‌. వాళ్ళంతా, పోలీసులదే తప్పని తేల్చేశారు. 'పోలీసులూ ఇది మీకు మంచిది కాదు..' అంటూ క్లాస్‌ తీసేసుకున్నారు. అలా క్లాస్‌ తీసుకున్నవారిలో ముందు నిలబడ్డాడు కమల్‌హాసన్‌. ఆయనతోపాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా ఈ విధ్వంసంలో పోలీసుల్నే తప్పుపట్టడం గమనార్హం. ఓ పక్క తమిళనాడు వ్యాప్తంగా ఎక్కడికక్కడ జల్లికట్టు జరుగుతోంది. అయినా, విద్యార్థులెందుకు ఇంత అగ్రెసివ్‌గా మారారు.? ఏ అసాంఘీక శక్తులు హింసను ప్రోత్సహించాయి.? ఏమోగానీ, ఈ హింస ఇప్పడు, జల్లికట్టు ఉద్యమాన్ని అపహాస్యం పాల్జేసిందన్నది నిర్వివాదాంశం. Readmore!

Show comments