కర్నాటక ఎంతో కఠినం...చిన్నమ్మకు లేదు మార్గం...!

పాత తెలుగు పౌరాణిక సినిమాలోని ఓ పాటలో 'సాగినంత కాలము నాఅంత వాడు లేడందురు...సాగకపోతే ఊరకే చతికిలపడిపోదురు'..అనే వాక్యముంది. ఇది అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, ప్రస్తుతం బెంగళూరు జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళ నటరాజన్‌ విషయంలో  నిజమైంది. ఒకప్పుడు బతుకుతెరువు కోసం వీడియో క్యాసెట్లు అమ్ముకున్న శశికళ ఏమాశించి జయలలితతో స్నేహం చేసిందోగాని ఆమె స్నేహాన్ని ఆసరా చేసుకొని బాగా ఎదిగింది. భర్తతో కాపురం కూడా వదలుకొని జయ ఇంట్లోనే మకాం వేసి మన్నార్‌గుడి మాఫియాను రంగంలోకి దింపడమే కాకుండా పోయస్‌గార్డెన్‌ నుంచి చాలా తరలించింది. శశికళను ఇంటి నుంచి కాకుండా పార్టీ నుంచి కూడా వెళ్లగొట్టిన జయలలిత మళ్లీ ఆమెను చేరదీయడంతో దశ తిరిగింది. బలం పుంజుకుంది. జయతో కలిసి అక్రమాస్తులు సంపాదించింది. కోట్లకు పడగలెత్తింది. జయలలితను ఆస్పత్రిలో చేర్చినప్పటినుంచి ఆమె చనిపోయేవరకు, ఆ తరువాత శశికళ హవా ఏమిటో చూశాం. జైలు శిక్ష పడినా ఏమాత్రం పశ్చాత్తాపం లేని చిన్నమ్మ జైల్లోనూ దర్పాన్ని ప్రదర్శించింది. తమిళనాడులో తన ముఖ్యమంత్రే ఉన్నాడు చెన్నయ్‌ జైలుకు మారి జల్సా చేయొచ్చని అనుకుంది. కాని కర్నాటక జైలు అధికారులు శశిపట్ల నిర్దాక్షిణ్యంగా, కఠినంగా వ్యవహరిస్తున్నారు.

అక్రమాస్తుల కేసులో ప్రత్యేక కోర్టు శిక్ష విధించిన తరువాత స్నేహితులిద్దరూ షాక్‌ తిన్నారు. కాని కర్నాటక హైకోర్టు వారి నెత్తిన పాలు పోసింది. ఇక తమకు ఎదురు లేదనుకున్నారు. కాని హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో జయ ప్రత్యర్థులతో పాటు కర్నాటక సర్కారు కూడా పిటిషన్‌ వేయడంతో జయ ఒత్తిడికి గురయ్యారు. ఆమె చనిపోవడానికి ఓటమి భయం ఒక కారణం. జయ పోయిన తరువాత రిజర్వు చేసిన తీర్పును సాధ్యమైనంత త్వరగా వెలువరించాలని కర్నాటక ప్రభుత్వం సుప్రీం కోర్టును గట్టిగా అభ్యర్థించింది. చిన్నమ్మ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపికై ముఖ్యమంత్రిగా కూడా పీఠం ఎక్కుదామనుకునే సమయంలో సుప్రీం కోర్టు తీర్పు రావడంతో పూర్తిగా చతికిలపడిపోయింది. నాలుగేళ్ల పాటు జైల్లో గడపాల్సిరావడమే కాకుండా పదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హురాలిని చేయడంతో ఆమెకు రాజకీయ జీవితం లేకుండాపోయింది. వెంటనే జైలుకు వెళ్లకుండా కొంతకాలం కాలక్షేపం చేద్దామనుకుంది. కోర్టు నో చెప్పింది.

తనను తాను వీవీఐపీగా భావిస్తూ ప్రత్యేక సౌకర్యాల కోసం డిమాండ్‌ చేసిన శశికళకు జైలు అధికారులు నిర్దాక్షిణ్యంగా కుదరదని చెప్పేశారు. ఆమెకు జైల్లో ప్రత్యేక వసతులు, సౌకర్యాలు కల్పిస్తున్నట్లుగా ఈమధ్య మీడియాలో వచ్చిన వార్తలను అధికారులు ఖండించారు. ఒక న్యాయవాది సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు జైళ్ల శాఖ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ సమాధానమిస్తూ శశికళకు, ఇళవరసికి ఎటువంటి ప్రత్యేక వసతులు కల్పించడంలేదన్నారు. తనను భద్రత రీత్యా తమిళనాడులోని జైలుకు మార్చాలని శశికళ చేసిన విజ్ఞప్తిని జైలు అధికారులు నిర్దాక్షిణ్యంగా తోసిపుచ్చారు. ఆమె మొత్తం శిక్షను పరప్పన అగ్రహారం జైల్లోనే అనుభవిస్తారని స్పష్టం చేశారు. ఇప్పటివరకు శశికళకు అడుగడుగునా ఎదురుదెబ్బలే తగిలాయి. ఇంకొక్క కత్తి ఆమె మెడపై వేలాడుతూ ఉంది. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఆమె ఎంపిక చెల్లుతుందా? చెల్లదా? అనే వివాదంలో ఎన్నికల కమిషన్‌ తీర్పు చెప్పాల్సివుంది. 
        
తాను జైల్లో ఉన్నప్పటికీ తాను చెప్పినట్లు వినే ముఖ్యమంత్రి ఉన్నాడని, ఆయన్ని కంట్రోల్‌లో పెట్టేందుకు తన అక్క కుమారుడు దినకరన్‌ ఉన్నాడని చిన్నమ్మ బాధల్లోనూ ఉపశమనంగా ఉంది. ఎన్నికల కమిషన్‌ ఆమె ఎన్నిక చెల్లదంటే మాత్రం ఆమె అనాథ అయినట్లేననుకోవాలి. పార్టీపై (ఆమె వర్గం) పట్టు జారిపోయినట్లే భావించాలి. జయలలితతో స్నేహం చేసినప్పుడు శశికళ ఏం ఆశించిందో తెలియదుగాని ఇప్పుడు మాత్రం తాను అనుకున్నదేదీ జరగడంలేదు. జైలుకు వెళ్లబోతూ ఆమె సాధించింది ఏమైనా ఉందంటే అది పళనిసామి ముఖ్యమంత్రి కావడం. కాని తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక చెల్లకపోతే ఆయన ఎలా వ్యవహరిస్తాడో చూడాలి

Readmore!
Show comments