నయీం ఎన్‌కౌంటర్‌.. రాజకీయ రగడ.!

ఖాకీ చెక్కిన శిల్పమే రౌడీ షీటర్‌ నయీముద్దీన్‌.. రాజకీయ నాయకులు పెంచి పోషించిన విష వృక్షం నయీముద్దీన్‌.. కొద్ది రోజుల క్రితం ఎన్‌కౌంటర్‌లో మరణించిన నయీమ్‌కి సంబంధించి ఒక్కో విషయమూ వెలుగు చూస్తోంటే, రాజకీయంగా 'రగడ' తారాస్థాయికి చేరుకుంటోంది. మొత్తంగా ఖాకీ వ్యవస్థ నయీమ్‌ ఎన్‌కౌంటర్‌తో ఉలిక్కిపడిందంటే.. నయీమ్‌కి ఖాకీలతో వున్న సన్నిహిత సంబంధాలేంటో అర్థం చేసుకోవచ్చు. 

మాజీ మావోయిస్టు అయిన నయీమ్‌ ద్వారా మావోయిస్టుల్ని అంతమొందించేందుకు పోలీసు ఉన్నతాధికారులు స్కెచ్‌ వేశారన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇక్కడ అధికారంలో వున్నవారి అండదండలు లేకుండా, పోలీసు ఉన్నతాధికారులు అంత సీరియస్‌ డెసిషన్‌ తీసుకోలేరు కదా.! ఇంకోపక్క, నయీమ్‌తో రాజకీయ నాయకులే ప్రత్యక్షంగా సంబంధాలు నెరిపారంటూ నయీమ్‌ డైరీ వెలుగు చూసిన తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది. 

ఓ మాజీ మంత్రి, టీడీపీకి చెందిన నేత్ర, అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు, విపక్ష నేతలు కొందరు.. ఇదీ నయీమ్‌తో సంబంధాలున్నాయంటూ రాజకీయ నాయకుల గురించి విన్పిస్తున్న ఊహాగానాల సారాంశం. మాజీ డీజీపీ ఒకరు, నయీంని అడ్డంపెట్టుకుని దందాలు నిర్వహించారనే వార్త మరింతగా కలకలం సృష్టిస్టోంది. పరిస్థితి చూస్తోంటే, నయీమ్‌ ఓ సమాంతర ప్రభుత్వాన్ని నడిపేవాడా.? అన్న అనుమానం కలగక మానదు. 

ఎస్‌ఐ, సిఐ, డీఎస్పీ, ఎఎస్పీ, ఎస్పీ, డీజీపీ, ఐజీ.. ఇలా ఆ ర్యాంక్‌.. ఈ ర్యాంక్‌ అన్న తేడాల్లేవు.. నయీమ్‌తో పోలీసు శాఖలోని అన్ని ర్యాంకుల అధికారులూ సన్నిహిత సంబంధాలు నడిపారంటే, కేసు అంతా ఊహించినదానికన్నా చాలా చాలా చాలా పెద్దది. సో, ఈ కేసు విచారణ సిట్‌తో విచారణ జరిపిస్తే వాస్తవాలు పూర్తిగా వెలుగుచూస్తాయని అనుకోలేం. సీబీఐని రంగంలోకి దించితే తప్ప, అసలు దొంగల జాతకాలు బయటకు రావు.  Readmore!

ఇదిలా వుంటే, నయీమ్‌ ఎన్‌కౌంటర్‌తో ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందనీ, విపక్షాల్ని దెబ్బకొట్టడానికి నయీమ్‌ ఎన్‌కౌంటర్‌, తదనంతర పరిణామాల్ని వాడుకుంటోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేల కోట్ల ఆస్తులు, వందలాదిమంది ప్రైవేటు సైన్యం.. ఇంతా వుండీ, ఎన్‌కౌంటర్‌లో నయీమ్‌ ఒక్కడే చనిపోవడం ఆశ్చర్యకరమే. చూస్తోంటే నయీమ్‌ ఎన్‌కౌంటర్‌ వెనుక కూడా పెద్ద కథే నడిచిందనే విషయం అర్థమవుతోంది. 

ఇంతకీ నయీమ్‌ ఎలా చనిపోయాడు.? నయీమ్‌ వెనుకాల వున్న పోలీసు అధికారులెవరు.? నయీమ్‌ని పెంచి పోషించిన రాజకీయ నాయకులెవరు.? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయా.? ప్చ్‌, ఛాన్సే వుండకపోవచ్చు.

Show comments