సానియా సేవలు ఇక చాల్లే కేసీఆర్‌ జీ!

తెలంగాణ రాష్ట్రంలోని క్రీడాభిమానుల్లో ఇప్పుడు కొత్త అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రాష్ట్రానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ను మార్చాలనే మాట వినవస్తోంది. ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాన్ని ఖరారుచేస్తూ.. హైదరాబాదీ అమ్మాయి పీవీ సింధు, బ్యాడ్మింటన్‌ ఫైనల్స్‌కు దూసుకువెళ్లిన నేపథ్యంలో.. ఆమె కృషికి సరైన గౌరవం దక్కాలంటే.. తెలంగాణ ప్రభుత్వం తగిన రీతిలోనే స్పందించాల్సి ఉన్నదని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు. ఆమెను మన రాష్ట్రానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ చేస్తే బాగుంటుందని అంటున్నారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్‌ సర్కారు గద్దె ఎక్కగానే.. సానియా మీర్జా వెళ్లి ఆయనను కలవడం, ఆ వెంటనే కేసీఆర్‌ ఆమెను రాష్ట్రానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రకటించడం జరిగిపోయింది. అప్పటినుంచి తెలంగాణ ఖజానా నుంచి ఏటా కొన్ని కోట్ల రూపాయలు సానియా పద్దులో జమ అవుతున్నాయి. ఆమె మాత్రం ఇప్పటి వరకు తెలంగాణరాష్ట్ర కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటిచెప్పడానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ హోదాలో చేసిందంటూ ఏమీలేదు. ఎప్పుడైనా డబుల్స్‌ మ్యాచ్‌లు గెలిస్తే.. ఆ తర్వాతి ట్రిప్పు హైదరాబాదు వచ్చినప్పుడు కేసీఆర్‌ను కలవడం తప్ప.. సానియా రాష్ట్రానికి చేసిన సేవలు లేవు. రాష్ట్రం బ్రాండ్‌ ఇమేజి పెంచడానికి ఆమె కృషి అంటూ సున్నా. 

అసలే టెన్నిస్‌ డబుల్స్‌ మ్యాచ్‌లలో మంచి పార్టనర్‌లను వేసుకుంటూ.. సానియా ఏదో కెరీర్‌ ను నడిపిస్తున్నది తప్ప.. సింగిల్స్‌లో ఎన్నడూ కనీసమైన ప్రతిభను కూడా చూపించిన దాఖలాలు లేవనే విమర్శలు పుష్కలంగా ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో.. ఇవాళ బ్యాడ్మింటన్‌లో ఒలింపిక్‌ పతకాన్ని ఖరారు చేసుకుని దేశానికే వన్నె తెస్తున్న పీవీ సింధును బ్రాండ్‌ అంబాసిడర్‌ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. పీవీసింధు అచ్చమైన హైదరాబాదీ అమ్మాయి. ఒలింపిక్స్‌కు వెళ్లేముందు.. లాల్‌దర్వాజా లో బోనమెత్తింది కూడా. ఆరకంగా తెలంగాణ సంస్కృతిని, సాంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్న అగ్రశ్రేణి క్రీడాకారిణి. పైగా డబుల్స్‌లో ఉండే పార్టనర్‌ల ప్రతిభ మీద గెలవడం కాదు, అచ్చంగా తన ప్రతిభతో పతకాలు సాధిస్తున్న అమ్మాయి.. అందుకే సానియా స్థానంలో పీవీ సింధును తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌ చేస్తే.. రాష్ట్రానికి గౌరవప్రదంగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు. 

Show comments