చంద్రబాబు 5 లక్షల కోట్లు.. పాడిందే పాటరా..

'ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారు.. ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం చేసి, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. అన్యాయం.. అక్రమం.. అని గొంతు చించుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. రాజధాని కోసం 5 లక్షల కోట్లు అవసరమని చెబితే అంతా వెకిలిగా నవ్వారు..' అంటూ పాత పాటే మళ్ళీ ఎకరువు పెట్టారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు. 

'ఆ కాంగ్రెసోళ్ళా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ గురించి మాట్లాడేది.?' అంటూ చంద్రబాబు అసహనంతో ఊగిపోయారు. నిజమే, ఉమ్మడి తెలుగు రాష్ట్రం అడ్డగోలుగానే విడిపోయింది. లేకపోతే, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కి హైద్రాబాద్‌ ఉమ్మడి రాజధాని ఏంటి.? కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం - ఆంధ్రప్రదేశ్‌తో కలిసి హైకోర్టుని ఇంకా పంచుకోవడమేంటి.? పోలవరం ప్రాజెక్టుని సంకటంలో పడేసేలా ముంపు మండలాల వ్యవహారంపై క్లారిటీ ఇవ్వకపోవడమేంటి.? అసలు రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్‌ని గాలికొదిలెయ్యడమేంటి.? ఉమ్మడి సంస్థల విభజనపై ఎటూ తేల్చకపోవడమేంటి.? అన్నిటికీ మించి నీటి పంపకాలపై స్పష్టత లేకపోవడమేంటి.? 

బర్త్‌ డే కేక్‌ కట్‌ చేసినంత తేలిగ్గా ఉమ్మడి తెలుగు రాష్ట్రాని మన్మోహన్‌ సర్కార్‌ విభజించి పారేసింది. అభివృద్ధి చెందిన రాజధాని హైద్రాబాద్‌, తెలంగాణకు దక్కింది గనుక.. తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్‌తో పోల్చితే విభజన సమస్యలు తక్కువే. కానీ, నీటి సమస్య అంత చిన్నదేమీ కాదు. అది వేరే విషయం. 

ఇదంతా చంద్రబాబు, ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ప్రతిపక్ష నేతగా పనిచేస్తున్నప్పుడే జరిగింది. అప్పట్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి చంద్రబాబు తెరవెనుక వత్తాసు పలుకుతున్నప్పుడే జరిగింది. జగన్‌ వేరు కుంపటి పెట్టాక, అతీ గతీ లేని స్థితిలో వున్న కాంగ్రెస్‌ పార్టీని కాపాడిందెవరు.? చంద్రబాబే కదా.! అఫ్‌కోర్స్‌ ఓ సందర్భంలో చంద్రబాబుకి వ్యతిరేకంగా జగన్‌ కూడా కాంగ్రెస్‌ సర్కాన్‌ని నిలబెట్టారనుకోండి.. అది వేరే విషయం.  Readmore!

ఉమ్మడి తెలుగు రాష్ట్రం అడ్డగోలుగా విడిపోయిందని ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అనడానికి వీల్లేదు. తిలా పాపం తలా పిడికెడు.. (పాపం అంటే తెలంగాణ వాదులకు కోపం రావొచ్చుగాక..) అన్న చంద్రన్న, విభజన అడ్డగోలుగా జరగడంలో అందరి పాత్రా వుంది. అందులో అధికార కాంగ్రెస్‌ తర్వాత, అంతటి పెద్ద పాత్ర అప్పటి ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీదే. ఓ దశలో, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యిందంటే తనవల్లనేనని చంద్రబాబు తెలంగాణలో చెప్పుకున్న విషయాన్ని ఎలా మర్చిపోగలం.? 

5 లక్షల కోట్ల ఖర్చుతో రాజధాని నిర్మించాల్సి వుందని చంద్రబాబు గతంలో చెప్పిన మాట వాస్తవం. 5 లక్షల కోట్లు కాదు, లక్ష కోట్లు.. పోనీ, 50 వేల కోట్లు.. అదీ కాదు 10 వేల కోట్లు అయినా కేంద్రం నుంచి చంద్రబాబు గడచిన మూడేళ్ళలో రాజధాని కోసం తీసుకురాగలిగారా.? పైగా, ఇప్పుడు మళ్ళీ ఆ పాత 5 లక్షల కోట్ల వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావడమట. నవ్విపోదురుగాక మనకేటి.? అన్న చందాన వుంది చంద్రబాబు తీరు.

Show comments