ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ కేంద్రంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగాన్ని అభివృద్ధి చేస్తామని గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సెలవిచ్చారు. అప్పట్లో నానా రకాల ప్రయత్నాలూ చేశామని చెప్పుకున్నారు. కానీ, ఏం లాభం.? ఒక్కటంటే ఒక్కటి కూడా సాఫ్ట్‌వేర్ కంపెనీ అక్కడికి కొత్తగా తరలి వెళ్ళని పరిస్థితి. హుద్‌హుద్ తుపాను అనే వంకతో, విశాఖని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విస్మరించింది.. ఐటీ రంగానికి సంబంధించి.
కొత్తగా, ఇప్పుడు అమరావతిలో (ప్రస్తుతానికి విజయవాడ) ఐటీ రంగం విస్తరించేందుకు రంగం సిద్ధమవుతోందట. ఈ మధ్యనే కొన్ని సంస్థలు విజయవాడ కేంద్రంగా తమ కార్యకలాపాల్ని లాంఛనంగా ప్రారంభించడం గమనార్హం. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఈ కార్యక్రమానికి హాజరై హైద్రాబాద్‌ని సైబరాబాద్‌గా మార్చింది తానేనని చెప్పుకున్నారు. చంద్రబాబు హయాంలో ఐటీ రంగం హైద్రాబాద్ కేంద్రంగా ఊపిరి పోసుకుందన్నది నిర్వివాదాంశం. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆ దిశగా చంద్రబాబుఏ తగిన కసరత్తులు చేయలేదనే చెప్పాలి.
ఎలాగైతేనేం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగానికి బెజవాడను కేరాఫ్ అడ్రస్‌గా చేస్తామంటోంది ఆంధ్రప్రదేశ్ సర్కార్. మరి, విశాఖ సంగతేంటి.? అంటే, ప్రస్తుతానికైతే ఈ ప్రశ్నకు టీడీపీ సర్కార్ వద్ద సమాధానం లేదు. ఇంతకీ, సైబర్ వాడలో.. అదేనండీ బెజవాడలో ప్రారంభమైన సంస్థలు తమ కార్యకలాపాల్ని కొనసాగిస్తాయా.? అన్నదీ ఇప్పటికైతే మిలియన్ డాలర్ల ప్రశ్నే.
అమరావతి కేంద్రంగా ఐటీ రంగం అభివృద్ధి చెందితే కాదనేవారెవరు.? కానీ, విశాఖ అనుభవాల నేపథ్యంలో చూసుకుంటే మాత్రం, ఇప్పుడు కొత్తగా చంద్రబాబు సర్కార్ చేస్తోన్న ఐటీ జపంపై అనుమానాలు వెల్లువెత్తకుండా వుండవు. చంద్రబాబుతో వచ్చిన సమస్యే అది.! పూటకో పబ్లిసిటీ స్టంట్‌తో జనాన్ని కన్‌ఫ్యూజ్ చేయడమే పరిపాలన అనుకుంటారాయన. దటీజ్ చంద్రబాబు.
కొసమెరుపు: చంద్రబాబు ఇలా పబ్లిసిటీ స్టంట్ చేయగానే, అలా ఆయన అనుకూల మీడియా.. ప్రజలకి అరచేతిలో స్వర్గం చూపించేస్తుంటుంది. వివిధ దేశాల్లోని సాఫ్ట్ వేర్ సంస్థల భవనాల్ని కాపీ కొట్టేసి.. బెజవాడ సైబర్ వాడలా మారిపోతుందంటూ.. ప్రచారం షురూ చేసేస్తుంటుంది. విశాఖపట్నం సైబర్ పట్నం అయినట్లే.. బెజవాడ కూడా సైబర్ వాడగా మారిపోనుందన్నమాట.. అదీ, నేతి బీరకాయలో నెయ్యి తరహాలో.