వైసీపీ ఫిరాయింపు నేతను బూటుతో కొట్టారు!

ఆక్రోశం చాటుకున్నారనుకోవాలో.. అతి చేశారనుకోవాలో కానీ.. కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావును బూటుతో కొట్టారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. వైకాపా తరపున గెలిచిన, మున్సిపాలిటీలో వైకాపా సాధించిన ఆధిక్యం మీద ఆధారపడి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన యలవర్తి ఇటీవలే తెలుగుదేశం కండువా కప్పుకున్నాడు.

ప్రజలు ఒక పార్టీకి మున్సిపాలిటీ అధికారాన్ని అప్పగిస్తే.. ఆయన అధికార పార్టీ వైపు జంప్ చేశాడు. ఈ నేపథ్యంలో వైకాపా నేతలు తీవ్రమైన ఆక్రోశానికే లోనయినట్టున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి తెలుగుదేశం  మార్కుతో హాజరయ్యాడు యలవర్తి.

దీంతో కడుపు మండిన ఒక  వైకాపా నేత యలవర్తిని బూటుతో కొట్టినట్టుగా తెలుస్తోంది. ఫిరాయించడానికి సిగ్గులేదా.. మా పార్టీ తరపు నుంచి దక్కిన పదవికిరాజీనామా చేసి పచ్చ కండువా కప్పుకో అని వ్యాఖ్యానిస్తూ.. ఈ తీవ్రమైన చర్యకు పాల్పడినట్టు సమాచారం. 

ఈ చర్యను వైఎస్సార్సీపీ గుడివాడ ఎమ్మెల్యే  కొడాలి నాని సమర్థించారు. ఇది కుక్క కాటుకు చెప్పు దెబ్బ వంటిదని వ్యాఖ్యానించారు. ఫిరాయింపు నేతలు పదవులకు రాజీనామా చేయాల్సిందేనని.. వారిని కౌన్సిల్ సమావేశానికి రానివ్వమని అన్నారు.

Show comments