వాస్తు దోష సచివాలయంలో లంకె బిందె?

పాత చందమామ కథల్లో లంకె బిందెల ప్రస్తావన ఎక్కువగా ఉండేది. లంకె బిందెలంటే బంగారం లేదా బంగారు నాణేలున్న బిందె అని అర్థం. వెనకటి రోజుల్లో ఇళ్లు కట్టుకునేటప్పుడు పునాదులు తవ్వుతున్న (అప్పట్లో పిల్లర్లతో కట్టే విధానం లేదు) సమయంలో కొందరికి లంకె బిందెలు దొరికేవి. పొలాలు దున్నుతున్నప్పుడు, వ్యవసాయ బావులు తప్వుతున్నప్పుడు లంకె బిందెలు దొరికేవి. శిథిలమైన ఆలయాల్లో, పురాతనమైన ఇళ్లలో గుప్త నిధులు ఉన్నాయని ఇప్పటికీ నమ్ముతుంటారు. కొందరు ఆశపోతులు తవ్వకాలు సాగిస్తుంటారు కూడా. ఈ ఆధునిక కాలంలోనూ అప్పుడప్పుడు లంకె బిందెలు బయటపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

సరే...అసలు విషయానికొస్తే తెలంగాణ సచివాలయంలోని జి బ్లాక్‌ కింద లంకె బిందె ఉన్నట్లు సమాచారం. నగరం నడిబొడ్డున ఉన్న ఓ కీలక ప్రభుత్వ కార్యాలయంలో లంకె బిందె ఉందనే సమాచారం నిజంగా ఆసక్తికరమే.  అందులోనూ భయంకరమైన వాస్తు దోషాలు ఉన్నాయని కేసీఆర్‌ అసహ్యించుకుంటున్న సచివాలయంలో లంకె బిందె ఉన్నట్లు బయటకు వచ్చిన సమాచారం సీఎం దృష్టికి పోయిందో లేదో తెలియదు. జి బ్లాక్‌ భవనం ఒకప్పుడు నిజాం నవాబుల సైఫాబాద్‌ రాజభవనం. ఆరో నిజాం పరిపాలనలో 1888లో ఇది నిర్మితమైంది. 

మహబూబ్‌ అలీ ఖాన్‌, అసఫ్‌ ఝా-6 ఈ రాజభవనాన్ని తమ కార్యాలయంగా వాడుకున్నారు. దీని అడుగున లంకె బిందె ఉన్నట్లు ప్రచారంలో ఉంది. ఒకప్పుడు సైఫాబాద్‌ రాజభవనాన్ని నిజాం రాజు ఖజానాగా కూడా వాడుకున్నాడు. దీనికి దగ్గర్లోనే కర్సెన్సీ నోట్లు ముద్రించే, నాణాలు తయారుచేసే మింట్‌ కాంపౌండ్‌ కూడా ఉంది. జి బ్లాక్‌ను కూల్చేసి అక్కడ పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపినట్లయితే లంకె బిందె బయటపడే అవకాశముందని సచివాలయంలోని కొందరు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, జి బ్లాకును కూలగొట్టిన తరువాత ప్రభుత్వానికి విపరీతమైన ఆదాయం వచ్చే అవకాశముంది. 

కూలగొడితే ఆదాయం రావడమేమిటని అనుకుంటున్నారా? ఇది నిజాం కాలం నాటి రాజభవనం కాబట్టి ఈ భవన నిర్మాణంలో అత్యంత నాణ్యమైన టేకు కలపను, ఉక్కును ఉపయోగించారు. ఈ ఉక్కును, టేకు కలపను ప్రభుత్వం వేలం వేయనుంది. దీంతో భారీ ఆదాయం సమకూరుతుంది. సచివాలయంలోని అన్ని బ్లాకుల్లో బోలెడు చెక్క ఫర్నీచర్‌ ఉంది. ఇదంతా కూడా సర్కారు వేలం వేస్తుంది. టేకు కలప, ఉక్కు, చెక్క ఫర్నీచర్‌ మొదలైనవాటిని వేలం వేస్తే కొత్త భవన నిర్మాణం ఖర్చులో కొంత కలిసొస్తుందని అధికారులు చెబుతున్నారు. 

వేలం ద్వారా ఆదాయం వచ్చే సంగతి ఎలా ఉన్నా శతాబ్దాల చారిత్రక కట్టడాన్ని ప్రభుత్వం కూల్చేయాలని నిర్ణయించడం విచారకరమని పురాతన కట్టడాలను, చరిత్రను ప్రేమించేవారు బాధపడుతున్నారు.  నిజాం రాజులు ప్రజావ్యతిరేక పాలన చేసుండొచ్చు. వారి పాలనలో ప్రజలు కష్టాలు పడి ఉండొచ్చు. అయినప్పటికీ హైదరాబాద్‌ నగరం ఒక గొప్ప చరిత్రకు నిదర్శనంగా నిలిచివుంది. ఈ నగరాన్ని హెరిటేజ్‌ సిటీగా (వారసత్వ నగరం) చెప్పుకోవడానికి కారణం దీని చరిత్ర, పురాతన కట్టడాలే. నగరంలోని చారిత్రక కట్టడాలన్నీ పర్యాటకులకు ఆసక్తికరమైనవే. 

పర్యాటకులు ఏ నగరానికైనా పురాతన కట్టడాలను చూడటానికి, చారిత్రక సంపద గురించి తెలుసుకోవడానికి వస్తారు. ఈ సంపదలో జి బ్లాక్‌ కూడా ఒకటి. దాన్ని కూలిస్తే ఒక చరిత్ర శకలం, ఒక జ్ఞాపకం కాలగర్భంలో కలిసిపోతుంది. కేసీఆర్‌ ఉద్యమకారుడిగా ఉన్నప్పుడు, అధికారానికి వచ్చిన తరువాత నిజాం రాజులకు జోహార్లు అర్పించారు. వారిది గొప్ప పరిపాలనంటూ సలాములు చేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు చారిత్రక కట్టడాలను కూల్చడానికి ఎందుకు సిద్ధమయ్యారు? గతంలోనూ ఉస్మానియా ఆస్పత్రిని కూల్చేస్తానని గొడవ చేశారు. అసెంబ్లీ భవనాలను కూల్చేస్తానన్నారు. 

ఈ కూల్చివేత పిచ్చేమిటో అర్థం కావడంలేదు. విదేశాలకు, మనకు ఉండే తేడా ఇదే. అక్కడ చారిత్రక కట్టడాలను చెక్కుచెదరనీయకుండా పరిరక్షిస్తారు. వివిధ రంగాలకు చెందిన మహనీయుల ఇళ్లను ప్రేమగా చూసుకుంటారు. విగ్రహాలను సంరక్షిస్తారు. కాని మన పాలకులకు ఇదేం పట్టదు. చరిత్రను ప్రేమించే గుణం అసలు లేదు. జీవితాంతం తమ స్వార్థప్రయోజనాల కోసమే పాటుపడతారు. 

Show comments