బీజేపీలోకి దూకే ఆత్రగాళ్లున్నారా?

ఏ రాజకీయ పార్టీ అయినా ఎదగాలనే కోరుకుంటుంది. ఈ విషయంలో ఇక జాతీయ పార్టీల సంగతి చెప్పేదేముంది? అన్ని రాష్ట్రాలకు విస్తరించాలని, అధికారం చేపట్టాలని, అది సాధ్యం కాకపోతే బలమైన శక్తిగా రూపుదిద్దుకోవాలని అనుకుంటాయి. బీజేపీదీ ఇదే ఆలోచన. ఇతర రాష్ట్రాల విషయం అలా పక్కనుంచితే పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా ప్రధానంగా తెలుగు రాష్ట్రాలను టార్గెట్‌ చేసుకున్నారు. రెండు రాష్ట్రాల్లో బలమైన శక్తిగా ఎదగాలని, అధికారం కూడా చేపట్టే అవకాశం కూడా రావాలని ఆకాంక్షిస్తున్నారు. మంచిదే. ఎవ్వరూ కాదనరు. కాని సాధ్యమవుతుందా? కాదనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. 

ఇప్పటివరకైతే తెలంగాణలో కేసీఆర్‌, ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు బలమైన నాయకులు. వచ్చే ఎన్నికల్లోనూ వారికే విజయావకాశాలున్నాయనేది అంచనా. చంద్రబాబుకు బలమైన ప్రతిపక్షం ఉంది. వచ్చే ఎన్నికలనాటికి పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్పడం కష్టమే. కాని తెలంగాణలో కేసీఆర్‌కు ఈ పరిస్థితి లేదు. వచ్చే ఎన్నికల నాటికి కూడా ఆయనకు వ్యతిరేకత ఏర్పడుతుందని, బలమైన ప్రతిపక్షం లేదా కూటమి తయారవుతుందని ఎవరూ అనుకోవడంలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ బలమైన శక్తిగా మారే అవకాశమే లేదు. 

ఇక ఆంధ్రా విషయానికొస్తే బలమైన పార్టీగా ఎదిగే అవకాశం వైఎస్సార్‌ కాంగ్రెసు పార్టీకి ఉంటుందిగాని  బీజేపీకి ఉండదు. వచ్చే మూడేళ్లలో చంద్రబాబు చేసే తప్పులు, కూడగట్టుకునే ప్రజావ్యతిరేకత మొదలైన వాటి ఆధారంగా వైఎస్సార్‌సీపీకి ఆదరణ పెరగాలి. కాని బీజేపీ లబ్ధి పొందుతుందనుకోవడం భ్రమ. తెలంగాణతో పాటు ఏపీలో ఫిరాయింపులకు తెర తీయాలని అమిత్‌ షా నిర్ణయించారు. ఎవ్వరొచ్చినా పార్టీలో చేర్చుకోవాలని, ఎవ్వరినీ కాదనకూడదని చెప్పారు. బీజేపీ అంటే ఏమీ తెలియనివారిని కూడా తిరస్కరించకుండా పార్టీలో చేర్చుకొని సిద్ధాంతాలు నూరిపోయాలన్నారు. 

ఏపీలో కాంగ్రెసు, వైకాపాల నుంచి నాయకులను లాగాలన్నారు. టీడీపీ నుంచి వచ్చినా తీసుకోవాలన్నారట....! కాని ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీలో చేరాలనే ఆత్రగాళ్లు ఉన్నారా? అనేది సందేహం. నాయకులు పార్టీ ఫిరాయించేది రాజకీయ ప్రయోజనాల కోసమే. పార్టీ సిద్ధాంతాలు నచ్చో, దేశానికి సేవ చేయడానికో కాదు. బీజేపీలో చేరితే ఏం ప్రయోజనం కలుగుతుందో ముందుగా ఆలోచిస్తారు. ఒకవేళ ఎవరైనా చేరితే గీరితే వారి లక్ష్యం వచ్చే ఎన్నికల్లో గెలవడం. కాని అది నెరవేరుతుందా? వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో టీడీపీ-బీజేపీ బంధం ఉంటుందా? అనేది సందేహంగా ఉంది. 

బీజేపీ కూడా ఒంటరిగా పోటీ చేయాలనే ఉత్సాహంతో ఉంది. ఒకవేళ అదే జరిగితే బీజేపీ గెలిచే అవకాశాలుంటాయా? కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ను నిర్లక్ష్యం చేస్తోందనే భావన ప్రజల్లో బలంగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మోదీ, వెంకయ్య నాయుడు, ఇతర నేతలు ఎన్నికల సమయంలో మాట్లాడినదానికి భిన్నంగా జరగుతుండటంతో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెసు అన్యాయం చేసిందని, విభజన తరువాత బీజేపీ (కేంద్రం) అన్యాయం చేసిందని ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాయకులు బీజేపీలో చేరుతారా? చేరినవారికి రాజకీయ మనుగడ ఉంటుందా? 

రాష్ట్ర విభజన తొలి రోజుల్లో చేరిన గుప్పెడుమంది నాయకులు తప్ప ఆ తరువాత మరెవరూ చేరలేదు. కొన్ని రోజుల కిందట కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ బీజేపీ నాయకులకు ఉపదేశం చేశారు. ఏమని? టీడీపీతో సఖ్యతగా ఉంటూనే మన పార్టీని విస్తరించేందుకు ప్రయత్నించండి అని చెప్పారు. కాని విస్తరిద్దామంటే ఎవ్వరూ వచ్చి చేరేలా కనబడటంలేదు. రాష్ట్ర విభజన జరిగిన కొత్తలో పెద్ద తలకాయలుగా గుర్తింపు పొందిన కాంగ్రెసు నాయకులు (కావూరి, పురంధేశ్వరి, కన్నా తదితరులు) హడావిడిగా బీజేపీలో చేరారు. 

రాష్ట్రాన్ని ముక్కలు చేసింది కాంగ్రెస్సేనని అనుకొని కాషాయం కండువాలు కప్పుకున్నారు. కాని ముక్కలు చేయడానికి సహకరించిన పార్టీ బీజేపీయేనని తెలియదా? తెలుసు. అయితే నరేంద్ర మోదీ ఇమేజ్‌ తాము పార్టీలో ఎదగడానికి దోహదం చేస్తుందని, పార్టీ ఏపీలో బ్రహ్మాండంగా విస్తరిస్తుందని అనుకున్నారు.కాని అనుకున్నది ఒకటి. అయ్యింది మరొకటి. వైసీపీలో అసంతృప్తిగా ఉన్నోళ్లు, జగన్‌ వ్యవహార శైలి నచ్చనోళ్లు తమ పార్టీలోకి వస్తారని బీజేపీ నాయకులు ఊహించుకొని ఉండొచ్చు. కాని వారు టీడీపీలో చేరుతున్నారు. ఏపీ విషయంలో మోదీ రాష్ట్రానికి బాగా అన్యాయం చేశారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి మరింత దిగజారే అవకాశముంది. ఇప్పటికే బీజేపీ ఆదరణ కోల్పోయింది. 

Show comments