ప్రచారం వరకేనా?..పర్మినెంట్‌ షిఫ్టింగా?

తెలంగాణ కాంగ్రెసు నాయకురాలు విజయశాంతి ఎక్కడుంది? చెన్నయ్‌లోనే ఉన్నట్లు మీడియా సమాచారం. ఆర్‌కే నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక వాయిదా పడినప్పటికీ అక్కడే ఉండి ఇంకా ప్రచారం చేస్తోంది. తాజాగా ఓ తెలుగు టీవీ ఛానెల్‌తో రెండు మూడు నిమిషాలపాటు మాట్లాడటమే ఇందుకు నిదర్శనం. 'మెరుగైన సమాజం' కోసం పనిచేస్తున్నట్లు చెప్పుకుంటున్న టీవీ ఛానెల్‌ రిపోర్టర్‌ చెన్నయ్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్న విజయశాంతితో చిన్నపాటి ఇంటర్వ్యూ చేశారు. పూర్తి మేకప్‌తో అప్పటి హీరోయిన్‌ను గుర్తుకు తెచ్చేలా ఉన్న తెలంగాణ రాములమ్మ ఎంతో హుషారుగా ప్రచార వాహనం మీది నుంచి రిపోర్టర్‌తో మాట్లాడింది. ఆర్‌కే నగర్‌ ఉప ఎన్నిక వాయిదా పడటానికి బీజేపీయే చేసిన కుట్రే కారణమని చెప్పింది. 'అమ్మ' మరణం వెనక ఎలాంటి కుట్రలు, కుతంత్రాలు లేవని, అదంతా సహజంగా జరిగిందేనని చెప్పింది. పన్నీరుశెల్వంపై విమర్శలు చేసింది. ఈమధ్య జరిగిన ఆదాయ పన్ను దాడులపై మండిపడింది. ఆర్‌కే నగర్‌లో శశికళ వర్గం అభ్యర్థి దినకరన్‌ విజయం సాధిస్తాడనే ధీమా వ్యక్తం చేసింది.

గత ఎన్నికల తరువాత తెలంగాణలో పూర్తిగా అజ్ఞాతంలో ఉన్న, కాంగ్రెసులో ఉంటూ కూడా గాంధీ భవన్‌ గడప తొక్కని విజయశాంతి చెన్నయ్‌లో యమ హుషారుగా ఉండటానికి కారణం ఏమిటి? ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన ఈమె తెలుగువారు ఎక్కువగా ప్రాంతాల్లో నిర్వహించిన సభలో ప్రసంగించింది. తిరిగింది. కాని ఎన్నిక వాయిదా వేసిన తరువాత కూడా అక్కడే ఉండిపోవడం చూస్తుంటే ఏదో పథక రచన చేసినట్లు కనబడుతోంది. పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు  అక్కడ తెలుగు జనాభా ఎక్కువున్న ప్రాంతాల్లో తెలుగు సినిమా తారలు, రాజకీయ ప్రముఖులు ప్రచారం చేయడం మామూలే. అయితే సాధారణ ఎన్నికలప్పుడే ఇలా చేస్తుంటారు. కాని విజయశాంతి ఉప ఎన్నికలో ప్రచారం చేయడానికి వెళ్లింది. వాస్తవానికి ఇది మామూలు ఉప ఎన్నిక కాదు. అన్నాడీఎంకేను నిలువునా చీల్చిన ఈ ఉప ఎన్నిక అసలైన అన్నాడీఎంకే ఏది? అనేది తేల్చబోతోంది. ఎంతో ప్రాముఖ్యమున్న ఈ ఉప ఎన్నిక ప్రచారంలో విజయశాంతి ప్రచారం చేయడం తప్పు కాదు. విచిత్రమూ కాదు. ఆమె తెలంగాణలో నాయకురాలైనప్పటికీ జయలలితకు సన్నిహితురాలు. జయకు రాములమ్మంటే చాలా ఇష్టమట...!

కాబట్టి అమ్మ మీది ప్రేమ కొద్దీ ఆమె ప్రియ సఖి శశికళ వర్గం అభ్యర్థిని గెలిపించడానికి చెన్నయ్‌ వెళ్లింది. అయితే ఆమె ప్రచారం వరకే పరిమితం అవుతుందా? పర్మినెంట్‌గా చెన్నయ్‌కి షిఫ్ట్‌ అవుతుందా? ఆమె చాలా కాలంగా చెన్నయ్‌లోనే ఉన్నట్లు మీడియా కథనాల వల్ల తెలుస్తోంది. అన్నాడీఎంకే శశికళ వర్గంలో చేరి అక్కడి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనే ఆలోచన ఉందా? 2019లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరక్కపోయినా పార్లమెంటు ఎన్నికలు జరుగుతాయి కదా...!  ఆ ఎన్నికల్లో పోటీ చేసే ప్లాన్‌ ఉందా? తెలంగాణలో తనకు రాజకీయ భవిష్యత్తు లేదనుకుంటే తమిళనాడుకు వెళ్లిపోతుందేమో. చెన్నయ్‌తో ఆమెకు దశాబ్దాల అనుబంధం ఉంది. సినిమా, రాజకీయ పరిచయాలు, స్నేహాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయేమో. వాటిని ఉపయోగించుకొని రాజకీయ మనుగడ సాగించాలనే ఆలోచన చేస్తోందా? ఆమె మనసులో ఏముందో తెలియదుగాని తమిళనాడుపై ఆమె ఆసక్తిని గమనిస్తే అనేక అనుమానాలు కలుగుతున్నాయి.  జయ మరణం తరువాత ఏర్పడిన  తమిళ రాజకీయ సంక్షోభంపై  విజయశాంతి ఆసక్తి కనబరిచింది. 

మన నాయకులెవరూ అక్కడికి వెళ్లి ఒకరికి వ్యతిరేకంగా మాట్లాడటమో, మరొకరికి అనుకూలంగా మాట్లాడటమో చేయలేదు. పొరుగు రాష్ట్రం రాజకీయాల్లో మనకు జోక్యం చేసుకునే హక్కుండదు కదా. కాని విజయశాంతి చెన్నయ్‌ వెళ్లి హల్‌చల్‌ చేసింది. మెరీనాలోని జయలలిత సమాధికి నివాళులు అర్పించిన తరువాత పోయస్‌గార్డెన్‌కు వెళ్లి శశికళను కలిసి (జైలుకు వెళ్లకముందు) మద్దతు ప్రకటించింది. అసెంబ్లీలో జరిగిన విశ్వాసపరీక్షలో పళనిసామి విజయం సాధించాక చిన్నమ్మకు అభినందనల వీడియో పంపింది. మాజీ ముఖ్యమంత్రి పన్నీరుశెల్వం, ఆయన తరపు ఎమ్మెల్యేలను 'క్షుద్రశక్తులు' అని విమర్శించింది. చిన్నమ్మ మాత్రమే అన్నాడీఎంకేను రక్షించగలరని తెలిపింది. తమిళ రాజకీయాలపై రాములమ్మ ఓవర్‌యాక్షన్‌ చూసి ఒళ్లు మండిపోయిన తమిళ సంగీత దర్శకుడు జేమ్స్‌ వసంతన్‌ 'విజయశాంతీ... నువ్వు రాజకీయ దిగ్గజం అనుకుంటున్నావా? నీ అభిప్రాయాలు మీ రాష్ట్రంలో చెప్పుకో. ఇది సినిమా కాదు. తమిళ ప్రజల జీవితాలు'..అని ఘాటుగా విమర్శించాడు. రాములమ్మ తమిళనాడుకు వెళ్లదల్చుకుంటే అక్కడ రాజకీయంగా బతుకుతెరువు ఉంటుందా?

Show comments