మెజార్టీ 50 వేలు.. అదిరిందయ్యా చంద్రం

నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి దక్కబోయే మెజార్టీ ఎంతో తెలుసా.? 50 వేల ఓట్లకు పై మాటేనట.! అధికార పార్టీ లెక్కలివి. 'నమ్మితే నమ్మండి, లేదంటే మీ ఇష్టం.. మా లెక్కలు మాత్రం మాకు పక్కాగానే వున్నాయ్‌..' అంటూ మీడియా ముందు అధికార పార్టీ నేతలు చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. 

'గెలుపు మీద డౌట్‌ ఏమీ అవసరంలేదు.. గెలుపు ఖాయం.. మెజార్టీ గురించిన ఆలోచనలే ఇక్కడ. ఆ మెజార్టీ కూడా 50 వేలపైనే వుంటుంది..' అంటూ పార్టీ ఫిరాయించినందుకు 'మంత్రి పదవి'ని బహుమతిగా అందుకున్న అమర్‌నాథ్‌రెడ్డి సైతం చెప్పేస్తున్నారండోయ్‌.! నంద్యాలలో భూమా నాగిరెడ్డి తిరిగి పోటీ చేసినా, 50 వేల పై చిలుకు మెజార్టీ వస్తుందంటే.. 'పార్టీ ఫిరాయింపు - రాజకీయ వ్యభిచారం' అనే ఆరోపణల్ని ఆయన ఎందుకు భరించారట.? 

నంద్యాల నియోజకవర్గం గురించి మాట్లాడుతున్న అమర్‌నాథ్‌రెడ్డి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, బంపర్‌ మెజార్టీతో గెలిచి, గౌరవంగా మంత్రి పదవి ఎందుకు తీసుకోలేకపోయారో ఆయనకే తెలియాలి. 

అన్నిటికీ మించి, నారా లోకేష్‌ ఎమ్మెల్సీ కోటాలో ఎంపికై, మంత్రి పదవి సొంతం చేసుకున్నారు. దీనర్థమేంటి.? ఆంధ్రప్రదేశ్‌లో ఉప ఎన్నికలొస్తే, గెలిచే పరిస్థితి లేదని టీడీపీకి గట్టి నమ్మకం వున్నట్టే కదా.! అమ్ముడుపోయారనండీ, రాజకీయ వ్యభిచారం అనండీ, ఇంకేదన్నా అనండి.. మాదారి మాదే.. అన్నట్టుగా ఫిరాయించిన ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతలు వ్యవహరించిన తీరు అత్యంత హాస్యాస్పదం. 

ఇక, నంద్యాల నియోజకవర్గంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ నానా తంటాలూ పడితే, చంద్రబాబు టూర్‌కి జనసమీకరణ భారీగా జరిగిన మాట వాస్తవం. జనాన్ని చూసి, 50 వేల ఓట్ల మెజార్టీ వచ్చేస్తుందనుకుంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. మొత్తంగా, అధికార పార్టీ నేతలంతా నంద్యాలలో మకాం వేయడంలోనే, అధికార పార్టీ ఇక్కడి గెలుపుపై ఎంత అపనమ్మకంతో వుందో అర్థం చేసుకోవచ్చు. 

మెజార్టీ సంగతి తర్వాత, నంద్యాలలో టీడీపీ గెలిచే పరిస్థితులున్నాయా.? బుకాయించి సమాధానం చెప్పడం కాదు, గుండెమీద చెయ్యేసుకుని అధికార పార్టీ నేతలు, ఈ ప్రశ్నకి సమాధానం చెప్పగలగాలి.

Show comments