పొలిటిక‌ల్ పంచ్ ర‌వికిర‌ణ్ లీగ‌ల్ ఖ‌ర్చులన్నీ వైసీపీవే

పొలిటిక‌ల్ పంచ్ పేరిట‌ కార్టూన్లు, పంచ్ డైలాగ్‌ల‌తో సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్‌బాబును ముప్పుతిప్ప‌లు పెట్టిన ఇంటూరి ర‌వికిర‌ణ్‌కు వైసీపీ త‌న మ‌ద్ద‌తు కొన‌సాగిస్తోంది. గుంటూరు స‌బ్‌జైళ్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ర‌వికిర‌ణ్‌ను వైసీపీ ముఖ్య‌నేత‌, జ‌గ‌న్ ఆత్మీయుడు విజ‌య‌సాయిరెడ్డి మంగ‌ళ‌వారం ప‌రామ‌ర్శించారు. కేసులు గురించి భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని పార్టీ త‌ర‌ఫున అన్ని ర‌కాలుగా స‌హాయం ఉంటుంద‌ని భ‌రోసా ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తోపాటు ప‌లు సెక్ష‌న్‌ల కింద న‌మోదైన కేసుల విష‌యంలో బెయిల్ ఇప్పించ‌డంతోపాటు, న్యాయ‌పోరాటానికే అయ్యే ఖ‌ర్చు మొత్తం పార్టీయే భ‌రిస్తుంద‌ని విజ‌య్‌సాయి రెడ్డి ర‌వికిర‌ణ్‌కు ధైర్యం చెప్పిన‌ట్టు స‌మాచారం. ర‌వికిర‌ణ్ జైళ్లో ఉన్న‌న్ని రోజులూ ఆయ‌న కుటుంబానికి ఏ ఇబ్బంది వ‌చ్చినా పార్టీ నేత‌ల‌ను సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని కూడా సూచించారు.

ర‌వికిర‌ణ్‌తో భేటీ అనంత‌రం విజ‌య్‌సాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సోష‌ల్ మీడియాలో చంద్ర‌బాబు, లోకేశ్‌బాబుల‌పై నెటిజెన్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తుండ‌డం  ప్ర‌భుత్వం ప‌ట్ల యువ‌త‌లో రోజురోజుకూ పెరుగుతున్న ఆగ్ర‌హానికి ప్ర‌తిరూప‌మ‌ని అభివ‌ర్ణించారు. ఇలాంటి విమ‌ర్శిస్తున్న వారిపై ప్ర‌భుత్వం క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంద‌ని, ర‌వికిర‌ణ్ అరెస్ట్ కూడా ప్ర‌తీకార చ‌ర్య‌ల్లో భాగ‌మేన‌ని అన్నారు. ప‌త్రిక‌ల్లో, మీడియాలో కార్టూన్లు, వ్యంగ్యం చాలా స‌హ‌జం. వైసీపీ పార్టీ, జ‌గ‌న్‌పై ఇలాంటి బోలెడు కార్టూన్లు వేశారు.  మ‌రి వారంద‌రినీ అరెస్ట్ ఎందుకు చేయ‌లేద‌ని విజ‌య్‌సాయి ప్ర‌శ్నించారు.

అయితే ర‌వికిర‌ణ్‌కు అండ‌గా నిల‌వ‌డం ద్వారా సోష‌ల్‌మీడియా స్వేచ్ఛ‌కు వైసీపీ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన‌ట్లుగా భావిస్తోంది. విచ్చ‌ల‌విడిత‌నానికి, వ‌ల్గారిటీకి తావు లేకుండా ఏ పార్టీకైనా, ప్ర‌భుత్వానికైనా వ్య‌తిరేకంగా కామెంట్లు, స్టేట్‌మెంట్లు పెట్టేవారి స్వేచ్ఛకు గౌర‌వించ‌డం ద్వారా యువ‌త‌లో పాజిటివ్ టాక్ తెచ్చుకోవ‌డం వైసీపీ వ్యూహం. మ‌రి ఈ వ్యూహం ఎంత వ‌ర‌కు విజ‌యవంత‌మై వైసీపీకి యువ‌త ఓట్లు తెచ్చిపెడుతోందో భ‌విష్య‌త్తులో చూడాలి.

Show comments