ఆ ఎమ్మెల్యేకి చంద్రబాబు తలంటేశారా.?

'నేను మాట్లాడుతున్నాను కదా.. బంగారం విషయంలో ఆంక్షలు సరికావని ప్రధానికి చెప్పాలనుకుంటున్నాను.. చెప్పాలనుకుంటున్న విషయాన్ని సున్నితంగా చెప్పుకోవాలి.. లేదంటే బీజేపీతో బంధం తెగిపోతుంది.. ఆల్రెడీ తుమ్మితే ఊడిపోయే ముక్కులా వుంది బీజేపీతో మన స్నేహం పరిస్థితి.. ఈ సమయంలో ఎందుకింత ఓవరాక్షన్‌.. ఇంకోసారి ఇలా జరిగితే బాగుండదు..' అంటూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుకి గట్టిగా క్లాస్‌ తీసేసుకున్నారట. 

విపక్షాలు ఎలాగూ 'తుగ్లక్‌ పాలన' అంటూ ప్రధాని నరేంద్రమోడీపై విరుచుకుపడ్తున్నాయి గనుక, ఆ విమర్శ తాను కూడా చేసేస్తే, పొలిటికల్‌ మైలేజ్‌ వచ్చేస్తుందని బొండా ఉమామహేశ్వరరావు కాస్తంత అత్యుత్సాహం చూపిన మాట వాస్తవం. ఎంతైనా మిత్రపక్షం కదా, కాస్త ఆచి తూచి వ్యవహరించాల్సింది పోయి, తామే ప్రతిపక్షం అన్నట్లు వ్యవహరించడంతో బీజేపీ నేతలు షాక్‌కి గురయ్యారు. వెంటనే, అధిష్టానానికి (అమిత్‌ షా)కి ఫిర్యాదు చేసేశారు. అట్నుంచి, చంద్రబాబుకి క్లాస్‌ మామూలే. 

ఇంకేముంది, చంద్రబాబు గుస్సా అయ్యారు.. 'గతంలోనూ ఇలాంటి తీరుతోనే పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేశావ్‌.. ఇప్పుడూ అలాగే.. ఇలాగైతే కష్టం..' అని చంద్రబాబు క్లాసు తీసుకునేసరికి బొండా డీలాపడిపోయారట. 'నేను మహిళల ఓటు బ్యాంకు కోసమే మాట్లాడాను.. పార్టీ కోసమే మాట్లాడాను..' అని బొండా వివరణ ఇచ్చుకున్నా, ప్చ్‌.. చంద్రబాబు ఆగ్రహం మాత్రం తగ్గలేదట. 

చంద్రబాబు రూటే సెపరేటు.. ఏ విషయమ్మీద అయినాసరే, బీజేపీ మీద ఈగ వాలనివ్వరు. కొన్ని సందర్భాల్లో తన రక్తమే మరిగినాసరే.. ఆ రక్తాన్ని తానే చల్లార్చేసుకుంటారు. అలాంటిది, ఇంకెవరన్నా బీజేపీని విమర్శిస్తే ఊరుకుంటారా.? ఊరుకోరుగాక ఊరుకోరంతే.!

Show comments