ఏవీ మోడీ.. నేడు ఆ ట్వీట్లేవీ..!

ఒకవైపు పెట్రోలియం ఉత్పత్తుల మీద, పెట్రోలియం ఎగుమతుల మీద ఆధారపడ్డ దేశాలు దివాళా దశకు చేరుకున్నాయి. ముడి చమురు ధరలు తగ్గిపోవడం.. వెనుజులు, వివిధ గల్ఫ్ దేశాలు, బ్రెజిల్.. ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలను కుంగదీస్తోంది. గత రెండు సంవత్సరాల్లో ముడి చమురు ధరలు మూడోవంతుకు పడిపోయాయి. దీంతో ఆ దేశాలు దిక్కుతోచని స్థితికి చేరుకున్నాయి.

ముడి చమురును ఎగుమతి చేసే దేశాలు ఈ విధంగా ఇబ్బందులు పడుతూ ఉన్నాయంటే.. సహజంగానే వీటిని దిగుమతి చేసుకునే దేశాలు ఆనంద పడాలి. అది కూడా ధరలు మూడోవంతుకు పడిపోవడం అంటే.. దిగుమతి చేసుకునే దేశాలకు ఇంతకన్నా ఆనందకరమైన పరిణామం మరోటి ఉండదు.

ప్రత్యేకించి భారతదేశం.. ముడి చమురు దిగుమతి మీద ఎక్కువగా ఖర్చు పెట్టుకునే దేశం. అలాంటి దేశానికి గత రెండేళ్లుగా ముడి చమురు ధరలు ట్రేడ్ అవుతున్న తీరు.. ఎంతో ఊరటనిచ్చే అంశం. అయితే ఇక్కడ ప్రభుత్వం మాత్రం ఎంచక్కా ఈ ఫలాలను అనుభవిస్తోంది కానీ, ప్రజలకు మాత్రం ఆ ఫలాలు దక్కనివ్వవడం లేదు. పై పెచ్చు అధిక భారాన్ని మోపుతోంది.

ముడి చమురు ధరలు తగ్గిన స్థాయిలో.. దేశీయ మార్కెట్ లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించలేదు. రెండు సంవత్సరాల నుంచి ఇలాంటి పరిస్థితే కొనసాగుతోంది. ముడి చమురు ధరల పెరిగితే పెట్రో ధరలను పెంచేసి ప్రజలపై భారం మోపే కేంద్ర ప్రభుత్వం.. ఆ ధరలు మూడోవంతుకు తగ్గిపోయినా.. ఎందుకు ధరలను తగ్గించడం లేదు? అంటే.. మోడీ సర్కారు నుంచి సమాధానం లేదు.

ఒకరకంగా చెప్పాలంటే పెట్రోల్  విషయంలో పక్కా వ్యాపారం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇదే సమయంలో ఏపీ వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రాష్ట్ర పన్నులు పెంచేసి.. తమ వంతు దోపిడీ చేసుకుంటున్నాయి. ఈ ప్రభుత్వాల తీరుతో… పెట్రో ధరల విషయంలో ప్రజల కష్టాలే కొనసాగుతున్నాయి.

తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరల్లో ఎలాంటి పెరుగుదలా లేకపోయినా.. ప్రజలపై ఈ భారాన్ని మోపి ఖజానాను నింపుకునే యత్నం చేశారు. అచ్చేదిన్ అంటూ గద్దెనెక్కిన మోడీ సర్కారు మరీ ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం హేయం అనే చెప్పాలి.

ఇదే సందర్భంలో మోడీగారి తీరును ప్రస్తావించుకోవాలి. గుజరాత్ సీఎంగా ఉన్న రోజుల్లో పెట్రో ధరలు పెరిగితే.. ఈయన తెగ ఆందోళన చెందేవాడు. కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసేవాడు. అంతేకాదు.. పీఎం అయిన కొత్తలో పెట్రో ధరలు రూపాయి రెండ్రూపాయలు తగ్గేసరికి.. అదంతా తను గద్దెనెక్కిన వేళావిశేషం అని చెప్పుకున్నాడు ఈ మహనీయుడు.

 ఇప్పుడు ముడి చమురు ధరలు పెరగకపోయినా.. పెట్రో ధరలపై భారీ వడ్డన విధించింది మోడీ సర్కారు. మరి మోడీ ఇప్పుడు  ఏమని ట్వీటుతారో!

Show comments