'నా పైత్యం ప్రపంచానికే పైత్యం' అంటే ఎలా?

సినీకవుల్లో ఇద్దరు ప్రముఖుల గురించి ఒక నానుడి ఉంది. 'ప్రపంచపు బాధ మొత్తం నా బాధ' అనుకుంటాడట శ్రీశ్రీ. అలాగే 'నా బాధ ప్రపంచం మొత్తానికీ బాధ' అనుకుంటాడట దేవులపల్లి కృష్ణశాస్త్రి. అంటే వారి కవిత్వం ఆ లక్షణాల్ని కలిగి ఉంటుందని, ఒకరు తన బాధను కవిత్వంగా రాసి ప్రపంచాన్ని ఏడిపిస్తే... మరొకరు ప్రపంచపు ఏడుపునంతా తన కవిత్వంలో ఇమిడ్చి రాసేవారని అంటారు. 

ఇప్పుడు రాజకీయాల్లో అలాగే కనిపిస్తోంది. తనకున్న పైత్యాన్ని రాష్ట్ర ప్రజలంతా కూడా అలవాటు చేసుకోవాల్సిందే అన్నట్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారా అని అనిపిస్తోంది. రకానికి ఒక కార్యక్రమంతో ముందుకు వెళుతూ ఉన్న కేసీఆర్‌ సర్కారు తాజాగా హరితహారం పథకాన్ని చేపడుతోంది. ప్రపంచంలోనే రికార్డు సృష్టించేలా 46 కోట్ల మొక్కలను రెండు వారాల వ్యవధిలో రాష్ట్రమంతా నాటించాలనేది ఈ ప్రణాళిక. విద్యార్థులు, ప్రజలందరూ ఇతోధికంగా మొక్కలు నాటాలని, ప్రభుత్వమే మొక్కలు సరఫరా చేస్తుందని, ప్రజలు తాము నాటిన మొక్కలను తామే పరిరక్షించుకోవాలని కేసీఆర్‌ పిలుపు ఇచ్చారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. 

అయితే కేసీఆర్‌ జ్యోతిష్యాలు, గ్రహాల ప్రభావంగురించి తనకు ఉండే నమ్మకాలను రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా అంటించే ప్రయత్నం చేస్తున్నారా అనిపిస్తోంది. ఏ రాశివారు, ఏ నక్షత్రం వారు ఏ మొక్కలను నాటితే వారికి శుభం కలుగుతుందో ఆ వివరాలను జ్యోతిష్య పండితులతో ప్రభుత్వం సేకరించిందిట. రాశులు- మరియు నక్షత్రాల బలాలను బట్టి.. జ్యోతిష్య పండితులు ఎవరు ఏ మొక్కలు నాటాలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారుట. ఆ ప్రకారం జనాల్లో ముందుగా ఒక జ్యోతిష్య నమ్మకాన్ని నాటి, ఆ నమ్మకం పునాదుల మీద తాను ఇచ్చే మొక్కను నాటడానికి కేసీఆర్‌ స్కెచ్‌ వేసినట్లుగా కనిపిస్తోంది. 
కేసీఆర్‌కు జ్యోతిష్య విశ్వాసాలు అధికంగా ఉన్నాయనే సంగతి అందరికీ తెలిసిందే. ఆయన వాటిని దాచుకోరు. అయితే ఇప్పుడు ఈ మొక్కలరూపంలో యావత్తు రాష్ట్ర ప్రజల మీద దానిని రుద్దడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. మీ రాశికి తగిన మొక్క నాటండి అంటూ ప్రజల్ని ప్రేరేపిస్తే... ఆ మొక్క సంరక్షణ పట్ల వారు మరింత జాగ్రత్తగా ఉంటారనేది బహుశా కేసీఆర్‌ ఆలోచన కావొచ్చు. మొక్కలు నాటి వదిలేయకుండా.. తమకు శుభం కలిగిస్తుందనే ఆశతో దాని సంరక్షణ పట్టించుకుంటారని ఆయన అనుకోవచ్చు. కానీ ఆ కారణం చూపి మూఢ నమ్మకాల్ని అధికారికంగా ఇలా జనం మీద రుద్దడం ఏం సబబు అనిపించుకుంటుంది అనే చర్చ కూడా ప్రజల్లో జరుగుతోంది. 

Show comments