దేశ రెండో రాజధాని అమరావతి...నిజమా?

దేశ రాజధాని ఢిల్లీ అనే సంగతి తెలియనివారుండరు కదా. అవును ఉండరు. పసిపిల్లవాడి నుంచి పండు ముదుసలి వరకు అందరికీ తెలుసు. ఇప్పటివరకు దేశానికి ఉన్నది ఒక్కటే రాజధాని. కాని త్వరలోనే రెండో రాజధాని నగరం నిర్మిస్తారట. అది కూడా ఆంధ్రప్రదేశ్‌లోనట...! ఇంకా చెప్పాలంటే ప్రతిపాదిత రాజధాని నగరం అమరావతి దగ్గర్లో నిర్మిస్తారట...! అసలు అమరావతే దేశ రెండో రాజధానిగా చేస్తారేమో....! ఇది నిజమే అయితే జాతీయ మీడియాతో సహా ప్రాంతీయ మీడియాలోనూ ప్రముఖంగా రావాలి. కేంద్ర ప్రభుత్వమే ప్రకటించి ఉండేది. కాని మీడియాలో వచ్చిన దాఖలా లేదు. కేంద్ర సర్కారు ఎన్నడూ ప్రస్తావించిన దాఖలా లేదు. 

కాని ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక 'కేంద్ర దక్షిణాది రాజధానిగా అమరావతి' అనే వార్త ప్రచురించింది. ఇది నిజమే అయితే ప్రాధాన్యమిచ్చి మొదటి పేజీలో ప్రచురించాలి. కాని లోపలి పేజీలో చిన్న వార్తగా ప్రచురించింది. 'రెండో రాజధానిగా అమరావతికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం' అని వార్తలో పేర్కొన్నారు. మరి ఇంతటి ప్రాధాన్య వార్త ఆంగ్ల పత్రికల్లో ప్రచురించినట్లు కనబడటంలేదు. ఇంతకూ ఈ రెండో రాజధాని కథాకమామీషు ఏమిటి? ఈ వార్త ప్రకారం....భవిష్యత్తులో పాకిస్తాన్‌ నుంచి ఇండియాకు అణు ముప్పు ఉంది. ఈ ముప్పును తప్పించుకోవాలంటే మరో రాజధాని అవసరం. ఏపీ రాజధాని అమరావతి ఇందుకు సరైన ప్రాంతమని కేంద్రం భావిస్తోంది. 

చెన్నయ్‌, బెంగళూరు, హైదరాబాద్‌ కంటే కృష్ణా నది ఒడ్డున ఉన్న అమరావతి సురక్షిత ప్రాంతమని కేంద్రం భావిస్తోంది. పాకిస్తాన్‌ న్యూక్లియర్‌ క్షిపణులను ప్రయోగించినా ఎలాంటి ముప్పూ ఉండదట. రెండో రాజధానిపై హోం శాఖ తయారుచేసిన ప్రతిపాదనలకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందట. ఈ రాజధానిలో పార్లమెంటు భవనం నిర్మించడంతోపాటు రైల్వే, రక్షణ, పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను నెలకొల్పుతారట. ఈ వార్తలో మరో కన్‌ఫ్యూజన్‌ ఉంది. అమరావతే రెండో రాజధానా? లేదా మరో నగరం నిర్మిస్తారా? 'ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి వద్ద ప్రత్యామ్నాయంగా కేంద్ర రాజధానిని ఏర్పాటు చేసే యోచనలో భారత ప్రభుత్వం ఉంది' అని రాశారు. 

అమరావతి వద్ద రాజధాని నిర్మిస్తారంటే చంద్రబాబు సర్కారు నిర్మించే నగరం కాకుండా మరో నగరమన్న మాట. ఒకే చోట రెండు నగరాలు ఎందుకు నిర్మిస్తారు? కేంద్రం ఏదైనా నిర్మించాలనుకుంటే అమరావతిలోనే నిర్మిస్తుంది. అప్పుడే అదే రెండో రాజధాని అవుతుంది. ఏది ఏమైనా ఈ వార్తలో నిజమెంతో తెలియదు. నరేంద్ర మోదీ అధికారలంలోకి వచ్చాక ఇప్పటివరకు రెండో రాజధాని ప్రస్తావన రాలేదు. అయితే దేశానికి రెండో రాజధాని అవసరమని, అది దక్షిణాదిలో ఉండాలనే చర్చ ఎప్పటినుంచో జరుగుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో దీనిపై విస్తృతంగా చర్చ జరిగింది. 

హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి దేశ రెండో రాజధానిగా ప్రకటించాలని సమైక్యవాదులు డిమాండ్‌ చేశారు. హైదరాబాదును రెండో రాజధానిగా చేయాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేద్కర్‌ ఏనాడో కోరారని, రెండో రాజధాని అయ్యే అన్ని అర్హతలు హైదరాబాదుకు ఉన్నాయని అప్పట్లో కొందరు వాదించారు. 1950లో ప్రచురితమైన 'థాట్స్‌ ఆఫ్‌ లింగ్విస్టిక్‌ స్టేట్స్‌' అనే పుస్తకంలో అంబేద్కర్‌ హైదరాబాదును రెండో రాజధాని చేయాలని ప్రతిపాదించారు. ఉత్తర, దక్షిణ భారతాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తకుండా ఉండాలంటే దక్షిణాదిన రాజధాని ఏర్పాటు చేయాల్సిన అవసరముందని అంబేద్కర్‌ అభిప్రాయపడ్డారు. 

పొరుగు దేశాల నుంచి బాంబింగ్‌ జరిగితే ఢిల్లీకి చాలా నష్టమని అంబేద్కర్‌ తెలిపారు. అంతేకాకుండా దక్షిణాది రాష్ట్రాలవారికి ఢిల్లీ సౌకర్యవంతమైన నగరం కాదని, వారికి దూరాభారమే కాకుండా, ఇక్కడ విపరీతమైన చలి, విపరీతమైన వేడి కారణంగా దక్షిణాదివారికి ఇబ్బందులున్నాయని చెప్పారు.  ఉత్తర భారతీయులు కూడా ఎండాకాం ఢిల్లీలో తట్టుకోలేరని అంబేద్కర్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా యుద్ధాలొస్తే ఇది సురక్షిత ప్రాంతం కాదన్నారు. రెండో రాజధానిగా కోల్‌కతా, ముంబయిలను అంబేద్కర్‌ వ్యతిరేకించారు. అన్నిటికంటే బెస్ట్‌ సిటీ హైదరాబాద్‌ అని స్పష్టం చేశారు. 

హైదరాబాదును తెలంగాణకు దక్కనీయకుండా చేయడానికి సమైక్యవాదులు అప్పట్లో అంబేద్కర్‌ ఆలోచనను తీవ్రంగా ప్రచారం చేశారు. కాని వారి కోర్కె నెరవేర్చడానికి యూపీఏ సర్కారు అంగీకరించకుండా రాష్ట్ర విభజన చేసింది. ఇప్పుడు అమరావతి ఆలోచన చేస్తోందట....! ఈ వార్త నిజమే అయితే మరిన్ని వివరాలు తెలియకుండా ఉంటాయా? 

Show comments