హ్హ...హ్హ...హ్హ.. మోడీ నో ఛేంజ్‌

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి శంకుస్థాపనకు వెళ్ళారు.. వెళ్ళిన పని పూర్తి చేసుకుని వచ్చారు. తెలంగాణలో తొలిసారిగా అదుగు పెట్టారు.. ఇక్కడా ఆతిథ్యం స్వీకరించారు. అక్కడ చంద్రబాబుని పొగిడారు, ఇక్కడ కేసీఆర్‌ని పొగిడారు. అక్కడా ఉత్త చేతులే, ఇక్కడా ఉత్త చేతులే. అక్కడా మాటలే, ఇక్కడా మాటలే. అంతకు మించి, ఆంధ్రప్రదేశ్‌కి ఆయన ఇచ్చిందేమీ లేదు, తెలంగాణకూ ఇచ్చిందేమీ లేదు. మొత్తమ్మీద, సమన్యాయం పాటిస్తున్నారంతే. 

తొలిసారిగా తెలంగాణలో పర్యటించిన నరేంద్రమోడీ నుంచి తెలంగాణ చాలా ఆశించింది. మరీ ముఖ్యంగా తెలంగాణలోని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ చాలా అంచనాలతో వుంది. తెలంగాణలో ఏదో ఒక ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాల్సిందిగా తెలంగాణ తరఫున ఇప్పటికే ప్రధానికి విన్నవించామనీ, ఈ నేపథ్యంలో నరేంద్రమోడీ పర్యటనలో స్పష్టత రావొచ్చనీ ఆశించింది. కానీ, భంగపడింది. కనీసం, మిషన్‌ భగీరధ కోసం నిధులను అయినా కేంద్రం తరఫున ఎంతో కొంత విడుదల చేస్తామనే హామీ నరేంద్రమోడీ ఇస్తారనుకుంటే అదీ జరగలేదు. 

అక్కడ అమరావతిలో ఎలాగైతే చంద్రబాబు, నరేంద్రమోడీ భజనలో మునిగి తేలారో.. ఇక్కడ కేసీఆర్‌ కూడా అదే పని చేశారు. ఓ అడుగు ముందుకేసి, తన నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏనాడూ అవినీతి రహిత పాలన చూడలేదనీ, ఇప్పుడే ఈ గడచిన రెండేళ్ళలోనే కేంద్రంలో అవినీతి రహిత పాలనను చూస్తున్నానని నరేంద్రమోడీని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు కేసీఆర్‌. 

ఇక, మాటకారి నరేంద్రమోడీ తక్కువేమన్నా తిన్నారా.? తనను ఎప్పుడు కేసీఆర్‌ కలిసినా, తెలంగాణ అభివృద్ధి గురించే మాట్లాడేవారనీ, తెలంగాణ రెండేళ్ళ వయసున్న పసిబిడ్డ అనీ, దేశంలో ఇంత చిన్న వయసున్న రాష్ట్రం ఇంకేదీ లేదనీ, తెలంగాణ మనసు దోచే ప్రయత్నంతోపాటు, కేసీఆర్‌ని మాటల్తో బోల్తా కొట్టించేశారు. 

'తెలంగాణలో పెండింగ్‌ రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేస్తాం..' అన్న మాట తప్ప, ఇంకో హామీ తెలంగాణకు సంబంధించి నరేంద్రమోడీ ఏమీ ఇవ్వకపోవడం గమనార్హమిక్కడ.

Show comments