'పచ్చ' పార్టీలో చేరి...చంద్రబాబూ నీతో....

'పచ్చ బొట్టేసిన పిల్లగాడ నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా...' అని 'బాహుబలి'లో తమన్నా పాడుకున్ననట్లుగా అదే స్టయిల్లో ఒకప్పటి కలెక్షన్‌ కింగ్‌, డైలాగ్‌ కింగ్‌ మోహన్‌బాబు ఇప్పుడు పాడుకుంటున్నట్లు సమాచారం. ఆయనేం పాడుతున్నారు? 'పచ్చ' పార్టీలో చేరి చంద్రబాబూ నీతో ఆంధ్ర రాజకీయాలనే చేయాలనుందిరా...' అని పాడుకుంటూ ముహూర్తం కోసం పంచాంగం చూసుకుంటున్నారట....! ఈమధ్య డైలాగ్‌ కింగ్‌ తన కుమార్తె మంచు లక్ష్మితో కలిసి చంద్రబాబును కలుసుకొని మాట్లాడారు. 

పైకి మర్యాదపూర్వకంగా కలిసినా లోపల వ్యవహారం మాత్రం టీడీపీలో చేరడమేనని తెలుస్తోంది. 'అయ్యా...మోహన్‌బాబుగారూ మీరు చంద్రబాబును కలుసుకున్నారు కదా. ఏమిటి వ్యవహారం?'..అని ఓ ఆంగ్ల దినపత్రిక ఆయన్ని అడిగినప్పుడు 'చెప్పేందుకు ఇది సరైన సమయం కాదు' అని సెలవిచ్చారు. అంటే అర్థమేమిటి? మోహన్‌బాబు దగ్గర ఏదో చెప్పాల్సిన మేటరుందని స్పష్టమైంది. అది చెప్పేందుకు సమయం కోసం చూస్తున్నారు. టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ 'షరతులు వర్తిస్తాయి' అన్నట్లుగా ఏవో మాట్లాడుకునే విషయాలుంటాయి. అవి ఫైనలైజ్‌ అయ్యాక ఓ శుభ ముహూర్తాన తాను ఎప్పుడు పచ్చ కండువా కప్పుకోబోతున్నాడో చెబుతుండవచ్చు.

మోహన్‌బాబు కొత్త బిచ్చగాడు కాదు. అంటే కొత్త రాజకీయ నాయకుడు కాడని అర్థం. ఇంకా చెప్పాలంటే ఆయన ఇప్పటికీ టీడీపీ నాయకుడే. అదేమిటి? ఆ పార్టీ నుంచి ఎప్పుడో వెళ్లిపోయాడు కదా అనుకోవచ్చు. నిజమే...వెళ్లిపోయినా మరే పార్టీలో చేరకుండా ఇన్నేళ్లబట్టి రాజకీయంగా ఖాళీగానే ఉన్నారు. కాబట్టి ఆయన్ని టీడీపీ నాయకుడిగానే భావించాలి. మళ్లీ టీడీపీలోకి రావడమంటే కొన్నాళ్లు ఏదో ఊరికెళ్లి ఇంటికి వచ్చినట్లే అనుకోవాలి. ఎన్‌టీ రామారావుకు వీరాభిమాని అయిన మోహన్‌బాబు 1982లోనే టీడీపీలో చేరి రాజ్యసభ ఎంపీ కూడా అయిన విషయం తెలిసిందే. 

తాను మళ్లీ రాజకీయరంగ ప్రవేశం చేయబోతున్నట్లు ఈ డైలాగ్‌ కింగ్‌ కొంతకాలం క్రితం మీడియాకు చెప్పారు. అదిప్పుడు వర్కవుట్‌ అవుతున్నట్లుగా ఉంది. అయితే అప్పట్లో ఆయన తన పునరాగమనానికి చెప్పిన కారణాలు నాటకీయంగా ఉన్నాయి.  పేదలకు జరుగుతున్న అన్యాయాలు చూసి గుండె తరుక్కుపోతుండటంతో వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పారు. వాస్తవానికి మోహన్‌బాబు వంటివారు పేదలకు సేవ చేయాలంటే రాజకీయాల్లోకే రానక్కర్లేదు. పాలిటిక్స్‌లోకి రాకుండానే ప్రస్తుతం తాను చేస్తున్న సేవా కార్యక్రమాలను మరింత విస్తరించవచ్చు. 

రీఎంట్రీకి కారణాలు ఎలా ఉన్నా కుళ్లు రాజకీయాల్లో కునారిల్లకుండా విలువలున్న మనిషిగా పేరు తెచ్చుకుంటే మంచిది. ఎన్‌టీఆర్‌ ఆయన ఆరాధ్య దైవం. విలువల విషయంలో ఆయన బాటలో నడవగలితేనే ఆయన పేరు స్మరించడానికి అర్హత ఉంటుంది. ప్రస్తుతం చంద్రబాబు కొన్ని విషయాల్లో (ముఖ్యంగా పార్టీ ఫిరాయింపులు) నైతిక, రాజ్యాంగ విలువలను వదిలేశారు. ఇలాంటివి మోహన్‌బాబు సహిస్తారా? రాజధాని నిర్మాణంలో జరుగుతున్న అవకతవకలు, బాబు మీద వస్తున్న అవినీతి ఆరోపణలను సమర్థిస్తారా? పార్టీలో చేరాక అధినేతకు వ్యతిరేకంగా మాట్లాడటం కుదరదు కదా. 

ఫిరాయింపులపై మోహన్‌ బాబు అప్పట్లో  తీవ్రంగా మాట్లాడారు.  ఘాటు విమర్శలు చేశారు.  టీడీపీని ఉద్దేశించే ఈ విమర్శలు చేశారని కొందరు అనుకున్నారు. మరి పార్టీలో చేరాక ఎలా వ్యవహరిస్తారో...! తాను ఆవేశపరుడినేగాని అవినీతిపరుడిని కానని చెప్పారు. ఇక మోహన్‌బాబుకు వైఎస్‌ జగన్‌ కుటుంబంతో బంధుత్వం ఉన్న సంగతి తెలిసిందే. పెద్ద కుమారుడు విష్ణు భార్య వైఎస్‌ఆర్‌ కుటుంబానికి చెందిన అమ్మాయే. వైఎస్‌ఆర్‌ ఈయనకు బావగారు అవుతారు. ఇప్పుడు జగన్‌కు బద్ధ శత్రువైన టీడీపీలో చేరబోతున్నారు కాబట్టి వైకాపా, జగన్‌ పట్ల ఎలా స్పందిస్తారో చూడాలి. 

జగన్‌, చంద్రబాబు దాదాపు ప్రతి రోజు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటుంటారు. ఇలాంటి సమయంలో మోహన్‌బాబు మాట్లాడకుండా మౌనంగా ఉంటారా? పార్టీలో చేరాక తనను సమర్థించకపోతే చంద్రబాబు ఎందుకు ఊరుకుంటారు? ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. మరి మోహన్‌బాబు 'నొప్పింపక తానొవ్వక' వ్యవహరిస్తారేమో...! కాని రాజకీయాల్లో అలా ఉండటం సాధ్యం కాదు. 

Show comments