బెదిరింపులు, భయపెట్టడాలు... ప్రజాస్వామ్యమేనా?

ఏపీలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రజల్లో ఏ చిన్న ఉద్యమం రూపుదాలుస్తున్నా సరే... భయంతో వణికిపోతున్నట్లుంది. తమ శక్తియుక్తులు, కుట్రలు కూహకాలు అన్నిటినీ ప్రయోగించి.. ప్రజల ఉద్యమ ఆలోచనల్నే సమూలంగా తొక్కేయడానికి ప్రతిసారీ చాలా తాపత్రయపడుతూ ఉంది.

తాజాగా ముద్రగడ పద్మనాభం తలపెట్టిన పాదయాత్ర విషయంలో.. దానికి సహకరించవద్దంటూ, ఆ యాత్రలో పాల్గొనడానికి రావద్దంటూ కాపు యువతను హెచ్చరించడానికి, తద్వారా ముద్రగడ పాదయాత్రను విఫలం చేయడానికి హోంమంత్రి చినరాజప్ప పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ముద్రగడ పోరాటానికి మద్దతు ఇవ్వదలచుకునే కాపు వర్గీయులందరినీ.. భయపెట్టి బెదిరించి రానివ్వకుండా చేయడానికి ఆయన నానా మార్గాలు వెతుకుతున్నారు. 

తాజాగా ముద్రగడ పాదయాత్రకు అనుమతులు లేవని, ఈ యాత్రలో పాల్గొంటే కాపు యువకులు కేసుల్లో చిక్కుకుంటారని... వారి భవిష్యత్తు పాడవుతుందని హోంమంత్రి చినరాజప్ప హెచ్చరిస్తున్నారు. కెరీర్, భవిష్యత్తు అనే మాయమాటలు ప్రయోగించడం ద్వారా యాత్రకు మద్దతిచ్చే వారిని నియంత్రించాలనేది ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది.

ముద్రగడ అనుమతులు అడగడం లేదని చినరాజప్ప వాపోతున్నారు సరే.. మాదిగల సభకు అనుమతి అడిగితే ఈ ప్రభుత్వం ఏం చేసింది? పోనీ అనుమతిని ఇవ్వలేదు సరే... సభాస్థలంలో జనం గుమికూడకుండా.. ఆపడం కూడా పోలీసులకు చేతకాలేదు. అవాంఛనీయ సంఘటనలు జరగనే జరిగాయి. ఇక పోలీసులు ఏం జాగ్రత్తలు తీసుకున్నట్టు? ఏం సాధించినట్టు? అదేదో అనుమతి ఇచ్చేసి.. పోలీసు భద్రతను సవ్యంగా ఏర్పాటుచేసి ఉంటే.. ఏ గొడవా జరిగేది కాదు కదా...? అనేది పలువురిలో మెదలుతున్న సందేహం.

ముద్రగడ అనుమతి అడిగినా... ఏం జరుగుతుందో అందరికీ తెలుసు! అందుకే  ఆయన అడగకుండా భీష్మించుకు కూర్చున్నారు. అయినా ప్రజల్లో ఒక ఉద్యమ ఆలోచన రేకెత్తగానే చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఎందుకు జడుసుకుంటున్నదో అర్థం కావడం లేదు. ఉద్యమాల్ని ‘రాష్ట్రం ఇమేజిని దెబ్బతీసే కుట్రలుగా’ అభివర్ణిస్తూ వారు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు.

తమ బాధలేమిటో, కోరికలేమిటో వినిపించదలచుకున్న వారిని కేసుల బెదిరింపులతో భయపెట్టి అణచివేయడం అనేది ఏరకంగా ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందో అర్థం కావడం లేదని జనంలో విమర్శలు వినిపిస్తున్నాయి. తాము ఎంతగా అణచివేయదలచుకుంటే.. ప్రజల్లో ఉండే నిరసనాగ్నులు లోలోపలే అంతగా రగులుకుంటూ ఉంటాయని.. ఒక్కసారిగా అవి తమ పతనాన్ని శాసించేలా ఏదో ఒకనాటికి విజృంభిస్తాయని చంద్రబాబు ఎందుకు తెలుసుకోవడంలేదోనని పలువురు ఆశ్చర్యపోతున్నారు.

Show comments