మోడీ మార్క్‌ పెట్రో 'వాత'.!

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు మరీ దారుణంగా ఏమీ పెరిగిపోలేదు. కానీ, మన దేశంలో మాత్రం పెట్రోధరలు మండిపోతున్నాయి. నిజానికి అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ ముడి చమురు ధర 100 డాలర్లకు పైన వున్నప్పుడే, మన దేశంలో లీటర్‌ పెట్రోల్‌ ధర 70 నుంచి 75 రూపాయల లోపు వుండేది. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌ 55 డాలర్ల లోపే లభిస్తోంది. ఆ లెక్కన, భారత దేశంలో పెట్రోల్‌ ధర లీటర్‌ ఎంతుండాలి.? 

సరే, 30 డాలర్లకు అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ చమురు ధర పడిపోయినా, దేశంలో ఆ స్థాయిలో పెట్రోధరల్ని తగ్గించలేదు సరికదా, నామమాత్రపు తగ్గింపులకు అదనంగా బాదుడు మోపేసి, కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఖజానాల్ని నింపుకున్నాయి. ఈ విషయంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు పోటీ పడ్డాయనుకోండి.. అది వేరే విషయం. 

మరిప్పుడు, పెట్రోల్‌ - డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయి. ఇప్పుడు అదనపు బాదుడుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించుకోవాలి కదా.? ఇంకా నయ్యం, అలా చేస్తే సామాన్యుడు బాగుపడిపోడూ.! అసలు, దేశంలో ఏం జరుగుతోందో సామాన్యుడికి అర్థం కాని పరిస్థితి. 100 నుంచి 30కి ముడిచమురు ధర పడిపోయినప్పుడు, 70 నుంచి 20కి మన దేశంలో పెట్రోల్‌ ధరలు పడిపోవాలి కదా.! కానీ, అలా జరగలేదు, జరిగే అవకాశమూ లేదు. 20 రూపాయలకి పెట్రోల్‌ దొరికేసే అవకాశం వున్నా, మరీ సామాన్యుడు అంత అత్యాశకు పోవడంలేదు. 50 రూపాయలకు అటూ ఇటూ వున్నా ఫర్లేదనుకున్నాడంతే. 

అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ ముడిచమురు ధర మళ్ళీ 100 డాలర్లను టచ్‌ చేస్తే, దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పరిస్థితి ఎలా వుంటుంది.? 150 రూపాయల మార్క్‌ని దాటేస్తాయేమో.! ఏమో, బహుశా నరేంద్రమోడీ టార్గెట్‌ అదే కావొచ్చుగాక. అబ్బే, ఇది చమురు కంపెనీల నిర్ణయం.. అని కేంద్రం చెప్పుకోవచ్చేమోగానీ, వాటిని నియంత్రించేది, నియంత్రించాల్సిందీ కేంద్రమే కదా.?

Show comments