నల్లధనం తగ్గిందా.? మోడీజీ.. అదెలా.!

దేశంలో నల్లధనం తగ్గిపోయిందట. రాష్ట్రపతి ప్రసంగం ద్వారా దేశానికి నరేంద్రమోడీ సర్కార్‌ ఇచ్చిన వివరణ ఇది. పెద్ద పాత నోట్ల రద్దుతో నల్లధనం 'పరార్‌' అయిపోయిందన్నది నరేంద్రమోడీ సర్కార్‌ గత కొంతకాలంగా చెబుతున్న మాట. ఈ మాటలే, రాష్ట్రపతి ప్రసంగంలో విన్పించాయి. ఇక్కడ, రాష్ట్రపతి ప్రసంగాన్ని తప్పుపట్టడానికేముంది.? 

అయితే, నిజంగానే దేశంలో నల్లధనం తగ్గిపోయిందా.? ఏమో మరి, నరేంద్రమోడీకే తెలియాలి. రాష్ట్రపతి నోట, నల్లధనం తగ్గిపోయింది.. అన్న మాట రాగానే, ప్రధాని నరేంద్రమోడీ విజయగర్వంతో బల్లలు చరిచేశారు. పెద్ద పాత నోట్ల రద్దు వ్యవహారం దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. మీడియాని తన కనుసన్నల్లో నడిపిస్తున్న మోడీ, వాస్తవాలు బయటకు రాకుండా చూడడంలో విజయవంతమయ్యారు. అందుకే, పెద్ద పాత నోట్ల రద్దు తాలూకు దుష్ప్రభావాల్ని కళ్ళుండీ మనం చూడలేకపోతున్నాం. 

ఇక, దేశంలో నల్లధనం ఎంతుందో తెలియదంటూ గతంలో కేంద్రం, పార్లమెంటు సాక్షిగా మొన్నామధ్యన ప్రకటించింది. అలాంటప్పుడు, నల్లధనం తగ్గిందని ఇప్పుడెలా చెప్పగలం.? ఏమాత్రం విజ్ఞత వున్నా, 'నల్లధనం తగ్గింది' అని చెప్పుకోడానికే ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. అది లేకనే కదా.. ధైర్యంగా అవాస్తవాల్ని మోడీ సర్కార్‌ ప్రజల ముందుచగలుగుతోంది. నల్లధనమొక్కటే కాదు, అవినీతి కూడా తగ్గిపోయిందన్నది రాష్ట్రపతి ప్రసంగం ద్వారా నరేంద్రమోడీ సర్కార్‌ చెప్పించినమాట. 

అప్పట్లో 500, 1000 రూపాయల నోట్లతో అవినీతి జరిగితే, ఇప్పుడు అంతకన్నా బెటర్‌గా.. 2000 రూపాయల నోటుతో అవినీతి జరుగుతోంది. అంతే తేడా, అంతకు మించి అవినీతిలో వచ్చిన మార్పుల్లేవు. ఆ మాటకొస్తే, పెద్ద పాత నోట్ల రద్దు తర్వాత అవినీతి రెండింతలయ్యిందని చెప్పుకోవాలేమో. పార్లమెంటు సమావేశాలు నేటినుంచి ప్రారంభమయ్యాయి. ఆర్థిక సర్వే బయటకు వచ్చింది. ఎక్కడా, ఆశాజనకమైన పరిస్థితులైతే కన్పించడంలేదు.. దేశ ఆర్థిక పరిస్థితికి సంబంధించి. 

'పెద్ద పాత నోట్ల రద్దు తర్వాత ఇంకా పరిస్థితి పూర్తిగా గాడిన పడలేదు.. ఇంకో రెండు మూడు నెలల సమయం పడ్తుంది. కాబట్టి, ఈలోగా అద్భుతాల్ని ఆశించెయ్యడం సబబు కాదు..' ఇవీ మోడీ సర్కార్‌ సన్నాయి నొక్కులు. అటు నల్లధనం తగ్గక, ఇటు అవినీతి అంతమొందక.. ఆర్థిక పరిస్థితేమో అత్యంత దారుణంగా తయారై.. అసలెందుకీ పెద్ద పాత నోట్ల రద్దు.? ఇది సామాన్యుడి ప్రశ్న. మోడీజీ గతంలోలా పార్లమెంటు సమావేశాలకు ఈసారీ మొహం చాటేయకుండా, దేశ ప్రజల్ని ఉద్దేశించి వివరణ ఇస్తారా.? ఇస్తారనే యావత్‌ భారతదేశం ఎదురుచూస్తోంది.

Show comments