అవినీతిలో ఆంద్రప్రదేశ్‌ నెంబర్‌ వన్‌.!

అవినీతిలో ఆంధ్రప్రదేశ్‌ నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిచిందంటూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. విపక్షాల నుంచి ఈ తరహా ఆరోపణలు మామూలే అయినా, మిత్రపక్షం నుంచి అవినీతి ఆరోపణలు వస్తుండడండం ఆషామాషీ వ్యవహారం కాదు. ఆంధ్రప్రదేశ్‌లో, టీడీపీ - బీజేపీ అధికారం పంచుకుంటున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో, బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు 'అధికారికం' అనే భావించాలేమో.! 

భూమి కొనాలన్నా, అమ్మాలన్నా.. ఏ పని జరగాలన్నా ఆంధ్రప్రదేశ్‌లో 'లంచం' లేకుండా పని జరగడంలేదని విష్ణుకుమార్‌రాజు ఆరోపించారు. అవినీతి అధికారుల్ని పట్టిస్తే 10 వేల రూపాయల నగదు, ప్రధాని నరేంద్రమోడీతో ఫొటో దిగే అవకాశం కల్పిస్తామంటూ ఆయన బంపర్‌ ఆఫర్‌ ప్రకటించడం గమనార్హం. అయితే, ఇది కేవలం ముందుగా వచ్చిన 100 మందికి మాత్రమేనట. విశాఖలో త్వరలో మోడీ పర్యటిస్తారనీ, ఆ పర్యటన సందర్భంగా ఫొటో దిగే అవకాశం కల్పిస్తామని చెప్పారాయన. 

విష్ణుకుమార్‌రాజు వ్యవహారం ఒక్కోసారి బీజేపీ నేతలకే మింగుడుపడదు. అప్పటికప్పుడు చంద్రబాబుని ప్రశంసలతో ముంచెత్తేస్తారు, అంతలోనే చంద్రబాబుని నిండా ముంచేస్తారు. ఒక్కోసారి, బీజేపీని సైతం ఇరకాటంలో పడేసే వ్యాఖ్యలు చేయడంలో విష్ణుకుమార్‌రాజు దిట్ట. 

మొత్తమ్మీద, 'నేను నిప్పు..' అని చంద్రబాబు ఓ పక్క చెప్పుకుంటోంటే, 'నిప్పు కాదు తుప్పు..' అంటూ మిత్రపక్షమే సర్టిఫై చేసెయ్యడం విశేషమే. అమరావతి దగ్గర్నుంచి పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాల దాకా.. అన్నిట్లోనూ అవినీతి.. అంటూ చంద్రబాబు సర్కార్‌ తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోంది. ప్రతిపక్షం వైఎస్సార్సీపీ చేసే విమర్శల్ని తిప్పికొట్టేయొచ్చుగానీ, మిత్రపక్షం నుంచి వస్తోన్న విమర్శల్ని కొట్టిపారేయడం అంత తేలిక కాదు. 

అంతా బాగానే వుందిగానీ, ఆంధ్రప్రదేశ్‌ని అవినీతిలో నెంబర్‌ వన్‌గా నిలబెట్టిన టీడీపీతో, ఇంకా బీజేపీ ఎందుకు అంటకాగాలట. అక్కడేమో మోడీ పాలన అవినీతి రహితమట, ఇక్కడేమో అదే మోడీ స్నేహితుడు చంద్రబాబు హయాంలో పాలన అవినీతిమయమట. చంద్రబాబు మకిలి మోడీకి అంటుకోకుండా ఎలా వుంటుంది.. ఇద్దరూ అధికారం పంచుకుంటున్నాక.!

Show comments