తెలియదు, మరిచిపోయా, అంతే గుర్తుంది.. సిట్ తో రవితేజ

అదుర్స్ సినిమాలో ఓ డైలాగ్ తో భలే కామెడీ పండిస్తాడు ఎన్టీఆర్. విలన్ ఏమడిగినా "తెలీదు.. గుర్తులేదు.. మరిచిపోయా.." అని మాత్రం చెబుతుంటాడు. ఎన్టీఆర్ చెప్పిన ఆ డైలాగ్ ను బట్టీ పట్టి మరీ సిట్ ఆఫీస్ కు వెళ్లినట్టున్నాడు రవితేజ. అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు "తెలీదు.. గుర్తులేదు.. మరిచిపోయా.." అని సమాధానాలిచ్చాడట. రవితేజ కోసం ప్రత్యేకంగా 150 ప్రశ్నలు సిద్ధంచేస్తే.. అందులో దాదాపు 90 శాతం ప్రశ్నలకు ఇవే సమాధానాలిచ్చాడట రవితేజ.

రవితేజ కోసం దాదాపు వారం రోజులుగా ప్రిపేర్ అయింది సిట్. కెల్విన్ అందించిన సమాచారంతో పాటు తాజాగా అరెస్ట్ చేసిన నెదర్లాండ్ స్మగ్లర్ అందించిన వివరాల ఆధారంగా ప్రశ్నలు సిద్ధంచేశారు. చార్మి, సుబ్బరాజు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా కూడా ప్రశ్నలు ఫ్రేమ్ చేశారు. కానీ సిట్ లాక్ చేద్దామని ప్రయత్నించిన ప్రతిసారి గుర్తులేదంటూ సమాధానం చెప్పి తప్పించుకున్నాడట రవితేజ.

చివరికి తమ్ముళ్లు భరత్, రఘు గురించి అడిగిన కొన్ని ప్రశ్నలకు కూడా ఇదే తరహా సమాధానాలివ్వడంతో సిట్ అధికారులు ఆశ్చర్యపోయారు. మరోవైపు రక్త నమూనాలు, కేశాలు ఇచ్చేందుకు కూడా రవితేజ నిరాకరించాడని సిట్ అధికారులు వెల్లడించారు.

ఓవరాల్ గా 9 గంటలకు పైగా సాగించిన విచారణలో రవితేజ నుంచి తాము పెద్దగా వివరాలు రాబట్టలేకపోయామని, పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి వెల్లడించాడు. మరోవైపు రవితేజ ఇంటరాగేషన్ కొనసాగుతున్న టైమ్ లోనే డ్రగ్స్ వివాదంపై సిట్ అధికారులతో కేసీఆర్ సమావేశం ఏర్పాటుచేశారు. విచారణ టైమ్ లో ఉండాల్సిన కీలకమైన అధికారులంతా దాదాపు 2 గంటల పాటు ముఖ్యమంత్రితో మీటింగ్ కు వెళ్లిపోయారు.

Show comments