90ల టైటిల్స్ ను కూడా వదలని టాలీవుడ్.!

టైటిల్స్ ను రిపీట్ చేయడం తెలుగు సినిమా మేకర్లకు కొత్తేం కాదు. మన సినిమాల్లో నవ్యత తక్కువే.. కాబట్టి, టైటిళ్లు కూడా రిపీటయిపోతూ ఉంటాయి. కొత్త టైటిల్స్ ను వెదికే తీరిక లేక కొంతమంది పాత టైటిల్స్ ను రిపీట్ చేస్తూ ఉంటే మరి కొందరు పాత సినిమాల టైటిళ్లను వాడుకొంటూ తమ సినిమాల చుట్టూ హైప్ ను క్రియేట్ చేసుకునే యత్నం చేస్తూ ఉంటారు. మనోళ్లు ఇప్పటికే మాయబజార్ నుంచి శంకరాభరణం వరకూ ఏ టైటిల్ నూ వదల్లేదు. దాదాపుగా ప్రతి ఫేమస్ సినిమా పేరుతోనూ మరో సినిమా కూడా ఉంటోంది.

ఇన్ని రోజులూ మనోళ్లు పాత టైటిల్స్ ను రిపీట్ చేసే వాళ్లు. అంటే... టైటిల్ రిపిటేషన్ ఒక టైమ్ బౌండ్ పెట్టుకున్నట్టుగా కనిపించారు. 1950లలో వచ్చిన సినిమాల టైటిళ్ల తో ఈ తరంలో సినిమాలు తీసిన వాళ్లు ఉన్నారు. ఇలా టైటిళ్లను రిపీట్ చేయడంలో 1985 ఒక హద్దుగా కనిపించింది. అంటే.. మల్లీశ్వరి, మాయ బజార్, మిస్సమ్మ.. లతో మొదలుపెట్టి, సోగ్గాడు, దేవుడు చేసిన మనుషులు, అడవి రాముడు.. వంటి 70లలో వచ్చిన సినిమా టైటిళ్లలను తిరిగి వాడుతూ వచ్చింది చిత్ర పరిశ్రమ. ఓవరాల్ గా పాత సినిమాలు అనదగ్గ 90 లోపు టైటిళ్లే మొన్నటి వరకూ రిపీట్ అయ్యాయి.

అయితే ఇప్పుడు మాత్రం ఆ హద్దును చెరిపేస్తూ 1990 తర్వాత వచ్చిన సినిమా టైటిళ్లను కూడా మనోళ్లు వాడేయడం మొదలుపెట్టారు. ఇంకా జనాలు పాత టైటిళ్ల గురించి మాట్లాడుతుండగానే ఇప్పుడు అవే టైటిల్స్ తో వచ్చిన సినిమాలు జనాలను పలకరిస్తున్నాయి. దీంతో ఒకరకమైన గందరగోళం కూడా తప్పడం లేదు. ఉదాహరణకు ఇప్పుడు ఇంద్రగంటి మోహన కృష్ణ  'జెంటిల్‌మన్‌ ' హిట్టై కూర్చుంది.  పాత టైటిళ్లను రిపీట్ చేయడం ఇంద్రగంటికి అలవాటే. 

ఇది వరకూ 'మాయ బజార్' వంటి క్లాసిక్ టైటిల్ ను వాడి దానికి న్యాయం చేయలేకపోయాడు. అలాగే ‘బందిపోటు’ అంటూ మరో హిట్టు సినిమా టైటిల్ ను రిపీట్ చేసి ప్లాఫును ఎదుర్కొన్నాడు ఇంద్రగంటి. మరి అవంటే పోయాయి. ఆల్రెడీ శంకర్ దర్శకత్వంలో అర్జున్ హీరోగా వచ్చిన సూపర్ హిట్టు బొమ్మ ‘జెంటిల్‌మన్‌’ ఉండనే ఉంది. ఇప్పుడు నాని ‘జంటిల్మన్’ తో 90 లలో వచ్చిన డబ్బింగ్ బొమ్మ టైటిల్ రిపీటయ్యింది. 

అలాగే ‘ప్రేమికుడు’ ఇది తాజాగా వార్తల్లో ఉన్న ఒక సినిమా పేరు. ఈ పేరు  చెబితే శంకర్ దర్శకత్వంలోనే వచ్చిన తమిళ డబ్బింగ్ బొమ్మ ప్రభుదేవ ‘ప్రేమికుడు’ గుర్తు రాకమానదు. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ బృందావనం అంటూ ఒక సినిమా చేశాడు. అదే పేరుతో 90లలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా వచ్చిన ఒక హిట్టు సినిమా ఉంది. ఇలా తరచి చూస్తే 90లలో వచ్చిన సినిమాల టైటిళ్లు రిపీటవ్వడం కూడా ఎక్కువే అవుతోంది. దీన్ని భావదారిద్ర్యం అనాలా? సినిమా వాళ్ల సౌలభ్యం అనుకోవాలా?!

Show comments