దేశంలో కరెన్సీ ఎమర్జెన్సీ కన్పిస్తోంది. 'తాంబూళాలిచ్చేశాం.. తన్నుకు ఛావండి..' అన్న చందాన కరెన్సీ మార్పిడి - రద్దుపై ప్రకటన చేసేసి, ప్రధాని నరేంద్రమోడీ జపాన్ విమానమెక్కేశారు. అంతే, దేశమంతా అల్లకల్లోలమైపోయింది. వ్యాపారాలు నిలిచిపోయాయి.. సామాన్యుడు అన్ని పనులూ మానుకుని బ్యాంకుల ముందు క్యూ కట్టాల్సి వచ్చింది. పాల ప్యాకెట్ కొనుక్కోడానికీ 'చిల్లర' దొరక్క కుదేలయ్యాడు. సందట్లో సడేమియా.. అంటూ ప్రభుత్వం, నల్ల కుబేరులు తమ నల్లధనాన్ని మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఇది నిజం.
బ్యాంకుల ముందు ఎండలో బారులు తీరుతున్నవారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా సెలబ్రిటీలు కన్పించరు. ఏం, వారికి డబ్బులతో అవసరం లేదా.? అని ఇప్పుడు సాధారణ ప్రజానీకం ప్రశ్నిస్తున్నారు. ముందుగా అంతా ఈ నిర్ణయాన్ని సమర్థించినవారే. కానీ, పరిస్థితి మారుతోంది. అసలు, ఇదంతా పెద్ద కుంభకోణం ఎందుకు కాకూడదు.? బీజేపీ ముందుగా జాగ్రత్తపడి, తమ వద్దనున్న నల్లధనాన్ని మార్చేసుకుని, దేశంలో అతి పెద్ద రాజకీయ కుట్రకు తెరలేపిందని ఎందుకు అనుకోకూడదు.? అన్న అనుమానాలు తెరపైకొస్తున్నాయి
నిజమే మరి, పాత నోట్లు ఇంకా మారుతున్నాయి.. బంగారం బిస్కెట్ల రూపంలోకి నల్లధనం మారుతోంది. ఐటీ శాఖ కన్నేసినాసరే, అసలు ఆ బంగారమే నల్ల బంగారమైనప్పుడు, ఈ నల్లకుబేరుల లెక్క ఎలా తేలుతుందట.? ఓ నగల దుకాణంలో (బిస్కెట్ల అమ్మకాలకి కేరాఫ్ అడ్రస్) ఏకంగా ఒక్క రోజు 300 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి. అక్కడ ఆ బంగారం దుకాణం బుక్కయిపోవచ్చుగాక, కానీ ఇక్కడ నల్ల కుబేరుడు సేఫ్ అయిపోయాడు కదా. ఇది జస్ట్ ఓ ఉదాహరణ మాత్రమే.
పన్నులు చెల్లించడానికి పెద్ద నోట్లు పనికొస్తాయని ప్రభుత్వం ప్రకటించింది.. ఇకనేం, నల్లధనం కాస్తా తెల్లగా మారిపోతోంది. అప్పులిచ్చినట్లుగా బాండ్లు రాయించుకుని మరీ పేదోళ్ళతో పెద్దలు తమ నల్లధనాన్ని మార్పించేసుకుంటున్నారు. విజయవాడలో ఓ వస్త్ర దుకాణం, పాత నోట్లు చెల్లవని కేంద్రం చెప్పినా, 'మేం నిజాయితీగా వ్యాపారం చేస్తున్నాం.. మేం నోట్లు తీసుకుని, బిల్లుల్ని చూపిస్తాం..' అని నిరభ్యంతరంగా పాత నోట్లతో వ్యాపారం చేసేస్తోంది.
ముందస్తుగానే కరెన్సీ మార్పిడిపై సమాచారం అందుకున్న కొందరు, రాత్రికి రాత్రి వంద రూపాయల నోట్లను పెద్ద సంఖ్యలో పోగేసి, వాటితో దేశవ్యాప్తంగా బీభత్సమైన బిజినెస్ చేసేశారు. 1000 రూపాయల నోటుకి 600 నుంచి 800 రూపాయలు, 500 రూపాయల నోటుకి 300 నుంచి 400 రూపాయలు చిల్లర వసూలు చేస్తూ, పండగ చేసుకున్నారు. ఈ దొంగ వ్యాపారాల మాటేమిటి.?
అతి త్వరలో ఐటీ దాడులు జరగబోతున్నాయి.. అందరూ బుక్కయిపోతారు.. అప్పుడు పాత నోట్లు వున్నవారి సంగతి అంతే.. అని జనం విశ్వసిస్తున్నారు. కానీ, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఎప్పుడూ వుండనే వుంటాయి. డిసెంబర్ 31 వరకూ నోట్లు మార్చుకునే వెసులుబాటు వుంది. ఇకనేం, తెరవెనుక వ్యవహారాలు ఆలోగా చక్కబడిపోవచ్చుగాక.!
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, లైన్‌లో నిలబడి నిన్న ఢిల్లీలో హంగామా చేశారు.. అది రాజకీయమే అనుకుందాం. మరి, సామాన్యుడి ముఖ్యమంత్రి.. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఈ కరెన్సీ కల్లోలం వెనుక పెద్ద పొలిటికల్ మాఫియా వుందనే ఆరోపణల్ని కూడా అలాగే లైట్ తీసుకుందామా.? దేశంలో ఒక్కడంటే ఒక్కడు.. ఒక్క పొలిటికల్ లీడర్ కూడా ఈ కరెన్సీ కలకలంతో కంగారు పడలేదు. ఇదొక్కటి చాలు, కరెన్సీ మాఫియా వెనుక పొలిటికల్ కుట్ర వుందని చెప్పడానికి.
దేశంలో కరెన్సీ మార్పు పేరుతో ప్రధాని నరేంద్రమోడీ పెద్ద సంక్షోభానికే తెరలేపారు. ఈ సంక్షోభం మంచికే అయితే చరిత్రలో ఆయన పేరు నిలిచిపోతుంది.. కానీ, కోట్లాది మంది ప్రజల్ని రోడ్డుకీడ్చి పొలిటికల్ రాక్షస క్రీడకు తెరలేపారన్న వాదనలే నిజమైతే.. చరిత్ర హీనుడైపోవడం ఖాయం. ఎనీ డౌట్స్.?