బొబ్బిలి రాజుకు ప్రత్యర్ధి దొరికారు...!

వైసీపీ అధినేత జగన్‌ వెన్నంటి ఉంటూ పార్టీయే సర్వస్వమని నొక్కి వక్కాణించిన విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు ఉన్నఫళంగా జంపింగ్‌ జపాంగ్‌ అయిపోయి సైకిలెక్కేసిన సంగతి విధితమే. నాటి నుంచి ఆయనకు సరిజోడు ఎవరా అని వేయి కళ్లతో వెతికిన వైసీపీకి ఇపుడు సరైన ప్రత్యర్ధి దొరికాడని ఆ పార్టీ నేతలు సంబరపడుతున్నారు.

కాంగ్రెస్‌ పార్టీలో సుదీర్ఘకాలం సేవలు అందించి మంత్రిగా కూడా పనిచేసిన వాసిరెడ్డి కుటుంబ వారసుడు వరద రామారావు త్వరలోనే వైసీపీ తీర్ధం పుచ్చుకుంటారని విజయనగరం జిల్లా పార్టీ వర్గాల టాక్‌. గత సార్వత్రిక ఎన్నికల ముందే టీడీపీలో చేరిన వరద రామారావు మాజీ ఎమ్మెల్సీగా ఉన్నారు.  ఎన్నికల ముందే పార్టీలో చేరడంతో ఆయనకు టిక్కెట్‌ను టీడీపీ అధినాయకత్వం ఇవ్వలేకపోయింది. ఇక, మరోమారు ఎమ్మెల్సీగా కూడా అవకాశం లభించకపోవడంతో పాటు, తాజాగా బొబ్బిలి రాజులు టీడీపీ గూటికి చేరడంతో వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యే టిక్కెట్‌ కూడా రాదని తేల్చేసుకున్న వరద రామారావు చూపు వైసీపీపై పడిందని అంటున్నారు. 

విశాఖ విమానాశ్రయంలో వైసీపీ అధినేత జగన్‌ను పోలీసులు నిర్భందించిన ఘటనను ఆసరాగా చేసుకుని టీడీపీ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలు అనుసరిస్తోందంటూ ఘాటైన లేఖను వరద రామారావు సంధించారు. ప్రతిపక్ష నేతకు విలువ ఇవ్వని పార్టీలో ఉండడం దండుగంటూ పార్టీకి కూడా రాజీనామా చేసేశారు. త్వరలోనే ఆయన  జగన్‌ను కలసి వైసీపీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో బలమైన వెలమ సామాజికవర్గానికి చెందిన వాసిరెడ్డి కుటుంబానికి జిల్లాలో మంచి పట్టు ఉంది. దానికి వైసీపీ ఇమేజ్‌ కూడా తోడు అయితే బొబ్బిలి రాజులను వారి కోటలోనే ఓడించి ఎమ్మెల్యేగా రామారావు జెండా ఎగురవేయడం కష్టమేమీ కాదని రాజకీయ పండితులు చెబుతున్నారు. 

Show comments