ఓంపురి అవసరం.. మళ్లీ తెలుగు సినిమాకు రాలేదు!

మహానటుడు, ధిగ్గజ నటుడు అంటూ పడికట్టు పదాలను ఉపయోగించేసి ఆయన పేరు ముందు వాడేసుకుంటే సరిపోదు. వాటన్నింటికీ మించి ఏదైనా కావాలి, ఓంపురి గురించి ఇంట్రో అంటే రాయడం కూడా అంత సులభం కూడా కాదాయె. హాలీవుడ్ సినిమాల్లో నటించాడు.. అనేది, ఓంపురి కు ఉన్న గొప్ప అర్హతగా మీడియా చెబుతోంది. ఆయన గొప్పదనాన్ని అందరికీ అర్థం అయ్యేలా చేయడానికి అదో సులభమైన పద్ధతి! 

తరచి చూస్తే.. దేశీయ సినిమాలో ఆయన పండించిన పాత్రలనేకం ఉన్నాయి. ఓంపురి నటనా పటిమతో పండిన అద్భుత సన్నివేశాలెన్నో ఉన్నాయి. తెలుగు సినీ ప్రేక్షకులకు ఓంపురి గుర్తుండి పోవడానికి వాటన్నింటి ప్రస్తావనలు కూడా అక్కర్లేదు! రెండే సీన్లు చాలు. ఆ రెండు సీన్లూ ‘అంకురం’ సినిమాలోవి. ఆ సినిమాలో ఓంపురి నటించారని తెలుగు మీడియా గట్టిగా చెబుతోంది. కానీ అందులో ఓంపురి ది గెస్టప్పీరియన్స్ లాంటి పాత్ర. ఆయన కనిపించేది రెండంటే రెండే సీన్లు. ఆ రెండు సీన్ల వ్యవధి కూడా సెకనుల్లో కొలవదగినది! మరి ఆ సీన్ల గొప్పదనం ఏమిటో ఆ సినిమాను చూసిన వారికి విశదీకరించనక్కర్లేదు. చూడని వారికి చెప్పదగిన మాటేమిటంటే.. అంకురాన్ని చూడటానికి యూట్యూబ్ ను ఆశ్రయించమని! 

 ఓంపురి ఆ సినిమాలో నటించడాని గర్వంగా చెప్పుకోవచ్చు తెలుగు చిత్ర పరిశ్రమ. సత్తా ఉన్న ఆ సినిమాకు ఓంపురి ప్రత్యేక ఆకర్షణ. సినిమా అంతా ‘సత్యం’ పేరుతో ఓంపురి పోషించిన పాత్ర చుట్టూనే తిరుగుతుంది. కానీ ఆ పాత్ర తెరపై కనిపించి అతి తక్కువ సమయం. పోలిస్ జులుం మీద వచ్చిన అతి తక్కువ సినిమాల్లో ఒకటైన ‘అంకురం’ లో పోలీసుల దాష్టీకానికి బలయ్యే ఒక గిరిజనుడి పాత్రలో ఓంపురి జీవించారు. 

చిన్న చిన్న పాత్రలకు కూడా పేరున్న నటులను తీసుకోవడం ‘అంకురం’  సినిమాకు అదనపు ఆకర్షణ. రేవతి ఆ సినిమాకు హీరో.. ఓంపురి తెరపై కనిపించని హీరో! ఆ పాత్రకు నాటకీయత అవసరం లేదు. అన్యాయానికి గురైన ఒక గిరిజనుడి పాత్ర... అలాగని రొమ్ములు బాదుకుంటూ విషాదాన్ని ఒలికించేయనక్కర్లేదు. నిస్తేజంతో కూడిన ఫేస్ చాలు! ఓంపురి ఆ నిస్తేజాన్నే సమర్థవంతంగా ప్రదర్శించారు. 

బహుశా.. తెలుగు సినిమాకు ఓంపురి అవసరం ఆ తర్వాత ఎప్పుడూ పెద్దగా పడ్డట్టుగా లేదు! అల్లాటప్పా పాత్రలకు ఆయన ఓకే చెప్పరు. రెగ్యులర్ స్ట్రీమ్ లో సమాంతర సినిమా స్థాయి పాత్రలను సృష్టించే జోలికి మనోళ్లు వెళ్లరు! గమనించాల్సిన అంశం ఏమిటంటే.. ‘అంకురం’ స్థాయి సినిమా కూడా టాలీవుడ్ లో మళ్లీ రాలేదు! ‘ఓంపురి’ మళ్లీ స్ట్రైట్  తెలుగు సినిమాలో నటించలేదు! 

వర్మ ‘రాత్’ సినిమాలో ఓంపురి నటించారు. దాని డబ్బింగ్ స్ట్రైట్ సినిమా అనిపిస్తుంది. ఇక సాయికుమార్ ‘ఏకే-47’ లో కనిపించినా, అదొక కన్నడ రీమేక్ సినిమా. కన్నడ వెర్షన్ లో చేసిన పాత్రనే చేశారాయన. 

Show comments