బాబు - జగన్‌ - బాణాపురం బాగోతం.!

కథ కొత్త మలుపు తిరిగింది. ఎవరూ ఊహించని మలుపు ఇది. హైద్రాబాద్‌కి చెందిన ఓ వ్యక్తి దాదాపు 10వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని స్వచ్ఛంద ఆదాయ వెల్లడిలో భాగంగా వెల్లడించడంతో యావత్‌ భారతదేశం షాక్‌కి గురయ్యింది. దేశం మొత్తమ్మీద 62 వేల కోట్ల రూపాయల ఆస్తులే ఇలా స్వచ్ఛందంగా వెల్లడి కాగా, అందులో ఓ హైదరాబాదీ 10 వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని వెల్లడించడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అహ్మదాబాద్‌కి చెందిన మహేష్‌ షా సైతం ఇదే తీరున 13 వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని వెల్లడించాడు. తీరా, ఆ ఆస్తుల సంగతేంటని ఆదాయపు పన్ను శాఖ ప్రశ్నిస్తే, హంబక్‌.. అని తేల్చేశాడు. తాను కొందరి మాట విని మోసపోయానంటూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు మహేష్‌ షా. 

మరి, హైద్రాబాదీ పరిస్థితి కూడా అంతేనా.? అన్నది ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. ఆ హైద్రాబాదీ ఎవరో కాదు, బాణాపురం లక్ష్మణరావు. ఈయనెవరో ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు. కానీ, గత కొద్ది రోజుల క్రితం, వైఎస్‌ జగన్‌ బినామీ.. అంటూ టీడీపీ దుమ్మెత్తిపోసింది. వైఎస్సార్సీపీ ఊరుకుంటుందా.? బహుశా చంద్రబాబు బినామీ అయి వుంటాడని ఈయనగారిపై ఎదురుదాడికి దిగింది. 

కేంద్రం, తన వద్దనున్న ఆధారాల్ని బయటపెట్టనప్పుడు, సదరు 10 వేల కోట్ల రూపాయల 'ఘనుడు' ఎవరన్నది ఎలా లీకయ్యింది.? ఆయన హైద్రాబాదీనే అన్న విషయం ముందుగా టీడీపీకి ఎలా తెలిసింది.? వంటి ప్రశ్నలు చాలానే వున్నాయనుకోండి.. అది వేరే విషయం. టీడీపీ ఆరోపించింది గనుక, వైఎస్సార్సీపీ ఎదురుదాడికి దిగింది. ఇప్పుడేమో మేటర్‌ క్లియర్‌.. బాణాపురం లక్ష్మణరావు పేరు బయటకొచ్చింది. అతని కంపెనీలు వెలుగు చూశాయి. అయితే 10 వేల కోట్ల రూపాయల వెల్లడి భోగస్‌ అట. ఇదెక్కడి ట్విస్టు.! 

అంటే, స్వచ్ఛంద ఆదాయ వెల్లడి దగ్గర్నుంచి ఇప్పటిదాకా.. ఈ మధ్యకాలంలోనే మొత్తం వ్యవహారాన్ని ఎవరో చక్కబెట్టేశారన్నమాట. అలా చక్కబెట్టే అవకాశం కేవలం అధికారంలో వున్నవారికే వుంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! 

నిజానికి బినామీల పేరుతో ఆస్తుల్ని కూడబెట్టడం రాజకీయ నాయకులకి కొత్త కాదు. మహేష్‌ షా అయినా, బాణాపురం లక్ష్మణరావు అయినా అలాంటి బినామీలేనని అనుకోవాల్సి వుంటుంది. బినామీల బాగోతం బయటపడితే, తమ బాగోతం బయటపడ్డట్టే.. నల్లధనం వెలికితీత క్రమంలో పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ తెరపైకి వచ్చిన విషయం విదితమే. పెద్దయెత్తున పెద్ద నోట్లు 'భంచిక్‌' అయిపోయాయి. అలా కొన్ని నోట్లు, ఈ బాణాపురం లక్ష్మణరావు దగ్గరకి చేర్చి, బ్లాక్‌ని వైట్‌గా మార్చేసి, అంతా హంబక్‌ అని తాపీగా తేల్చేశారనే విషయం స్పష్టమవుతోంది. 

అంతా బాగానే వుందిగానీ, ఈ బాణాపురం లక్ష్మణరావుకి ఎవరితో సంబంధం వున్నట్టు.? టీడీపీ అధినేత చంద్రబాబుతోనా.? వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌తోనా.? జగన్‌తో అయితే, ఈ పాటికి ఆ ఆధారాల్ని టీడీపీ బయటపెట్టేసే వుండేది. కామ్‌గా వుందంటే, కాస్త ఆలోచించాల్సిన విషయమే ఇది.

Show comments