'ఈనాడు' పత్రిక అంటే అంతే మరి..!

తెలుగు లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డెయిలీ.. గురించి కొత్త గా చెప్పుకోవడానికేం లేదు. అణువణువునా తెలుగుదేశం అనుకూలత, చంద్రబాబుపై భక్తి ప్రవత్తులు కనబరుస్తుందనే విమర్శలను ఎదుర్కొనే ఈ పత్రిక తీరు గురించి  గతంలో కాంగ్రెస్ తరపు ముఖ్యమంత్రులే ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరేమన్నా.. ఏమనుకున్నా.. తగ్గదంతే! ఈ తీరులోనే మరో రోజు కు సంబంధించి.. నవ్వుల పాలవుతున్న వ్యవహారం ఇది.

పై కార్టూన్ ఈనాడు ఆదివారం అనుబంధంలో నిన్న ప్రచురితమైనది. ఈ పొలిటికల్ కార్టూన్ ఉద్దేశం నవ్వించడం అయితే.. సదరు ప్రయత్నం నవ్వుల పాలు కూడా అవుతుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లు తమ రాజకీయ ప్రత్యర్థులకు క్షవరం చేస్తున్నట్టుగా చిత్రీకరించిన దీని ఉద్దేశం.. ఈ ముఖ్యమంత్రులిద్దరూ ఆ పార్టీలను ఖాళీ చేయిస్తున్నారు అని చెప్పడమే కావొచ్చు.

బాగుంది. నవ్వుకోవచ్చు. కానీ దాని కన్నా ముందు వచ్చే సందేహం ఏమిటంటే.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ని ఈ కార్టూన్లు వేసే ఆయన మరిచిపోయాడా? చంద్రబాబు జగన్ కు క్షవరం చేస్తున్నాడు, కేసీఆర్ కాంగ్రెస్ కు క్షవరం చేస్తున్నాడు.. మరి కేసీఆర్ ఇప్పటికే గుండు కొట్టేసిన తెలుగుదేశం కథను ప్రస్తావించలేదే! వాస్తవంగా అయితే కేసీఆర్ చేతిలో తెలుగుదేశానికి కూడా క్షవరం అయినట్టుగా బొమ్మ గీయాల్సింది కదా? 

బహుశా.. తెలంగాణలో తెలుగుదేశం చాప్టర్ ఇప్పటికే ముగిసిపోయిందనే గూఢార్థం ఇందులో ఉందా? మరి ఈనాడు వంటి పెద్ద పత్రికే తెలంగాణలో తెలుగుదేశం ఉనికిని గుర్తించకపోతే ఎలా? జగన్, కాంగ్రెస్ పార్టీలు కనీసం క్షవరం కొట్టించుకొంటూ అయినా మిగిలారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీనే మరీ ఈనాడు గుర్తించనంత స్థాయికి పడిపోయినట్టుంది.  

ఇక్కడ మరో హేయమైన చర్య ఏమిటంటే.. ఫిరాయింపు రాజకీయాలను ఇలా అందంగా సమర్థించుకురావడం! పార్టీలు మారిన ఎమ్మెల్యేలను ప్రశ్నించాల్సిన మీడియానే అధికార పార్టీల దాష్టికాలను ఇలా సమర్థించుకొంటూ వస్తే అమ్ముడుబోయే వాళ్లకు అడ్డేముంది? ఉషోదయానే పాచి నోటితో విలువలు, సత్యం నినదించుగాక అంటూ.. నినదించ డానికి ఇంకేం అర్హత ఉందో అర్థం కాని పరిస్థితి.

photo credit: eenadu

Show comments