అభిమానులే వ్యవస్థ...'కాకినాడ'తో ఎవరికవస్థ?

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాట్‌ టాపిక్‌  పవన్‌ కళ్యాణ్‌ కాకినాడ సభ. తెలంగాణలో ఈ సభపై నాయకుల్లో, అభిమానుల్లో ఆసక్తి కనబడుతుండగా, ఆంధ్రాలో పరిస్థితి ఉత్కంఠభరితంగా ఉంది. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రాకు 'ప్రత్యేకం' కావడం, తిరుపతి సభ నిర్వహించిన తరువాత ఎక్కువ గ్యాప్‌ లేకుండా కాకినాడ సభ నిర్వహిస్తుండటం ఈ ఉత్కంఠకు ప్రధాన కారణాలు. తిరుపతి సభలో తన రాజకీయ రూపమేమిటో పవన్‌ ఆవిష్కరించుకున్నాడు. తన లక్ష్యాలేమిటో వివరించాడు. వచ్చే ఎన్నికల్లో  టీడీపీతో పొత్తు ఉండదని, కాబట్టి పవన్‌ను ముందు పెట్టుకొని 'జనసేన'తో జత కట్టి ఎన్నికల్లో పోటీ చేయాలని కమలనాథులు ప్లాన్‌ చేసుకుంటున్నట్లు వార్తలొచ్చాయి. 

ఆ ప్లాన్‌కు తిరుపతి సభలో గండి కొట్టాడు పవన్‌. ఈయన టీడీపీ మనిషని ప్రచారం జరుగుతోంది. అవునా? కాదా? అనే విషయాన్ని పవర్‌స్టార్‌ పూర్తిగా క్లారిపై చేయలేదు. తిరుపతి ప్రసంగంలో దీనిపై పూర్తిగా స్పష్టత రాలేదు. కాకినాడ సభలో అది కూడా క్లియర్‌ చేయొచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పవన్‌ కొత్త సినిమాపై భారీ అంచనాలున్నట్లుగా కాకినాడ సభపై కూడా సాధారణ ప్రజల దగ్గర్నుంచి రాజకీయ నాయకుల వరకు భారీ అంచనాలున్నాయి. ఆ సభలో తన మార్గమేమిటో స్పష్టంగా చెప్పేస్తే పవన్‌ రాజకీయమేమిటో తెలిసిపోతుంది. తద్వారా ఎవరి రాజకీయ వ్యూహాలు వారు రూపొందించుకునే అవకాశముంటుంది. 

ఇక జనసేనను ఒక రాజకీయ పార్టీగా అందరూ పరిగణిస్తున్నప్పటికీ ఇప్పటివరకు దానికో రూపం లేదు. వ్యవస్థ లేదు. కార్యవర్గం వగైరా లేవు. ఉన్నది పవన్‌ ఒక్కడే.  ప్రస్తుతం అభిమానులే పార్టీ వ్యవస్థ. తిరుపతి సభను హడావిడిగా ఏర్పాటు చేసినప్పటికీ అది విజయవంతమైంది. ఎంతమంది జనం వచ్చారన్నది ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆ కోణంలో ఎవ్వరూ చూడలేదు. పవన్‌ ఏం మాట్లాడాడు? ఏం సందేశం ఇచ్చాడు? ఏం అభిప్రాయం వ్యక్తం చేశాడు? అనేదే చూశారు. తిరుపతి సభ కంటే కాకినాడ సభను మరింత విజయవంతం చేయాలని అభిమానులు పట్టుదలగా పనిచేస్తున్నట్లు  వార్తలొస్తున్నాయి. 

పవన్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి తిరుపతి సభ శాంపిల్‌ మాత్రమే. అసలు అరంగేట్రం కాకినాడ సభేనని భావిస్తున్నారు. కాబట్టి దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అభిమానులు, శ్రేయోభిలాషులు పట్టుదలగా ఉన్నారు. ఈ సభ తరువాత ఏపీలో జనసేన ప్రధాన పార్టీగా పరిగణన పొందే అవకాశముందని భావిస్తున్నారు. పార్టీకి వ్యవస్థను ఏర్పాటు చేయకుండా ఇంత పెద్ద సభను పవన్‌ నిర్వహించాలనుకోవడం విశేషమే. కేవలం అభిమానులను నమ్ముకొనే ఆయన ఈ పని చేస్తున్నాడు. ఇక పవన్‌ ఇచ్చిన 'సీమాంధ్రుల ఆత్మగౌరవ నినాదం' రాష్ట్ర ప్రజలపై ఎంతవరకు ప్రభావం చూపిస్తుందో చూడాలి. ఇప్పటివరకు అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక హోదా 'ఆంధ్రుల హక్కు' అన్నాయేగాని ఆత్మగౌరవానికి సంబంధించిన విషయంగా ప్రచారం చేసిన దాఖలాలు లేవు. 

'ఆంధ్రుల ఆత్మగౌరవం' నినాదంతోనే అలనాడు నందమూరి తారకరామారావు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించారు. అందుకు తగ్గట్లే ఆనాటి రాజకీయ, సామాజిక పరిస్థితులున్నాయి. కాంగ్రెసు అధిష్టానవర్గం తెలుగు రాష్ట్రంలో ముఖ్యమంత్రులను తరచుగా మారుస్తుండటం, అవమానించడం, కేంద్ర సర్కారులో ప్రాధాన్యం ఇవ్వకపోవడం, తెలుగువారికి దేశంలో గుర్తింపు లేకపోవడం (మదరాసీలు అనేవారు)  తదితర అంశాలను గమనించిన ఎన్టీఆర్‌  తెలుగువారి ఆత్మగౌరవం కాపాడటానికి, నిలబెట్టడానికి తాను రాజకీయాల్లోకి వచ్చానని, అందుకోసం పోరాటం చేస్తానని ప్రకటించడమే కాకుండా సుడిగాలిలా రాష్ట్రంలో పర్యటించి ప్రజల్లో చైతన్యం నింపారు. ఆ తరువాత ఏం జరిగిందో తెలిసిందే. 

తెలంగాణ ఉద్యమంలో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆత్మగౌరవం నినాదమిచ్చారు. ఇది బాగా ప్రభావం చూపించింది. ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ అదే నినాదంతో కాకినాడ సభ నిర్వహించబోతున్నారు. మొత్తం మీద 2019 ఎన్నికల్లో మరో రాజకీయ శక్తి ఏపీలో కనిపించబోతోంది. తెలంగాణలో జనసేన ఎలాంటి పాత్ర నిర్వహిస్తుందో ఇప్పటివరకు తేలలేదు. కేసీఆర్‌ సర్కారు మీద పవన్‌ తన అభిప్రాయం చెప్పలేదు. 

ఉమ్మడి రాష్ట్రంలో మెగాస్టార్‌ చిరంజీవి 'ప్రజారాజ్యం' కారణంగా టీడీపీకి నష్టం జరిగింది. ఇప్పుడు జనసేన కారణంగా ఏపీలో ఏ పార్టీకి నష్టం జరుగుతుంది? అనేది చర్చనీయాంశంగా మారింది. టీడీపీ అనుకూల మీడియా వైసీపీ నష్టపోతుందని అంచనా వేస్తోంది. అయితే పవన్‌ ఏ విధంగా పోటీ చేస్తాడనేదాన్ని బట్టి అంటే ఒంటరిగానా? పొత్తుతోనా? అనేది తేలితే పార్టీల లాభనష్టాలపై అంచనాకు రావొచ్చు. అందుకు ఇంకా సమయముంది. 

Show comments