పోలీసులకు ఉండే శిక్షణ వేరు. అనుభవం వేరు. అవసరం తలెత్తినప్పుడు దానికి తగ్గట్లుగా వారు వ్యవహరించే తీరు వేరు. అయితే పోలీసులకు ప్రత్యామ్నాయంగా ప్రెవేటు వ్యక్తుల సమూహం సేవలు అందించగలుగుతుందా? పనిచేయగలుగుతుందా? అదే ఇప్పుడు తిరుపతిలో పవన్ బహిరంగ సభ సందర్భంగా కొందరిలో రేగుతున్న అనుమానాలు!
తిరుపతిలో జనసేన పార్టీ సారథిగా పవన్ కల్యాణ్ మొట్టమొదటి బహిరంగ సభ శనివారం నిర్వహించడానికి జరుగుతున్న సంగతి తెలిసిందే. తిరుమలలోని గెస్ట్‌హౌస్‌లోనే ఈ రోజంతా ఉన్న పవన్ కల్యాణ్.. ఏకాంతంగా.. సభకు ప్రిపేర్ అవుతున్నారు. అయితే శుక్రవారం వరకూ కూడా పవన్ కల్యాణ్ సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. భద్రత ఏర్పాట్ల నిమిత్తం పోలీసు బలగాలు తగినంతగా లేవంటూ.. తిరుపతి ఎస్పీ జయలక్ష్మి అనుమతి నిరాకరించారు.
అయితే బహిరంగసభలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. ప్రశాంతంగా నిర్వహించుకోవడానికి తమ పార్టీ కార్యకర్తలతో ఏర్పాట్లు చేసుకుంటాం అని పవన్ కల్యాణ్ ఆమెకు వ్యక్తిగతంగా హామీ ఇచ్చారుట.
ఏదో బౌన్సర్లలాగా వేదిక చుట్టూతా వలయంలా కార్యకర్తలనే పవన్ ఫోర్స్ వారు నిల్చుని.. ఎవరూ వేదిక వద్దకు రాకుండా చూడడం లాంటివి సాధ్యం కావచ్చు. కానీ జనం పెద్ద సంఖ్యలో సభకు తరలివస్తే.. వారిని ఒక క్రమప్రకారంగా నియంత్రించడం అనేది ఇలాంటి ప్రెవేటు వ్యక్తులకు సాధ్యమవుతుందా? పోలీసు డ్రస్ కాకుండా, ఎవరో వాలంటీర్లు లాంటి వాళ్లు చెబితే జనం ఆ మూడ్‌లో వినిపించుకుంటారా? అనేది ఒక భయం.
మరో భయం ఏంటంటే.. ఏదైనా ప్రమాదం, తొక్కిసలాట, అవాంఛనీయ సంఘటన జరిగే వరకు మనకు పోలీసుల అవసరం తెలియదు. అలాంటివి జరిగినప్పుడు.. దాని పర్యవసానాల్ని ప్రెవేటు వ్యక్తులు అదుపు చేయడం అనేది అసాధ్యం. అందుకే.. చాలినంత పోలీసు బలగాలు లేవని లోకల్ ఎస్పీ అన్నప్పుడు చిత్తూరు ఎస్పీని అడిగి అయినా.. పవన్ అదనపు పోలీసుల్ని రప్పించడం వారికి మేలు చేస్తుంది గానీ.. నా కార్యకర్తలు సమస్తం చూసుకుంటారని హామీ ఇస్తే.. బాద్యత పెరిగిపోతుందని పలువురు భావిస్తున్నారు.