అదే ముద్దు.. ఇంకా హాట్ రొమాన్స్ అట!

వెనుకటికి మణిరత్నం శిష్యుడొకరు ‘సఖి’ సినిమాను ‘సాథియా’ అంటూ హిందీలో రీమేక్ చేశాడు. ఒరిజినల్ లో ఉన్న ఫీల్ ను కలిగించలేకపోయాడో ఏమో కానీ… ఆ సినిమా అక్కడ అట్టర్ ప్లాఫ్ అయ్యింది. ఇప్పుడు మరోసారి మణిరత్నం దక్షిణాదిన హిట్ కొట్టిన సినిమాను హిందీలో రీమేక్ చేసి, విడుదలకు సిద్ధం చేశారు. ‘ఓకే బంగారం’ సినిమాను “ఓకే జానూ’’ పేరుతో హిందీలో రూపొందించి విడుదల చేస్తున్నారు.

సంక్రాంతి సమయంలో ఈ సినిమా విడుదల చేయనున్నారు. ‘ఆషికీ-2’ జంట ఆదిత్య రాయ్ కపూర్ – శ్రద్ధా కపూర్ లు ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదల  అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కమ్ పోస్టర్ లో మణిరత్నం మార్కు రొమాన్సే కనిపిస్తుంది. 

‘ఓకే బంగారం’ సినిమా ప్రచారానికి కూడా ఇలాంటి ముద్దుతో కూడిన పోస్టర్ నే వినియోగించాడు మణిరత్నం. ఇప్పుడు రీమేక్ వెర్షన్ లో కూడా అలాంటి ముద్దే పెట్టించి.. ప్రచారం మొదలుపెట్టారు.  హిందీ వాళ్లు చెబుతున్న మరో విషయం ఏమిటంటే.. సినిమాలో శ్రద్ధ- ఆదిత్య ల మధ్య ఘాటైన రొమాన్స్ ఉంటుందనేది!

తమిళ, తెలుగు వెర్షన్లలో దుల్కర్- నిత్యాల మధ్య మణిరత్నం పండించిన రొమాన్స్ ఆకట్టుకుంది. మణిరత్నం సినిమాల్లో తప్పనిసరిగా ఉండే ఫస్ట్ నైట్ సన్నివేశం కూడా చాలా అందంగా చిత్రీకరించబడింది. మరి హిందీ వాళ్లకు ఆ మాత్రం దొరికితే అల్లుకుపోతారు. ఈ రీమేక్ విషయంలో అదే పని చేసినట్టుగా ఉన్నారు. ఈ సినిమాను ప్రేమ కావ్యంగా చెప్పకుండా.. శృంగార కావ్యం.. అంటూ ప్రచారాన్ని చేసుకుంటున్నారు!

Show comments