బాలయ్య వాడకం ఓ రేంజ్‌లో.!

సినిమాల్ని రాజకీయాలకు వాడుకోవడమెలాగో బహుశా నందమూరి బాలకృష్ణకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదేమో.! గత కొన్నాళ్ళుగా బాలకృష్ణ నుంచి ఏ సినిమా వచ్చినా, అందులో ఖచ్చితంగా పొలిటికల్‌ సెటైర్స్‌ వుంటున్నాయి. వంశం పేరుతో బాలకృష్ణ డైలాగులు చెప్పడం ఇప్పుడు కొత్తేమీ కాదు. అయితే, రాజకీయాలపై సంధిస్తున్న డైలాగ్‌లు, అందులో తెలుగుదేశం పార్టీ, స్వర్గీయ ఎన్టీఆర్‌ గుర్తుకొచ్చేలా పనిగట్టుకుని డైలాగులు రాయించుకుంటున్నారాయన. 

ఇక, తాజాగా 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా విషయానికొస్తే, సినిమా ట్రైలర్‌ విడుదల సందర్భంగా బోల్డంత రాజకీయం నడిచింది. టీడీపీ నేతలు ఈ ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో సందడి చేశారు. తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడు రమణ, తెలంగాణ టీడీపీ నేత పెద్దిరెడ్డి, ఏపీ మంత్రి - టీడీపీ నేత దేవినేని ఉమ.. ఇలా పలువురు టీడీపీ నేతలు, 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా కన్నా బాలయ్యని ఎక్కువగా పొగిడేశారు. మరోపక్క, బాలకృష్ణ తన తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు రాజకీయాల్లో సత్తా చాటిన వైనాన్ని చెప్పుకొచ్చారు. 

మొత్తంగా చూస్తే, సినిమా సందడి కన్నా టీడీపీ పొలిటికల్‌ సందడి ఎక్కువైపోయిందనే కామెంట్స్‌ సర్వత్రా విన్పిస్తున్నాయి. 'అయినా, తన సినీ గ్లామర్‌ని రాజకీయాల్లో వాడుకుంటే తప్పేంటి.? టీడీపీ తరఫున ప్రచారం చేసుకుంటే తప్పేంటి.?' అంటూ బాలయ్య అభిమానులు, టీడీపీ మద్దతుదారులు వెనకేసుకొస్తున్నారు. సినిమా వేరు, రాజకీయం వేరు కాదు. సినిమా - రాజకీయం రెండూ ఒకటేనేమో బాలకృష్ణ విషయంలో.

Show comments