'భూ'..మంతర్ ఖాళీ

వైఎస్ పాలన మిగిల్చింది ఏమిటయ్యా అంటే తెలుగుదేశం జనాల నోట లక్ష కోట్లు అనేమాట. తెలుగుదేశం పాలన అదే విధంగా మిగిల్చే మాట ఒకటి సుదూరంలో కనిపిస్తోంది. అదే లక్ష ఎకరాలు.

తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వార్తలు, రాజకీయాలు, ఆరోపణలు ప్రత్యారోపణలు, రాజధాని, ఎయిర్ పోర్టులు, ప్రాజెక్టులు ఇలా ఒకటేమిటి అన్నీ భూముల చుట్టూనే తిరుగుతున్నాయి. ఆఖరికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతి జిల్లా కేంద్రంలో రెండు ఎకరాలు కట్టబెట్టే ప్రయత్నం ప్రారంభించే వరకు. 

వస్తూనే రాజధాని భూ సేకరణ అన్నది ఫ్రారంభించారు. ముఫై మూడు వేల ఎకరాలు సమీకరణ పేరిట పైసా ఇవ్వకుండా తీసుకున్నారు. ఇప్పుడేమంటున్నారు. కోర్ కాపిటల్ 1600 ఎకరాల్లో అన్నీ పనులు, నిర్మాణాలు పూర్తయ్యాక, అభివృద్ధి జరిగాక మిగిలిన భూమి సంగతి చూస్తాం అంటున్నారు. అంటే మిగిలిన 31 వేల ఎకరాలు మరో మూడు నుంచి అయిదేళ్ల పాటు అలా బీడు పట్టి వుండడమే అన్నమాట. ఎందుకంటే ఖాళీగా వున్నా కూడా రైతులు పంటలు వేయకూడదని ముందే చెప్పేసారు. ఏడాదికి రెండు పంటలు పండే విలువైన భూమి అలా బీడు పట్టడమే అన్నమాట. 

సరే ఆ సంగతి అలా వుంచితే ఎయిర్ పోర్టులు, నౌకాశ్రయాలు ఇలా అన్నింటా భూముల రగడే. ఇవన్నీ ఫ్రభుత్వం తీసుకునే భూముల వ్యవహారం అయితే, రాజధాని విషయం ముందుగా అస్మదీయులకు లీక్ కావడంతో, వాళ్లు ఆ చుట్టూ భూములు కొనుగోలు చేసేయడం మరో ఎపిసోడ్. దాన్ని మించిన ఎపిసోడ్ ఏమిటంటే..ప్రభుత్వం తన భూములను తాను కాపాడుకోవడానికి బదులు, రూపాయిది పైసాకు అమ్మేసే ప్రయత్నం చేయడం. సదావర్తి భూముల విషయంలో ప్రభుత్వం చేసిన వ్యవహారం ఇలాంటిదే. 

చంద్రబాబు కానీ, ఆయన పార్టతీ నాయకులు కానీ, వారికి వేరే రాష్ట్రాల్లో ఇలా కోట్ల విలువైన భూములు వుంటే, అవి ఆక్రమణకు గురవుతుంటే, కాపాడుకునే మార్గాలు చూసుకుంటారో? లేదా ఇలా పైసాకు కాణీకి అమ్మేసుకుంటారా? పైగా వ్యక్తులు ఆస్తులు కాపాడుకోలేకపోవడం వేరు, ప్రభుత్వం ఆస్తులు కాపాడుకోలేకపోవడం వేరు. చంద్రబాబు ఒక్క సిటింగ్ తమిళనాడు కౌంటర్ పార్ట్ తో వేస్తే, అక్కడ భూముల వ్యవహారం సెటిల్ కావడానికే ఎక్కువ అవకాశాలు వుంటాయి కదా?

కానీ ఈ భూముల విషయంలో ఇన్నాళ్లు బుకాయిస్తూ వచ్చింది ప్రభుత్వం. ఆఖరికి కోర్టులో కూడా అయిదు కోట్లు ఎక్కువ ఇస్తే ఎక్కువ ఇచ్చేస్తాం అని చెప్పింది. సరే అని అడిగిన వాళ్లకు తాము భూములు కావాలంటే ఇస్తాం కానీ, రిజిస్ట్రేషన్ ఛేయం అంటోందట. ఇదెక్కడి చిత్రమో? అంటే ఎవరి భూములను ప్రభుత్వం అమ్మదల్చుకున్నట్లు? ఇక్కడే మరో విషయం కూడా వుంది. గతంలో భూములు కొన్నవారి తండ్రి అయిన కాపు కార్పొరేషన్ చైర్మన్ రామాంజనేయులు కూడా ఓ మాట అన్నారు. భూముల సంగతి పూర్తిగా తెలియక కొని తమ కొడుకు ఆయన స్నేహితులు మోసపోయారని. 

దేవాదాయ శాఖ ఇప్పుడు మళ్లీ వేలం అంటోంది. అంటే ఈ లెక్కన రామాంజనేయులు కొడుకు వారి స్నేహితులు ఈ భూములను వదిలించుకోవాలని అనుకుంటున్నారా? లేక నిజంగానే ప్రభుత్వం మరోసారి వేలం వేసి, ఎక్కువ ఆదాయం తెచ్చుకోవాలని అనుకుంటోందా? అలా అనుకుంటే, ఇంతకు ముందు చేసింది తప్పు అని అంగీకరించినట్లు అవుతుంది కదా? అలాంటి పని బాబు ఎందుకు చేస్తారు? చేయమన్నా చేయరు. అంటే ఇలా మళ్లీ వేలం వేయడం వెనుక ఇంకేదో వుండే వుండాలి. 

ఇదిలా వుంటే మొత్తం రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో భూములు ఈ ఒకటి రెండు రోజుల్లో పంచేసారు. ఆ సిటీ ఈ సిటీ అంటూ, అలాగే వివిధ సంస్థలకు భూములు పంచేసారు. వివిధ సంస్థలకు ఎకరాలకు ఎకరాలు ఇచ్చేసారు. ఆ మాటకు వస్తే ఇలా ఎక్కువ ఎకరాలు పంచింది మాంచి క్రేజ్ వున్న విశాఖ జిల్లాలోనే. అదే విశాఖలో కొన్ని ఎకరాలు ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్ మెంట్ కోసం అంటూ జస్ట్ ఓ రిక్రియేషన్ క్లబ్ కు ఇచ్చేసారు. రిక్రియేషన్ క్లబ్ కు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధం ఏమిటో ప్రభుత్వానికే తెలియాలి. 

ఇలా ప్రభుత్వం తాలూకు ప్రతి వ్యవహారం కూడా భూముల చుట్టూ తిరుగుతోంది. ఈ లెక్కన ప్రభుత్వం భూముల కోసం ఏర్పడిన భూస్వాముల ప్రభుత్వం అని జనం అనుకనే ప్రమాదం వుంది. 

లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పంచ్ ఏమిటంటే, బాబుకు కౌంటర్ పార్ట్ అయిన కేసిఆర్ కూడా భూములు ఇచ్చే విషయంలో కూడా ఉదారంగానే వుంటున్నారట. ఒకప్పుడు వ్యతిరేకించిన మీడియా మొఘల్ రామోజీకి ఓం సిటీ కోసం ఏకంగా మూడు వేల ఎకరాలు ఇచ్చేయడానికి ప్రయత్నాలు చకచకా జరిగిపోతున్నాయట. అవి కూడా అటవీ భూములు. మోడీ ప్రభుత్వం రాటిఫికేషన్ చేస్తే చాలు, భూములు చేతులు మారిపోతాయి. 

అంతా భూ..మంతర్ ఖాళీ.

Show comments