డ్రగ్స్ సాలెగూటిలో చిక్కుకున్న టాలీవుడ్ సెలబ్రిటీలకు శిక్షలు పడతాయా లేదా అనేది అప్పుడే తేల్చి చెప్పలేం. కేవలం డ్రగ్స్ వినియోగం మాత్రమే అయితే గనుక.. అంత పెద్ద శిక్షలు ఉండకపోవచ్చుననేది కొందరు నిపుణులు చెబుతున్న మాట. అయితే శిక్షద్వారా వాటిల్లగల నష్టం కంటె చాలా రెట్లు ఎక్కువగా.. ‘‘వీళ్లంతా డ్రగ్స్ కేసుల నిందితులు’’ అనే అంశానికి జరుగుతున్న ప్రచారం ద్వారా వీరికి కలుగుతోంది.
పూరీజగన్నాధ్ లాంటి అగ్రశ్రేణి దర్శకుడు తన కుటుంబ సభ్యులు మొత్తం నాలుగురోజులుగా ఏడుస్తూనే ఉన్నారని.. ట్విటర్ వంటి బహిరంగ వేదిక మీద తన ఆవేదన షేర్ చేసుకున్నాడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. శిక్షలకంటె దారుణంగా వారి ఇమేజికి దెబ్బపడింది.
సరిగ్గా ఈ పాయింట్ మీదనే సినీ సెలబ్రిటీలు ఓ కొత్త మైండ్ గేమ్ మొదలెట్టినట్లుగా వాతావరణం కనిపిస్తోంది. సాధారణ ప్రజల దృష్టిలో తమ ఇమేజి దెబ్బతినిపోకుండా.. తమ మీద ఉన్న డ్రగ్స్ ఆరోపణల చుట్టూ ఒక ఎమోషనల్ బిల్డప్ ను ఇవ్వడానికి, భావోద్వేగ వాతావరణాన్ని కలిగించడానికి వారు తాపత్రయపడుతున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే సినీ సెలబ్రిటీలుగా తమను ఆరాధించే ప్రజలు ఈ ఎపిసోడ్ అనంతరం అసహ్యించుకోకుండా ఉండడానికి, మధ్యలో తమ కుటుంబ సభ్యులను వారు పావులుగా వినియోగిస్తున్నారు.
హీరో రవితేజ చాలా అమాయకుడని డ్రగ్స్ అంటే తెలియదని ఆయన తల్లి మీడియా ముందుకు వచ్చినా... ఛార్మి చాలా అమాయకురాలు, ఆమెకు ఎలాంటి వ్యసనాలు లేవు, అనవసరంగా నిందలు వేస్తున్నారు అంటూ ఆమె తండ్రి మీడియా ముందుకు వచ్చినా.. ‘‘మా నాన్న చాలా మంచివాడు, డ్రగ్స్ తీసుకోడు’’ అంటూ పూరీజగన్నాధ్ కూతురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా.. అవన్నీ కూడా ఈసడించుకునే ప్రజల దృష్టిలో సింపతీ గెయిన్ చేయడానికి వీరు అనుసరిస్తున్న షార్ట్ కట్ పద్ధతుల్లాగా కనిపిస్తున్నాయి.
పూరీజగన్ విషయానికే వస్తే.. డ్రగ్స్ పెడ్లర్ తో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో.. ఆయన కూడా వాటిని వినయోగించే వ్యక్తుల, సరఫరా చేసే వ్యక్తుల జాబితాలో ఉంటాడో లేదో విచారించడానికి అధికారులు ఆయనకు నోటీసు ఇచ్చారు. సదరు విచారణకు వెళ్లేప్పుడు.. చిన్నవాడైన కొడుకును వెంటబెట్టుకుని వెళ్లాల్సిన అవసరం ఏమిటి? సెలబ్రిటీలు పోలీసు విచారణకు వెళ్లేప్పుడు తమ వెంట లాయర్లను తీసుకెళ్లడం సరైనదే. కేసుతో సంబంధం లేని కొడుకును తీసుకువెళ్లడం ఎందుకు? ఇదంతా ప్రజల దృష్టిలో అసహ్యం కలగకుండా ఒక ఎమోషన్ మైండ్ గేమ్ లాంటిదే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.