వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో అత్యంత దయనీయమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతలైనా సరే, ఉనికి కోసం పోరాడాల్సిన దుస్థితి ఏర్పడిందిప్పుడు. తెలంగాణ ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్‌లో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్, తెలంగాణలోనూ బావుకున్నదేమీ లేదు. దాంతో, 'మీకన్నా మేం కాస్త బెటర్' అని ఏపీ కాంగ్రెస్ నేతల్ని ఉద్దేశించి తెలంగాణ కాంగ్రెస్ నేతలు సర్దుకుపోవాల్సి వస్తోంది.
ఇక, అసలు విషయానికొస్తే.. గద్వాల్ జేజెమ్మగా రాజకీయాల్లో నిన్న మొన్నటిదాకా ఓ వెలుగు వెలిగిన 'లేడీ డైనమైట్' డికె అరుణ పరిస్థితి ఈ మధ్యకాలంలో మరీ దారుణంగా తయారైంది. ఆమెను కాంగ్రెస్‌లోనే ఎవరూ పట్టించుకున్న పాపాన పోవడంలేదు. ఆ మధ్య అసెంబ్లీలో ఓ విషయమై గందరగోళం చెలరేగితే, ప్రతిపక్ష నేత జానారెడ్డి తమ పార్టీకే చెందిన డీకే అరుణతో సారీ చెప్పించడానికి ప్రయత్నించారు. అప్పట్లో డీకే అరుణని టీఆర్‌ఎస్ చాలా దారుణంగా హేళన చేసింది కూడా.
అంతలా డీకే అరుణ ఇమేజ్‌ని దిగజార్చేసిన జానారెడ్డి సైతం బావుకున్నదేమీ లేదిక్కడ. ఇక, డీకే అరుణ ఎంచక్కా గద్వాల్ కోటలో రెస్ట్ తీసుకోవచ్చంటూ నిజామాబాద్ ఎంపీ కవిత సెటైర్లు వేసేశారు. నిజానికి రాజకీయాల్లో 'అనుభవం' అనేదొకటుంటుంది. ఆ అనుభవం కోణంలో చూస్తే, డీకే అరుణ చాలా సీనియర్. 'నోర్మూసుకుని ఇంట్లో కూర్చో..' అనలేదుగానీ, దాదాపు ఆ అర్థం వచ్చేలా ఓ మహిళా నేతని, ఇంకో మహిళా నేత విమర్శించడమంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.? పైగా బొమ్మాళీ అంటూ వెటకారమొకటి.
డీకే అరుణ అంటే, కేసీఆర్‌తో తలపడే స్థాయి వున్న వ్యక్తి. ఛాన్స్ దొరికితే పీసీసీ అధ్యక్షురాలిగా సత్తా చాటాలనుకుంటున్నారామె. గద్వాలని జిల్లా చెయ్యాలంటూ ఆమె నినదిస్తున్నారు. ఆందోళనలు చేశారు, నిరాహార దీక్షలంటున్నారు.. ఆమె తిప్పలేవో ఆమె పడ్తున్నారు. ఇక్కడ జిల్లాల లొల్లి పేరుతో చాలామంది నేతలకు రాజకీయంగా భవిష్యత్తు లేకుండా చెయ్యాలనే ప్రయత్నాలైతే తెలంగాణలో జరుగుతున్నాయి. ఇది వాస్తవం.
సరే ప్రభుత్వం వ్యూహాలు ప్రభుత్వానికి.. విపక్షాల తిప్పలు విపక్షాలవి.. ఇంట్లో కూర్చోమనడమేంటి మరీ కామెడీ కాకపోతే. ఎవర్ని ఎప్పుడు ఎలా ఇంట్లో కూర్చోపెట్టాలో ఓటర్లకు బాగా తెలుసు. రాజకీయాల్లో కొత్త కదా.. కేసీఆర్ కుమార్తె కవిత, కాస్తంత అత్యుత్సాహం చూపుతున్నారంతే. పాపం జేజెమ్మ, కవితకి కూడా సరైన కౌంటర్ ఇవ్వలేని దుస్థితిలో వున్నారు. చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత.. పార్టీలో అంతర్గత కలహాలకు కారణమై.. ఇదిగో, ఇలా తన ఇమేజ్‌ని తానే దిగజార్చేసుకున్నారు డీకే అరుణ. ఎనీ డౌట్స్.?