చంద్రబాబు కలలకు గొడ్డలి దెబ్బ!

వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అవుతోంటే... అందులో చంద్రబాబు కలలు దెబ్బతినడం అంటూ ఏం ఉంటుంది? ఆయన ఎప్పటికీ తాను ఉపరాష్ట్రపతి కోరుకునే తరహా వ్యక్తి కాదు కదా...? అనే అనుమానం ఎవ్వరికైనా కలుగుగుతంది. కానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి పనుల దృష్ట్యా చూసినప్పుడు, ఆ పనులకు కేంద్రం నుంచి నిధులు రాబట్టడం తప్ప వేరే గత్యంతరం లేదని గుర్తు చేసుకున్నప్పుడు.. వెంకయ్యనాయుడు కేంద్రం మంత్రిత్వం నుంచి ఉపరాష్ట్రపతి కేబిన్ లోకి వెళ్లిపోవడం వల్ల నష్టం ఉంటుందనే వాస్తవం బోధపడినప్పుడు కలలు కరిగిపోకుండా ఏమవుతుంది?

చంద్రబాబునాయుడు ఎన్ని ప్రకటనలతో, చక్కెరపూత పూసిన చేదువాస్తవాలను చెబుతూ వచ్చినా సరే.. గడచిన మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి నిర్దిష్టమైన అభివృద్ధి పనులు చోటు చేసుకోలేదు అన్నది... అమరావతి నగరం పేరిట కాజేసిన వేల ఎకరాల బంజరుభూముల నడిబొడ్డున నిలుచున్న శంకుస్థాపన శిలాఫలకాల సాక్షిగా నిజం. అయితే కనీసం కోర్ కేపిటల్ నిర్మాణానికి పూర్తి ఖర్చు తామే భరిస్తామని తేల్చేసిన తర్వాత.. వారి నుంచి నిధులు తీసుకువచ్చి ఎంతో కొంత పనుల్లో పురోగతి చూపించడం గురించి ఇప్పటిదాకా రాష్ట్రప్రభుత్వం ఏం శ్రద్ధ పెట్టిందనే దాఖలాలు లేవు.

అయితే ఇందులో చంద్రబాబునాయుడు వ్యూహం మరో రీతిగా ఉండవచ్చు. ఎన్నికలు ముంచుకువచ్చిన తర్వాత.. చివరి సంవత్సరంలో కొన్ని నిధులు తీసుకువచ్చి.. కోర్ కేపిటల్ గట్రా కొన్ని నిర్మాణాలకు పునాదులు వేసి, పిల్లర్లు లేపి.. ఈ భవనాలు సజావుగా పూర్తి కావాలంటే.. మళ్లీ నేను సీఎం కావాల్సిందే.. లేకపోతే.. ఈ పనులేవీ పూర్తి కావు. వీళ్లందరూ నేను మాట్లాడిన కాంట్రాక్టర్లు.. నేను రాబట్టిన నిధులు.. కాబట్టి ప్రజలారా మీకు వేరే గతిలేదు.. నాకే ఓటు వేసి గెలిపించండి అంటూ బ్లాక్ మెయిల్ రాజకీయం చేయాలనేది ఆయన వ్యూహాల్లో ఒకటి కావచ్చు.

కానీ ఇప్పుడు ఇలాంటి వ్యూహాలకు గొడ్డలిపెట్టు లాంటి పరిణామమే వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అవుతుండడం. చంద్రబాబునాయుడు కేంద్రం నుంచి ఏం ఆశించాడనేది కాదు.. కేంద్రం నుంచి సదరు నిధులు విడుదల అయ్యేలా లాబీయింగ్ చేసి, పనిని సానుకూలం చేయగల వారెవ్వరు అనేది చాలా కీలకమైన విషయం. ఇన్నాళ్లూ చంద్రబాబు తాను సాధించినట్లుగా టముకు వేసుకోవడానికి అయినా సరే.. కేంద్రం నుంచి ఏ సానుకూల పరిణామమైనా వచ్చిందంటే దాని మూలం వెంకయ్యనాయుడు చేసిన లాబీయింగ్ లోనే ఉన్నదన్నది స్పష్టం. Readmore!

పేరుకు తెలుగుదేశం పార్టీ తరఫున కూడా కొందరు ఎంపీలకు ఢిల్లీలో సమన్వయకర్తల పదవుల్ని కేబినెట్ హోదాతో కట్టబెట్టి.. పబ్బం గడుపుకున్నారు గానీ.. ఏపీ కి ఏ కొంత సాయం సిద్ధించినా అదంతా కూడా వెంకయ్య చలవే అన్నది మరచిపోకూడదు. ఒకవేళ చంద్రబాబు చివరి ఎన్నికల సంవత్సరంలో చక్రం తిప్పేయాలని అనుకుని ఉంటే.. ఆ కలలకు ఇప్పుడు ఆయన కేంద్రమంత్రివర్గం నుంచి తప్పుకోవడం అనేది పెద్ద గొడ్డలి దెబ్బ అవుతుంది.

ఇప్పటికే చాలా మంది ఏపీ మంత్రుల్లోనూ ఈ గుబులు మొదలైంది. చంద్రబాబునాయుడులో కూడా ఈ భయం చాలానే ఉన్నదని రాజకీయ వర్గాలు పేర్కొటున్నాయి. కేంద్ర కేబినెట్ లో వెంకయ్య లేకుండా పోవడం అనేది ఖచ్చితంగా తన అవకాశాలను ప్రభావితం చేస్తుందని ఆయన అనుకుంటున్నారని సమాచారం. వెంకయ్య నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధమైన చంద్రబాబు, చివరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం జరిగే కేబినెట్ భేటీలో కూడా రాష్ట్ర పురోగతి- కేంద్ర సాయం అంశాలపై వెంకయ్య ఎఫెక్ట్ గురించిన ఎజెండాయేతర చర్చ ఉండవచ్చునని అంతా అనుకుంటున్నారు.

Show comments