ఫ్లాప్ సినిమాకు సక్సెస్ సంబరాలు

దర్శకుడు పూరిజగన్నాధ్ తెరకెక్కించిన రోగ్ సినిమా ఫ్లాప్ అనే విషయాన్ని కొత్తగా చెప్పనక్కర్లేదు. రిలీజైన రోజే ఈ సినిమా ఫ్లాప్ అని తేల్చేశారంతా. మరి ఇలాంటి సినిమాకు సక్కెస్ మీట్ పెడితే ఎలా ఉంటుంది... సినిమా సూపర్ గా నడుస్తోందని గొప్పలు చెబుతుంటే ఎలా అనిపిస్తుంది...? సరిగ్గా ఇలాంటి సంఘటనలే ఈరోజు జరిగాయి. రోగ్ సినిమాకు సంబంధించి యూనిట్ అంతా కలిసి సక్సెస్ మీట్ పెట్టింది.

దర్శకుడు పూరిజగన్నాధ్ తో పాటు హీరో ఇషాన్, హీరోయిన్లు మన్నారా చోప్రా, ఏంజెలా ఈ సక్సెస్ మీట్ కు వచ్చారు. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు కూడా చెప్పారు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయని గర్వంగా ప్రకటించారు.

రోగ్ సినిమాను యూనిట్ అంతా కలిసి ఆకాశానికెత్తేస్తుంటే మీడియా వాళ్లు నవ్వు ఆపుకుండా ఈవెంట్ కవర్ చేశారు. ప్రెస్ మీట్ పూర్తయిన తర్వాత అందర్నీ కడిగేద్దామని వెయిట్ చేశారు. కానీ యూనిట్ అంత గ్యాప్ ఇవ్వలేదు. ఇలా సక్సెస్ మీట్ కంప్లీట్ అయిన వెంటనే పూరిజగన్నాధ్ తో సహా అంతా మాయమయ్యారు.

Show comments