హవాలాలో పెద్ద తలకాయలు..!?

ఉత్తరాంధ్రలో వెలుగుచూసిన హవాలా కుంభకోణంలో పెద్ద తలకాయలు ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. అధికార, ప్రతిపక్ష నాయకుల హస్తంతోనే ఇంతటి కధ నడిచిందని పోలీస్‌ వర్గాలే భావిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వడ్డి మహేష్‌, ఆయన తండ్రి శ్రీనివాసరావు ఈ ప్రాంతంలో ఓ బలమైన సామాజికవర్గం అండదండలతోనే సునాయాసంగా హవాలా స్కాంను నడిపించారని అంటున్నారు. కాంగ్రెస్‌ హయాంలో మొదలైన ఈ కధ తెలుగుదేశం వచ్చిన తరువాత కూడా కొనసాగడంతో రెండు పార్టీలలోనూ ఆ సామాజికవర్గానికి చెందిన కీలక నాయకులపై దర్యాప్తు సంస్ధల కన్నుపడుతోంది.

అయితే, వీరంతా రాజకీయంగా బాగా పలుకుబడి కలిగిన వారు కావడం, కీలకమైన స్ధానాలలో ప్రస్తుతం కొందరు ఉండడంతో ఈ హవాలా కుంభకోణంలోని అసలు నిజాలు వెలుగు చూసే అవకాశాలు ఉంటాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అధికార, విపక్ష నేతలు ఇందులో ఉన్నారని, అలాగే, విజయనగరం జిల్లాలో గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన పెద్దలతో పాటు, విశాఖ జిల్లాలోనూ ప్రస్తుత ప్రభుత్వంలో కీలక స్ధానంలో ఉన్నవారితోనూ నిందితులకు పరిచయాలు ఉన్నాయన్న సమాచారం దర్యాప్తు సంస్ధలకే ఆశ్చర్యం కలిగిస్తోంది. మొదట వందల కోట్ల కుంభకోణం అనుకున్నా తీగ లాగితే డొంకంతా కదిలిందన్న చందంగా వేల కోట్ల వరకూ పాకుతోందంటూ రాష్ట్రంలోనే అతి పెద్ద స్కాంగా పోలీసు అధికారులు దీనిని అభివర్ణిస్తున్నారు.

కేవలం రాజకీయ రంగానికి చెందిన వారే కాకుండా, ఇతర రంగాల ప్రముఖులు, బడా వ్యాపారవేత్తలు, బ్యాంకులకు చెందిన ఉన్నతాధికారుల హస్తం కూడా ఇందులో ఉందని కూడా చెబుతున్నారు. ఈ హవాలా రాకెట్‌ వెలుగు చూడగానే అధికార తెలుగుదేశం పార్టీ విపక్ష వైసీపీ పైనే మొదట వేలెత్తి చూపించి నానా హడావుడి చేసింది. ప్రధాన నిందితుడు వడ్డి మహేష్‌ ప్రస్తుతం ఉత్తరాంధ్ర వైసీపీలో కీలక నేతగా ఉన్న వారికి అతి సన్నిహితుడు కావడమే వారి సంబరానికి కారణం. అయితే, ఈ కేసును మరింతగా తవ్వి చూస్తే అధికార పార్టీ నేతల పేర్లు కూడా వినిపిస్తూండడంతో తమ్ముళ్లు గప్‌ చిప్‌ అయిపోయారు. దీనిపై శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, వైసీపీ సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు స్పందిస్తూ ఈ కుంభకోణంపై పూర్తిగా దర్యాప్తు చేయించి అసలు నిజాలను వెలికి తీయాలని డిమాండు చేయడంతో ఆయనపైన వేలు చూపించిన టీడీపీ నేతల నోళ్లు మూతపడ్డాయి.

అలాగే, హవాలా కుంభకోణం తెలుగుదేశం పార్టీ అసమర్ధ పాలనకు నిర్వాకం అంటూ వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించడమే కాకుండా పూర్తి దర్యాప్తునకు డిమాండు చేశారు. దీంతో వైసీపీ, టీడీపీల మధ్య ఈ హవాలాస్కాం రాజకీయ రచ్చకు దారి తీస్తోంది. ఈ తరహా కుంభకోణాలకు వైసీపీలోని అవినీతిపరులే స్ఫూర్తి అంటూ ఘాటైన విమర్శ చేసిన సీఎం సైతం ఇపుడు తమ పార్టీ వారు ఎవరు ఉన్నారన్న దానిపైనా ఆరా తీస్తున్నట్లుగా సమాచారం.

2013లో ప్రారంభమైన ఈ హవాలా కుంభకోణం గత నాలుగేళ్లుగా నిరాటంకంగా సాగుతున్నా పట్టించుకోలేదంటే ఇందులో మూడేళ్లుగా అధికారంలో ఉన్న టీడీపీ వైఫల్యం కూడా ఉందని అంటున్నారు. ఇంతటి ప్రాముఖ్యత సంతరించుకున్న ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న డిమాండును పక్కన పెట్టి సిఐడికి కట్టబెట్టడంపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ నాయకుల ప్రమేయం ఉండడం వల్లనే ఈ కేసును నీరు కార్చేందుకు యత్నిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి.

Show comments