పెరిగిన మోదీ ఇమేజ్‌...బీజేపీ హ్యాపీ....!

జీవితంలో మాదిరిగానే రాజకీయాల్లోనూ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఓ పరిణామంతో పడిపోతున్నవారు పైకి లేస్తారు. ఓ ఘటనతో పైకి లేచినవారు పడిపోతారు. ప్రస్తుతం బీజేపీ పరిస్థితి పడిపోతున్నవారు పైకి లేచినట్లుగా ఉంది. భారత్‌-పాకిస్తాన్‌ మధ్య భీకర యుద్ధం జరుగుతుందో లేదో చెప్పలేంగాని రెండు దేశాల మధ్య ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం విజయవంతంగా దాడులు (సర్జికల్‌ స్ట్రయిక్స్‌) చేసి కొందరు ఉగ్రవాదులను మట్టుబెట్టడంతో ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. 

మోదీకి బద్ధ శత్రువులైన పార్టీలు కూడా ఇప్పుడాయన్ని ప్రశంసిస్తున్నాయి. సైన్యానికి సలామ్‌ చేస్తూనే మోదీ వ్యూహ చతురతను, ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాయి. ఉరి ఘటనకు ముందువరకు వివిధ అంశాలపై మోదీ మీద తీవ్రంగా విమర్శలు గుప్పించిన పార్టీలు ఇప్పడాయన్ని ప్రశంసించక తప్పడంలేదు. అన్ని పార్టీలూ ఆయనకు అంటే బీజేపీ సర్కారుకు పూర్తిగా మద్దతు ప్రకటించాయి. సైన్యం దాడులను సంపూర్ణంగా సమర్థించాయి. మోదీ అంటే అస్సలు పడని కమ్యూనిస్టు పార్టీలు సైతం పాకిస్తాన్‌ పట్ల ప్రభుత్వం అనుసరించిన వ్యూహాన్ని సపోర్టు చేశాయి. 

కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మోదీని బాగా మెచ్చుకున్నారు. గత రెండున్నరేళ్లలో మొదటిసారి ప్రధానిగా వ్యవహరించాల్సిన తీరులో వ్యవహరించారని అన్నారు. సైనిక దాడులను సమర్ధిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం ఏ పార్టీ అయినా మోదీకి, సైనిక దాడులకు వ్యతిరేకంగా మాట్లాడితే జనం దేశద్రోహులుగా ముద్ర వేసే ప్రమాదముంది. ఇక బీజేపీ, దాని మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) ఆనందానికి అవధుల్లేవు. అలాగే  మిత్రపక్షమైన శివసేనలోనూ ఉత్సాహం ఉరకలేస్తోంది. అది ఇండియాకు సినిమాల షూటింగుల కోసం వచ్చిన పాకిస్తానీ నటీనటులను, ఇతర కళాకారులను బెదిరిస్తూ వెళ్లగొడుతూ అత్యుత్సాహం ప్రదర్శించడంపై  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

బీజేపీ మంత్రులు, నాయకులు సాధారణంగానే మోదీ భజన చేస్తుంటారు. పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన సీనియర్‌ నాయకుడు, కేంద్ర మంత్రి అయిన వెంకయ్య నాయుడు మోదీకి అపర భక్తుడిగా మారిపోయిన వైనం చూస్తున్నాం. సాధారణ పరిస్థితిలోనే భజన చేస్తున్న బీజేపీ నేతలు ఇప్పుడు కిందా మీదా నిలవడంలేదు. పోటీలుపడి కీర్తిస్తున్నారు. కొందరు ఆయన్ని ధైర్యంలో దివంగత ఇందిరా గాంధీతో పోలుస్తున్నారు. 1971లో బంగ్లాదేశ్‌ విముక్తి కోసం ఆమె పాక్‌పై యుద్ధం ప్రకటించి ఆ దేశాన్ని చావుదెబ్బ తీశారు. 

వాస్తవానికి ఆ సమయంలో పాక్‌ ఇండియా వశమైంది కూడా. కాని మానవతా దృక్పథంతో, మరో దేశాన్ని దురాక్రమించారన్న చెడ్డ పేరు రాకూడదన్న ఉద్దేశంతో సైన్యాన్ని వెనక్కి రప్పించారు. అప్పట్లో బీజేపీ అగ్రనాయకుడు అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఇందిరను 'అపర దుర్గాదేవి'గా కీర్తించారు. మోదీ కూడా ఇందిరిలా ధైర్యంగా వ్యవహరించారని కమలం పార్టీ నేతలు ప్రశంసిస్తున్నారు. 'వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచి అధికారంలోకి వస్తాం'...అని వెంకయ్య నాయుడు అన్నారు. అంటే పాక్‌పై సైన్యం దాడులు బీజేపీకి రాజకీయ ప్రయోజనం కలిగిస్తున్నాయని అర్థం. 

మోదీని గొప్ప హీరోగా ప్రచారం చేసి ఓట్లు కొల్లగొట్టాలని బీజేపీ నాయకుల వ్యూహం. వచ్చే ఏడాది ఉత్తరప్రదేవ్‌, మరి కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. పాక్‌పై దాడుల ప్రభావం తప్పనిసరిగా ఆ ఎన్నికలపై ఉంటుంది. గతంలో ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఒక్క అసోం మినహా మిగిలిన రాష్ట్రాల్లో కాషాయ పార్టీ దారుణంగా ఓటమి పాలైంది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పరిస్థితి అలాగే ఉంటుందా? అని బీజేపీ నేతలు భయపడుతున్నారు. కాని ఇప్పుడు ఈ ఘటనతో ఆత్మవిశ్వాసం పెరిగింది. 

పార్టీ పరిస్థితి బలహీనంగా ఉన్నప్పటికీ మోదీ ఇమేజ్‌తో బలం పుంజుకోవచ్చని అనుకుంటున్నారు. సాధారణంగా మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయిని గొప్ప ప్రధానుల్లో ఒకడిగా బీజేపీలో చెప్పుకుంటారు. జనం అభిప్రాయం కూడా అదే. కాని ఇప్పుడు మోదీ ఇమేజ్‌ ముందు వాజ్‌పేయి ఇమేజ్‌ తగ్గిపోయింది. మీడియా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ఆంగ్ల మీడియా మోదీని ఆకాశానికెత్తుతోంది. భారత సైన్యానికి మోదీ ఇచ్చినంత ధైర్యాన్ని వాజ్‌పేయి ఇవ్వలేదని ఓ పత్రిక రాసింది.

మన్మోహన్‌ సింగ్‌ పదేళ్లు ప్రధానిగా ఉన్నా విపత్కర పరిస్థితిలో ఆయన ధైర్యంగా వ్యవహరిస్తారని ప్రజలు ఏనాడూ అనుకోలేదని మరో పత్రిక అభిప్రాయపడింది. ఏది ఏమైనా మోదీ ధైర్యంగా వ్యవహరించిన తీరు, అంతర్జాతీయంగా పాక్‌ను ఏకాకిని చేసిన వైనం, పాక్‌కు వ్యతిరేకంగా ప్రపంచదేశాల మద్దతు కూడగట్టిన చతురత బీజేపీకి కలిసొచ్చే అంశాలు. వచ్చే సాధారణ ఎన్నికల వరకు ఆయన హీరోయిజం ప్రభావం కొనసాగితే మరోసారి పీఠం దక్కుతుందేమో...!

Show comments