సరదాకి: ఓసోస్‌ లక్ష కోట్లే కదా.!

ఏం చేసినాసరే, అది హై లెవల్‌లో వుండాలనుకుంటారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. రాజధాని నిర్మాణం కోసం అటూ ఇటూగా లక్షన్నర కోట్లు పైనే ఖర్చవుతుందని చంద్రబాబు అంచనాలేస్తే, కేంద్రం రెండు వేల కోట్ల రూపాయలు విదిలించి, 'ఇంతే, ఇక ఇవ్వలేం..' అని చేతులెత్తేసింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన సందర్భంగా, ఆంధ్రప్రదేశ్‌కి కలిగే నష్టాల్ని ఏకంగా 5 లక్షల కోట్లకు పైనే తేల్చారు చంద్రబాబు. 

చంద్రబాబుకి అదో సరదా.! వైఎస్‌ జగన్‌ మీద విమర్శలు చేయడానికైనాసరే, రాజధాని కట్టాలన్నాసరే, ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి పథంలో నడిపించాలన్నాసరే.. అన్నిటికీ ఒకటే మంత్రం.. అదే లక్ష కోట్ల మంత్రం. జగన్‌ అవినీతిని లక్ష కోట్లుగా ఇదే చంద్రబాబు అభివర్ణించి, పుస్తకాలేసిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.? లక్ష కోట్లు అనేది చంద్రబాబు మైండ్‌లో అలా ఫిక్సయిపోయింది మరి.! 

ఏమో, ఈ లక్ష కోట్ల మేనియా ఏమోగానీ, తాజాగా పోలవరం ప్రాజెక్టు అంచనాల్ని లక్ష కోట్లకు టచ్‌ చేయించాలనే ఉద్దేశ్యం ఆయనలో స్పష్టంగా కన్పిస్తోంది. పదేళ్ళలో పోలవరం ప్రాజెక్ట్‌ అంచనాలు కనీ వినీ ఎరుగనిస్థాయిలో పెరిగిపోయాయి. మొన్నటికి మొన్న ఇరవై వేల కోట్లన్నారు.. ఆ తర్వాత 30 వేల కోట్లకు తేల్చారు.. ఇప్పుడు తాజా లెక్కలు 40 వేల కోట్ల మార్క్‌ని దాటేశాయి. ఇంకో ఆర్నెళ్ళో ఏడాదో దాటితే ఆ మొత్తం 50 వేల కోట్లు దాటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే.. అన్న చందాన, పోలవరం ప్రాజెక్ట్‌ అంచనాల్ని రానున్న నాలుగైదేళ్ళలోనే లక్ష కోట్ల మార్క్‌ని టచ్‌ చేసేలా చంద్రబాబు సరికొత్త ప్రతిపాదనలు చేయొచ్చుగాక. ఆగండాగండీ, 2018 మే నాటికల్లా పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తయిపోతుందని టీడీపీ చెబుతోంది. హమ్మయ్యా.. అనుకోకండి. అది, ఓ దశ మాత్రమే. పూర్తిస్థాయిలో ప్రాజెక్ట్‌ కార్యరూపం దాల్చాలంటే, ఇంకెన్నేళ్ళు పడుతుందో.! 

అసలు ఏ ప్రాజెక్ట్‌కి అయినా అంచనాలెందుకు పెరుగుతాయి.? అంటే, మొదటి కారణం ఆలస్యం. ఆ తర్వాతి కారణం, కాంట్రాక్టర్లకు దోచి పెట్టడానికి. ఇక్కడ కాంట్రాక్టర్లు ఎవరయ్యా.? అంటే, ఆటోమేటిక్‌గా అధికార పార్టీకి చెందిన నేతలే. అయితే, వాళ్ళంతా తెరవెనుక వుంటారు. రాజకీయాలన్నాక ఖర్చులుంటాయి కదా.! అందుకే మరి, అంచనాలు పెంచేసి, కాసులు జేబుల్లో వేసుకునేది. 

పది వేల కోట్లు ఇవ్వడానికే కేంద్రం ఒకప్పుడు ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించేసింది. రెండేళ్ళలో జస్ట్‌ వెయ్యి కోట్లు కూడా ఇవ్వలేకపోయింది నరేంద్రమోడీ సర్కార్‌, పోలవరం ప్రాజెక్ట్‌ కోసం. తాజాల అంచనాల ప్రకారం చూసుకుంటే 40 వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఎన్నేళ్ళు పడుతుందట.? అయినా, జాతీయ ప్రాజెక్టుకి రాష్ట్రం అంచనాలేసెయ్యడం, కేంద్రాన్ని భయపెట్టడం.. ఏందయ్యా చంద్రయ్యా ఈ లొల్లి.!

Show comments